
Modi Vs Opposition Parties: దేశంలో అవినీతి, అక్రమార్కులను రూపుమాపాల్సిన నిఘా, దర్యాప్తు సంస్థలు దారితప్పుతున్నాయనే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తరువాత మరింత శ్రుతిమించాయని యాంటి బీజేపీ రాష్ట్రాలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క అవినీతి మచ్చ కూడా 15 ఏళ్లలో కనబడలేదా అని ప్రశ్నిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బీజేపీలో చేరితే ఒక్కసారిగా శుద్ధమైపోవడం ఏమిటని అంటున్నాయి.
తాజాగా కేంద్రంలోని అధికార బీజేపీపై విపక్షాలన్నీ కాలుదువ్వాయి. ఆర్థికంగా రావాల్సిన నిధుల్లో కోత పెడుతూనే, ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడుతున్నారు. ఇదే విషయమై బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యాయి. కాంగ్రెస్ తో సహా 13 రాష్ట్రాల పార్టీలు సుప్రీం కోర్టుకెక్కాయి. సీబీఐ, ఈడీలను బీజేపీ పెద్దలు తమ ఆధీనంలో ఉంచుకొని తోలుబొమ్మల్లాగా ఆడిస్తున్నాయని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు కూడా నిస్పక్షపాతంగా వ్యవహరించం లేదని అంటున్నాయి. సీబీఐ, ఈడీ సంస్థలను ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఉపయోగించుకుంటుందని సుప్రీంకు సమర్పించిన పిటీషన్లో పేర్కొన్నాయి.

బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ), శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు, డీఎంకే పార్టీలన్నీ ఏకమయ్యాయి. సీబీఐ, ఈడీలను తమపై కావాలని దురుద్దేశపూర్వకంగా ప్రయోగిస్తున్నారని సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశాయి. ఈ పిటీషన్ ను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి వచ్చే నెల (ఏప్రిల్ 5న) విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.
కాగా, ఈ విషయమై బీజేపీ అగ్రనేతలు స్పందించారు. దేశంలో ఎటువంటి అధికార దుర్వినియోగం జరగడం లేదని స్పష్టం చేశారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగానే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, అవినీతి, అక్రమాలన్నీ బీజేపీ ప్రత్యర్థ రాష్ట్రాల్లోనే కనబడటం ఏమిటనే విషయంపై ఎప్పటిలాగే మౌనం వహించారు.