
HBD Ram Charan: ఒక లెజెండ్ కడుపున పుట్టడం గొప్ప అదృష్టం. అయితే అంతకు మించిన బాధ్యత. సామాన్యుల మీద అంచనాలు ఉండవు. ఒక సక్సెస్ ఫుల్ హీరోగా చరిత్ర సృష్టించిన వ్యక్తి వారసత్వం కత్తి మీద సాములాంటిదే. ప్రతి విషయంలో పోలికలు, అంచనాలు ఉంటాయి. ఏమాత్రం వెనక్కి తగ్గినా ఎగతాళి చేయడానికి ఓ వర్గం సిద్ధంగా ఉంటుంది. అలాంటి అవమానాలు, విమర్శల నుండి ఎదిగిన హీరో రామ్ చరణ్. దశాబ్దాల పాటు సిల్వర్ స్క్రీన్ పై ఏకఛత్రాధిపత్యం చేసిన మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు.
నటనలో శిక్షణ తీసుకున్న రామ్ చరణ్ 2007లో చిరుత మూవీతో హీరో అయ్యారు. రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చే నాటికి ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్, ప్రభాస్ స్టార్ డమ్ సాధించారు. బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి నువ్వా నేనా అన్నట్లు కుమ్మేస్తున్నారు. పరిశ్రమలో తీవ్ర పోటీ వాతావరణం నెలకొని ఉంది. చరణ్ ని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత చిరంజీవి పూరి జగన్నాధ్ కి అప్పగించారు.
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు.. మొదటి సినిమాతోనే రామ్ చరణ్ తన మార్క్ క్రియేట్ చేశారు. డాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవిని మరిపించారు. చిరుత హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక రెండో చిత్రంతోనే చరణ్ ఇండస్ట్రీ హిట్ నమోదు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. మగధీర టాలీవుడ్ గత రికార్డ్స్ మొత్తం చెరిపేసింది. చరణ్ కి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

బాలీవుడ్ లో పాగా వేయాలని చూసి రామ్ చరణ్ భంగపడ్డారు. జంజీర్ రీమేక్ ఆయన పరువు తీసింది. ఆయన లుక్, యాక్టింగ్ మీద బాలీవుడ్ మీడియా దారుణ వార్తలు రాసింది. అసలు చరణ్ కి నటన రాదని ఒక సర్టిఫికెట్ జారీ చేశారు. అప్పుడు రామ్ చరణ్ మానసిక ఒత్తిడికి గురయ్యారు. తనకు నటన రాదన్న వాళ్లకు రంగస్థలం మూవీతో సమాధానం చెప్పాడు. చెవిటి చిట్టిబాబు పాత్రలో ఒదిగిపోయి నటించాడు. రంగస్థలం రామ్ చరణ్ కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది.
ఆర్ ఆర్ ఆర్ లో రామరాజుగా ప్రపంచాన్ని తన మాయలో పడేసుకున్నాడు. అమెరికన్ ఇండస్ట్రీ ఆయన నటనకు ఫిదా అయ్యింది. గుడ్ మార్నింగ్ అమెరికా వంటి ప్రఖ్యాత షోకి అతిథిగా ఆహ్వానించిబడ్డారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు వేడుకకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు. హెచ్ సీ ఏ ‘స్పాట్ లైట్’ అవార్డుతో సత్కరించింది. ఇక ఇండియాకు ఆస్కార్ తేవడంలో తన వంతు పాత్ర వహించారు. నాటు నాటు సాంగ్ లో అద్భుత పెర్ఫార్మన్స్ ఇచ్చారు. హాలీవుడ్ మేకర్స్ ఆయనతో సినిమాలు చేసే స్థాయికి చరణ్ వెళ్ళాడు. విమర్శలను సవాళ్లుగా స్వీకరించి దేశం గర్వించే స్థాయికి చరణ్ ఎదిగారు. తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు.