Homeక్రీడలుFIFA World Cup 2022 : ఎడారి దేశంలో అసలైన సమరం: నేటి నుంచే ఫుట్...

FIFA World Cup 2022 : ఎడారి దేశంలో అసలైన సమరం: నేటి నుంచే ఫుట్ బాల్ ప్రపంచ కప్

FIFA World Cup 2022 : చుట్టూ ఎడారి.. పరుచుకున్న ఇసుక తిన్నెలు.. వాటి సరిహద్దుల్లో అధునాతనమైన మైదానాలు… వాటిపై పెరిగిన పచ్చని పచ్చిక… ఇలాంటివి ఎనిమిది మైదానాలు.. 32 జట్లు… 64 మ్యాచ్ లు, దేశ విదేశాల నుంచి క్రీడాకారులు.. అదే స్థాయిలో అభిమానులు.. వెరసి ఈ ఆదివారం నుంచి ఖతార్ వేదిక గా 29 రోజులపాటు వీనులవిందైన ఫుట్ బాల్ ఆట అభిమానులను అలరించనుంది. తొలి మ్యాచ్ ఆతిధ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది. విజిల్ సినిమాలో చూపించినట్టు ఫుట్ బాల్ అంటే కఠినమైన ఆట! 90 నిమిషాల పాటు సాగుతుంది.. కానీ చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు సరికొత్త ఆనందాన్ని అందిస్తుంది.. ఆ విజిల్ శబ్దం వినిపిస్తేనే ప్రపంచం మొత్తం స్తంభించిపోతుంది. 90 నిమిషాలు అలా కళ్ళు అప్పగిస్తుంది.. బంతి కోసం.. పచ్చిక మైదానంలో.. వేలాదిమంది ప్రేక్షకుల సాక్షిగా 22 మంది ఆటగాళ్లు పోరాడుతున్న తీరు న భూతో న భవిష్యత్. కొదమసింహాల్లా పరుగెత్తుకుంటూ వస్తూ.. బంతి కోసం ఒకరినొకరు తోసుకుంటూ ఉండే తీరును చూస్తే ప్రాణం మునివేళ్ల మీద ఉంటుంది. బంతిని నియంత్రిస్తూ, ప్రత్యర్థులను చేదించుకుంటూ, గురి చూసి గోల్ కొడుతుంటే వచ్చే ఆ కిక్ మామూలుగా ఉండదు. అందుకే ఆటలందు ఫుట్ బాల్ వేరు. కప్పులందు సాకర్ ప్రపంచకప్ వేరు.

దోహాలో తొలి మ్యాచ్

ఖతార్ వేదికగా దోహా లో ఫుట్ బాల్ ప్రపంచ కప్ పోరు ఆదివారం మొదలవుతుంది. ఈక్వెడార్, ఖతార్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా ప్రపంచ కప్ లో ఆడేందుకు అర్హత సాధించని ఖతార్.. ఆతిథ్య జట్టు హోదాలో అవకాశం దక్కించుకుంది.. ఖతార్ ఉన్న గ్రూప్ లోనే నెదర్లాండ్స్, సెనగల్ జట్లు కూడా ఉన్నాయి..ఖతార్ అద్భుతాలు చేస్తుందని ఆశ ఎవరికీ లేదు..ఈక్వెడార్ బలహీన జట్టే కావచ్చు… కానీ ఖతార్ ను సులభంగా ఓడించగలదు. ఈసారి 32 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.. తొలి రెండు స్థానంలో నిలిచిన జట్లు ఫ్రీ క్వార్టర్స్ కు అర్హత సాధిస్తాయి. నాకౌట్ బెర్తుల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. దీనిని గ్రూప్ ఆఫ్ డెత్ అని పిలుస్తారు.. ఈసారి అలాంటి గ్రూపులు రెండు ఉన్నాయి.. గ్రూప్ బి లో ఛాంపియన్ ఇంగ్లాండ్ తో పాటు అమెరికా, వేల్స్ కూడా గట్టి పోటీదారులే. అలాగని ఇరాన్ దేశాన్ని కూడా కొట్టి పారేసేందుకు లేదు. గ్రూప్ ఈ లోనూ గట్టి పోటీ ఉంది. స్పెయిన్, జర్మనీ నాకౌట్ అభ్యర్థులకు ఫేవరెట్లు అయినప్పటికీ… కోస్టారికాలాంటి ప్రమాదకర జట్టు కూడా ఆ గ్రూపులో ఉంది.. అయితే జపాన్ ఈ గ్రూపు నుంచి ముందంజ వేయడం కష్టంగానే కనిపిస్తోంది.

సాంబా జట్టు మళ్ళీ గెలుస్తుందా

2002లో బ్రెజిల్ ఫుట్బాల్ ప్రపంచ కప్ గెలిచింది. ఇంతవరకు కూడా మళ్లీ కప్పు నెగ్గలేదు.. 2014లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్ లోనూ అంచనాలు అందుకోలేకపోయింది.. అయితే గత రెండేళ్లుగా బ్రెజిల్ నిలకడ తీరైన ఫామ్ కనబరుస్తోంది.. దీనిని బట్టి చూస్తే ఈసారి కప్ గెలిచే అవకాశం కనిపిస్తోంది.. నెయ్ మార్ కు తోడుగా మిగతా ఆటగాళ్లు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. బ్రెజిల్ తర్వాత ఎక్కువ అవకాశాలు ఉన్నది అర్జెంటీనాకే. 2014లో టైటిల్ కు అత్యంత చేరువుగా తీసుకెళ్లి అమ్మేసి తనకు చివరిదిగా భావిస్తున్న ప్రపంచ కప్ కల నెరవేర్చుకునేందుకు మెస్సీ ప్రయత్నిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.. డిపెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ ను మరోసారి టైటిల్ కు గట్టి పోటీదారు అని అందరూ భావిస్తున్నారు.. మాజీ ఛాంపియన్లు ఇంగ్లాండ్, స్పెయిన్ అవకాశాలను కూడా కొట్టి పారేయలేం.

రాత్రి 7:30 నుంచి

భారత కాలమానం ప్రకారం ఫుట్బాల్ ప్రారంభ వేడుకలు ఆదివారం రాత్రి 7:30 నుంచి ప్రారంభమవుతాయి.. 60 వేల ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న ఆల్బెట్ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్ జరుగుతుంది.. ఈ కార్యక్రమంలో నోరా పతేహి, జంగ్ కూక్, బ్లాక్ ఐ పీస్, రాబీ విలియమ్స్.. సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు.. టోర్నీ ప్రైజ్ మనీ మొత్తం 3,590 కోట్లు. ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జట్టుకు 344 కోట్లు దక్కుతాయి.. రన్నరప్ కు 245 కోట్లు అందుతాయి.. తొలి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు వరుసగా 220 కోట్లు, 204 కోట్లు సొంతం చేసుకుంటాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular