https://oktelugu.com/

BRS MLAs: ఆ నలుగురిని హరీశ్‌రావే పంపించారా.. మాజీ మంత్రి మౌనం వీడేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. ఆయనను ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు మంగళవారం కలిశారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 24, 2024 / 05:02 PM IST
    Follow us on

    BRS MLAs: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీట్‌ ఎక్కాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం (జనవరి 23న) సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయల్లో త్వరలో మార్పులు జరుగబోతున్నాయా? అధికార కాంగ్రెస్‌ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టిందా? బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

    ఏం జరిగిందంటే..
    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని ఇటీవలే రాష్ట్రానికి వచ్చారు. ఆయనను ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు మంగళవారం కలిశారు. ఒకేసారి నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. వీరంతా కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు ఎమ్మెల్యేల్లో సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో పనిచేశారు. ఇక కొత్త ప్రభాకర్‌రెడ్డి గులాబీ బాస్‌ కేసీఆర్‌కు సన్నిహితుడు. మహిపాల్‌రెడ్డి, మణిక్‌రావు మొదటి నుంచి కేసీఆర్‌ వెంటనే నడుస్తున్నారు.

    హరీశ్‌రావే పంపించారా?
    ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లాపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేనల్లుడు హరీశ్‌రావుకు మంచి పట్టు ఉంది. ఆ జిల్లా పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకుంటున్నారు. చీమ చిటుక్కుమన్నా హరీశ్‌రావుకు తెలిసిపోతుంది. అలాంటిని నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ఇప్పుడ బీఆర్‌ఎస్‌లోనూ చర్చనీయాంశమైంది. హరీశ్‌రావుకు ఈ విషయం తెలియదని సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ, దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరీశ్‌రావే వారిని పంపించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనకు తెలియకుండా వెళ్లడం సాధ్యం కాదని బీఆర్‌ఎస్‌ భవన్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

    కుటుంబంలో ముసలం?
    ఇదిలా ఉండగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ గొడవల కారణంగానే కేసీఆర్‌ జారి పడ్డారని కూడా సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కేసీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వారికి తెలియకుండా సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంపై గులాబీ భవన్‌లోనూ గుసగుసలు మొదలయ్యాయి. కుటుంబంలో విభేదాల కారణంగానే హరీశ్‌రావు నలుగురు ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌ వద్దకు పంపించారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈమేరకు ఆరోపణ చేశారు. ఇప్పుడు నలుగురని, త్వరలో 26 మంది అవుతారని కూడా జోష్యం చెప్పారు.

    మాజీ మంత్రి మౌనం?
    నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలవడంపై తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బీజేపీ నేతలు అయితే హరీశ్‌రావుపైకే గురిపెట్టారు. ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు మాత్రం తాము ఎవరికీ ఈ విషయం చెప్పలేదని, నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే కలిశామని అంటున్నారు. పార్టీ మారే ఉద్దేశం లేదని చెబుతున్నారు. కానీ, జిల్లా బాధ్యతలు చూసే హరీశ్‌రావు మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు. దీంతో పుకార్లు మరింతగా పెరుగుతున్నాయి.