Nara Lokesh- Pawan Kalyan: గత ఎన్నికలకు ముందు వైసీపీ ఆడిన పొలిటికల్ గేమ్స్ అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియా వేదికగా చేసుకొని ప్రత్యర్థుల మధ్య మంట పెట్టి మరీ వైసీపీ చలి కాచుకుంది. చివరకు కొందరు సినిమా ఆర్టిస్టులను అడ్డం పెట్టుకొని మరీ రాజకీయ ఆరోపణలు చేయించి అనుమానాలు పెంచడంలో సక్సెస్ అయ్యింది. పొలిటికల్ గా ఎంత మైలేజ్ తెచ్చుకోవాలో అంతగా తెచ్చుకుంది. అయితే రాజకీయ ప్రత్యర్థుల మధ్య అనుమానాలు రేపడం వెనుక వైసీపీ మైండ్ గేమ్ బయటపడింది. అప్పటికే విపక్షాలకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి ట్రాప్ లో పడకుండా విపక్షాలు జాగ్రత్త పడుతున్నాయి. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. త్వరలో పవన్ వారాహి బస్సు యాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు టీడీపీ, జనసేనల మధ్య పొత్తులపై సానుకూల వాతావరణం ఉంది. ఇటువంటి తరుణంలో తాజాగా లోకేష్ పవన్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిపోయాయి.

పాదయాత్రకు ముందు కుప్పం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. ఒక లైన్ తీసుకొని రాజకీయ విమర్శలు చేశారు. ఎక్కడా గీత దాటకుండా వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రలకు అనుమతులు, ఇతర అంశాలపై మాట్లాడినప్పుడు పవన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రధాన పవన్ వారాహి యాత్రను గుర్తుచేశారు. యువగళం పాదయాత్రను, పవన్ వారాహి యాత్రను అడ్డుకోవాలని చూస్తే తొక్కుకుంటూ ముందుకెళతామని ప్రభుత్వానికి హెచ్చరికలు పంపారు. అయితే పాదయాత్ర ప్రారంభంలో పవన్ యాత్ర మాట ఎత్తడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రధానంగా టీడీపీ శ్రేణులు భిన్నంగా స్పందిస్తున్నాయి. పవన్ ప్రస్తావన చేయడం మంచి విధానం కాదేమోనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. పవన్ ను టీడీపీ శ్రేణులపై రుద్దే ప్రయత్నం చేయడం ఎంతవరకూ కరెక్ట్ అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు.
గత ఎన్నికల్లో పవన్ ఒంటరి పోరాటం చేశారు. అప్పటి వరకూ కలిసి ఉన్న టీడీపీని విడిచిపెట్టి సొంతగానే పోటీచేశారు. ఈ క్రమంలో నాడు పవన్ లోకేష్ నే టార్గెట్ చేసుకున్నారు. మంత్రిగా ఉన్న లోకేష్ కు చెన్నైకు చెందిన శేఖర్ రెడ్డి బినామీగా ఆరోపణలు చేశారు. అటు తరువాత ఆ ఆరోపణను సవరించుకుంటూ అందరూ అనుకుంటున్నారని పవన్ చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో పవన్ వైసీపీ ట్రాప్ లో లోకేష్ విషయంలో అతిగా స్పందించినట్టు కామెంట్స్ వినిపించాయి. పవన్ పై నటి శ్రీరెడ్డి ఆరోపణలు వెనుక లోకేష్ ఉన్నారని నమ్మించడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. వాటి ఫలితమే లోకేష్ పై పవన్ కామెంట్స్ అన్న ప్రచారం అప్పట్లో జరిగింది. అక్కడకు కొద్దిరోజులకే అది వైసీపీ వేసిన స్కెచ్ గా తేలింది.

అయితే పవన్ విషయంలో లోకేష్ ఎప్పుడూ అతి చేయలేదు. ఎన్నికల తరువాత కూడా పవన్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అవన్నీ వైసీపీ ఆడిన గేమ్స్ గా భావించి లోకేష్ సైలెంట్ గా ఉన్నారు. గతంలో పవన్ తనపై చేసిన ఆరోపణలు గురించి మరిచి ఇప్పుడు లోకేష్ మద్దతుగా మాట్లాడుతుండడాన్ని జనసేన శ్రేణులు గమనిస్తున్నాయి. కలిసి పనిచేయాలనుకున్నప్పుడు కొన్ని ప్రతికూల అంశాలను విడిచిపెట్టాలన్నదే లోకేష్ అభిమతంగా వారు భావిస్తున్నారు. పవన్ తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్టు లోకేష్ సంకేతాలు పంపారని.. అందుకే వారాహి యాత్రను గుర్తుచేశారంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి.