Strange weddings : పెళ్లంటే ఇద్దరి మనసులు, ఇరు కుటుంబాల కలయిక, అయితే ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా.. తెలిసిన వారు, బంధువుల సంబంధాల కంటే.. పరిచయం లేని వ్యక్తులు, దూరపు సంబంధాల్నే చేసుకోవడం చూస్తుంటాం. కొంతమంది రక్త సంబంధాలు/మేనరికం పేరుతో బావ లేదా మేనమామను పెళ్లి చేసుకుంటుంటారు. కానీ కూతురే కన్న తండ్రిని పెళ్లి చేసుకోవడం మీరెక్కడైనా చూశారా? తల్లీ కూతుళ్లిద్దరికీ భర్త ఒక్కరే అన్న వింత గురించి మీరెప్పుడైనా విన్నారా? వినడానికే కఠోరంగా ఉన్న ఈ విడ్డూరాన్ని ఆచారంగా పాటిస్తోంది ఓ తెగ. ఇంతకీ ఎక్కడుండా తెగ? అమ్మాయిల పెళ్లి విషయంలో వారు పాటిస్తున్న వింత ఆచారాలేంటో తెలుసుకుందాం.
బంగ్లాదేశ్‌లో..
తండ్రీకూతుళ్ల బంధమంటే ఎంతో పవిత్రంగా భావిస్తాం.. పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. మంచి సంబంధం చూసి పెళ్లి చేసే వరకు కూతురిని కనుపాపలా కాచుకుంటాడు తండ్రి. అయితే బంగ్లాదేశ్లోని మండి తెగలో ఇందుకు భిన్నమైన సంప్రదాయం ఉంది. ఈడొచ్చిన కూతురిని కన్న తండ్రే పెళ్లి చేసుకోవడం ఈ తెగ ఆచారం.
15 ఏళ్లు దాటాకే కాపురం!
బంగ్లాదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రాచీన తెగల్లో మండి తెగ ఒకటి. ఏళ్లుగా ఇక్కడి భాష, ఆచార వ్యవహారాలు ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటున్నాయి. కన్న కూతురిని తండ్రే పెళ్లి చేసుకునే పద్ధతి కూడా ఇందులో ఒకటి. ఈ క్రమంలో ఊహ తెలియని వయసులోనే అమ్మాయిలకు తమ తండ్రితో వివాహం చేసినా.. పదిహేనేళ్లు నిండిన తర్వాతే కాపురం చేయిస్తారట! ఇలా ఈ తెగలో తల్లీబిడ్డలిద్దరికీ భర్త ఒక్కరే. ఒకవేళ భర్త చనిపోతే.. అదే తెగకు చెందిన ఓ వ్యక్తి ముందు తల్లిని పెళ్లి చేసుకోవడం.. ఆమె సంతానాన్ని తమ సొంత పిల్లలుగా చూసుకోవడం ఈ తెగలో గమనించచ్చు. ఇక ఈ పిల్లల్లో ఆడపిల్లలుంటే సవతి తండ్రిని పెళ్లి చేసుకోవాలన్న నియమం కూడా ఉంది. ఇలా వినడానికి విడ్డూరంగా ఉన్న ఈ సంప్రదాయాన్ని మండి ప్రజలు ప్రాచీన కాలం నుంచే పాటిస్తున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు.