TSRTC: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు టీఎస్‌ఆర్టీసీ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు టికెట్లపై రాయితీలు కూడా ప్రకటిస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికులకు మరో శుభవార్త అందించింది. బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు బస్సుల్లో ప్రయాణికులు టికెట్ కోసం ఆన్‌లైన్ పేమెంట్ చేసే అవకాశం కల్పించనుంది. ఇందుకోసం ఐటిమ్స్ అందుబాటులోకి తీసుకురానుంది.
పైలెట్ ప్రాజెక్టుగా..
తొలుత పైలట్ ప్రాజెక్టుగా బండ్లగూడ డిపో పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన పేమెంట్ అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు, మెట్రో బస్సుల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. యూపీఐ యాప్‌లతోపాటు డెబిట్, కార్డుల ద్వారా టికెట్ కోసం పేమెంట్ చేయవచ్చు.
చిల్లర సమస్యకు చెక్..
బస్సుల్లో టికెట్ తీసుకునేటప్పుడు చిల్లర సమస్య ఏర్పడుతుంది. కండక్టర్ దగ్గర చిల్లర లేకపోవడంతో ప్రయాణికులతో ఇబ్బంది అవుతుంది. దీని వల్ల కండక్టర్, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిల్లర సమస్య లేకుండా చేసేందుకు ఆన్‌లైన నగదు లావాదేవీలను ప్రోత్సహించాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.
ఎప్పటి నుంచో ప్రతిపాదన..
ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్ ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అయితే సాంకేతిక పరమైన సమస్యల కారణంగా దీనిని అమలు చేయడంలో జాప్యం పరిగింది. ఎట్టకేలకు అన్ని అవాంతరాలను అధిగమించి అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించింది. ఎలాంటి సమస్యలు తలెత్తకుంటే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే టికెట్ రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ సౌకర్యం గతంలో అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు అదే విధానం బస్సుల్లో కూడా తీసుకురానుంది.
నగదు కూడా..
ఆన్‌లైన్ పేమెంట్‌తోపాటు నగదు కూడా తీసుకోనున్నారు. గ్రామీణులకు యూపీఏ పేమెంట్స్‌పై అవగాహన ఉండదు. అంతేకాకుండా రూరల్ ఏరియాల్లో నెట్‌వర్క్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నగదు చెల్లింపు కొనసాగిస్తూనే అదనంగా ఆన్‌లైన్ పేమెంట్ సిస్టం అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ నిర్ణయించింది.