Bharat Ratna : భారత అత్యున్నత పౌర పురస్కారం ఈసారి తెలుగోడిని వరించింది. మాజీ ప్రధాని, పక్క తెలంగాణ బిడ్డ అయిన పీవీ.నర్సింహారావుకు కేంద్రం భారత రత్న శుక్రవారం ప్రకటించింది. పీవీతోపాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్.స్వామినాథన్‌కు కేంద్రం భారత రత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు.
ఇదీ పీవీ ప్రస్థానం..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పీవీ.నర్సింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1957లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 1967, 1972లో వరుసగా మంథని ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
రెండోసారికే మంత్రి పదవి..
పీవీ నర్సింహారావు ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాతనే పీవీని మంత్రి పదవి వరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
రెండేళ్లు ముఖ్యమంత్రిగా..
ఇక పీవీకి 1971లో అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి వరించింది. నాటి పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండేళ్లు ఆ పదవిలో కనసాగిన ఆయన ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత 1984, 1989లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
అనూహ్యంగా ప్రధాని పదవి..
1991లో అనూహ్యంగా పీవీని అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ఆయన ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు.
ఒకే ఏడాది ఐదుగురికి భారత రత్న..
భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్నను ఈ ఏడాది కేంద్రం ఐదుగురికి ప్రకటించింది. మొదట బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు తర్వాత బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే.అధ్వానీకి భారత రత్న ప్రకటించింది. తాజాగా పీవీ.నర్సింహారావు, చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు భారత రత్న ప్రకటించింది.