Journalism : రాసేవాడిని విలేకరి అంటారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చేవాడిని రిపోర్టర్ అంటారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసేవాడిని న్యూస్ రిపోర్టర్ అంటారు. బెదిరించేవాడిని ఏమనాలి? దోచుకునేవాడికి ఏం పేరు పెట్టాలి? అడ్డగోలుగా రాసేవాడిని ఎలా పిలవాలి? అలాంటివాడు జర్నలిస్టా? లేక ఎర్నలిస్టా? సమాజాన్ని రాక్షసుల్లాగా ఇబ్బంది పెడుతున్న కొంతమంది పాత్రికేయులను.. దాయి శ్రీశైలం అనే పాత్రికేయుడు ఏమంటున్నాడంటే..
బండి మీద ప్రెస్ అని రాసివున్న ప్రతోడు జర్నలిస్టేనా.?
జేబులో ప్రెస్ కార్డున్న అందరూ రిపోర్టరేనా.?
చేతిలో గొట్టమున్నొళ్లంతా విలేకరేనా.?
ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నారు వీళ్లంతా.?
ఎవడు తీసుకొస్తున్నాడసలు.?
వ్యవస్థలో ఉండే లోపమే వీళ్లను తీసుకొస్తుంది. చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షించాల్సిన లీడర్.. పోలీస్.. ప్రభుత్వ ఉద్యోగి అవినీతి.. అక్రమాలు చేసి.. వాళ్లను వాళ్లు కాపాడుకోవడం కోసం ఇలాంటి బేకార్‌గాళ్లను జర్నలిస్టుల పేరుతో పెంచి పోషిస్తుంటారు. పోలీస్ స్టేషన్లో జరిగే వ్యవహారాలు బయట పడొద్దంటే జర్నలిస్టులను చేతిలో ఉంచుకోవాలె.
ప్రభుత్వ స్థలాలు.. ప్రజా ధనం కొల్లగొట్టాలంటే ఓ నాలుగు బిస్కెట్లు జర్నలిస్టులు అని చెప్పుకునే వారికి విసిరేయాలి.
దీనివల్ల ఏమవుతుందీ.? వ్యవస్థ అలుసవుతుందీ. మాకెవడూ భయపడడూ.. మేం నాలుగు వార్తలు రాస్తమని బెదిరిస్తే అందరూ బెదురుతారు.. అక్రమ ఇసుక.. అక్రమ మట్టి.. అక్రమ వెంచర్లు.. అక్రమ కట్టడాలు.. ఇంకా ఎన్నో సక్రమం అనే ప్రచారం జరగాలంటే అక్రమాలకు పాల్పడుతున్న వారితో జర్నలిస్టులకు ఫాయిదా ఉండాలె.
ఇప్పుడదే జరుగుతోంది. అందుకనే జర్నలిజం పేరుతో చెలరేగిపోతున్నారు.. విర్రవీగిపోతున్నారు.. ఈజీ సంపాదన.. బ్లాక్‌మెయిలింగ్ మోజులో పడి అమాయకుల జీవితాలను ఆగం చేస్తున్నారు. ఈ బిస్కెట్లు అందరికీ అవసరమే కదా.?
అందుకే ఆగడాలు నడవాలంటే ఇన్‌చార్జికో బిస్కెట్.. బ్యూరోకో బిస్కెట్.. ఎడిటర్‌కో బిస్కెట్ ఏస్తాడు. ఇంకేముందీ..
అయ్యగారు ఆడిందే ఆట.. పాడిందే పాట.!
ఇగ.. ఇక్కడి నుంచి ఆట మొదలవుతుంది. ఇదేదో బాగుందని వాణ్ని చూసి ఇంకోడు మీడియాలోకి వస్తాడు. గొట్టంలో నాలుగు మాటలు మాట్లాడి వాడూ జర్నలిస్టే అని చెప్పుకుంటాడు. తిరుగుతాడు. సంపాదిస్తాడు. చాలదన్నట్టు ఎగబడి తెగబడతాడు.!
ప్రెస్మీట్ పెడితే వంద నూటయాబై గొట్టాలు కనిపించేంత రద్దీ అయిపోతుంది జర్నలిజం.!
సిగ్గుపోతుందిరా బై..
నేనీ మధ్యనొక ఇల్లు స్టార్ట్ చేశాను.
దానికోసం లోన్ పెడితే నవ్వుతున్నారు జనాలు.
ఇంత పెద్ద జర్నలిస్టువు లోన్ పెట్టి ఇల్లు కడతావే అనీ.
ఫలానా వాడు చూడూ పైసా అప్పులేకుండా ఇల్లు కట్టిండు.. కార్ తీసుకుండు.. అక్కడ ప్లాటుందీ.. ఇక్కడ ప్లాటుందీ.. ఎమ్మెల్యే దగ్గర పతారె.. మంత్రి దగ్గర మర్యాద.. నెలకోసారి టూరు.. గట్లుండాలె జర్నలిస్టులూ అనేది వారి వాదన.
ఏంచేస్తం మరీ..
పద్నాలుగేండ్ల జర్నలిస్టును.
పనిలేక పరిశోధనాత్మక కథనాలు రాస్తిని.
మనసున పట్టక మానవీయ కథనాలు రాస్తిని.
వినక విశ్లేషణాత్మక కథనాలు రాస్తిని.
ఇంకా.. ఇవన్నీ బైలైన్ ఆర్టికల్సే.
పత్రికా విభాగంలో నాకంటూ ఒక గుర్తింపు.. ఉత్తమ జర్నలిస్టు అనే అవార్డును.. ప్రత్యేక రచనా శైలిని సొంతం చేసుకుంటిగానీ.. ఏ ఒక్కసారిగూడ నేను ప్రెస్స్ అని గట్టిగా అనకపోతి ఎవనికీ దమ్కీ ఇయ్యకపోతి.
నిజంగా నాదేం జర్నలిజం బ్రో.? టూ…..
జర్నలిస్టంటే దందాలు చెయ్యాలె..
చందాలు వసూలు చెయ్యాలె..
పీక్కతినాలె..
రోతలు రాయాలె..
కూతలు కూయాలె.!
వందకూ రెండు వందలగ్గూడ ప్రెస్ కార్డు చూపిచ్చి హల్‌చల్ చేయాలె.
ఇగ ఇదంతా ఎందుకు చెప్తున్ననో తెలుసు కదా.?
పాపం..
జర్నలిస్టుల వేధింపులు తట్టుకోలేక ఒక వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు రంగారెడ్డి జిల్లా టంగుటూరు అనే గ్రామంలో.
ఈ పాపం ఎవడిదీ.?
సరే ఇప్పుడు వాల్లను రిమాండ్‌కు పంపించిండ్రు..
ఏమైతదీ..
మల్లా బైటికొస్తారు.
ఆ పేపర్ కాకపోతే ఇంకో పేపర్లోనో.. టీవీలోనో చేరతారు.
ఇన్‌చార్జికి లక్షనో రెండు లక్షలో ఇచ్చి మల్లా జర్నలిస్టును అని చెప్పుకొని తిరుగుతనే ఉంటారు.
పైసలిచ్చెటంత ఉందా అనే డౌటనుమానాలొద్దు బ్రో.
మా దగ్గర ఒక స్ట్రింగర్‌ని పెట్టుకోవడానికి ఒక పత్రికా ఎడిటర్ అక్షరాలా పది లక్షల రూపాయలు తీసుకున్నాడు.. జిల్లా రిపోర్టర్ ఐదు లక్షల రూపాయలు తీసుకున్నాడు అని అప్పట్లో పెద్ద చర్చనే జరిగిందీ.
పది పదిహేను లక్షలు ఇచ్చి ఎడిటర్లను.. జిల్లా రిపోర్టర్లను కొని పారేసి తమ దందా తాము చేసుకునే జర్నలిస్టులున్నప్పుడు ఎవడికి ఏమవుతుందీ.?
ఈ జైళ్లు.. రిమాండులు ఓ లెక్కనా?
– దాయి శ్రీశైలం ( Daayi Sreeshailam)