Extramarital Affair: మావన సంబంధాలు ఆర్ధిక బంధాలుగా, అవసరాలు తీర్చుకునే తాత్కాలిక పరిచయాలుగా మారుతున్నాయి. కొందరు వక్రబుద్ధితో వైవాహిక జీవితాల్లో వేరే వ్యక్తులతో ఉండే సాన్నిహిత్యాన్ని వివాహేతర సంబంధాలుగా మలుచుకుంటున్నారు. ఆకర్షణకులోనై ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కటకటాల్లోకి వెళ్తున్నారు. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. పిల్లలను అనాథులుగా మార్చుతున్నారు. కష్టాల కొలిమిలోకి నెట్టేస్తున్నారు. భవిష్యత్‌ను అంధకారంగా మార్చుతున్నారు. ‘మేమేమీ చేశాం పాపం’ అంటూ పిల్లలు గోడు వెళ్లబోస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.

–రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద నగ్నంగా పడి ఉన్న జంట మృతదేహాలు బుధవారం కలకలం రేపాయి. మృతులను సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన ఎండ్ల యశ్వంత్(22), మెట్టుగూడకు చెందిన వివాహిత జ్యోతి(28)గా పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ వారాసీగూడకు చెందిన యశ్వంత్‌కు అదే ప్రాంతానికి చెందిన వివాహిత జ్యోతితో వివాహేతర సంబంధం ఉంది. యశ్వంత్, జ్యోతి మధ్య ఈ ఎఫైర్ కొనసాగుతున్నట్లు భర్త గుర్తించాడు. ఓసారి ఇంట్లోనే వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతుండటాన్ని చూసి ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వారాసిగూడ నుంచి యశ్వంత్, జ్యోతి కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండటాన్ని భర్త గుర్తించి వారిని వెంబడించాడు.
Also Read: Nadda Visit Telangana: తెలంగాణ బీజేపీ విన్నింగ్ ప్లాన్ రెడీ చేస్తున్న నడ్డా? ఇలా ముందుకు.?
సుమారు 30 కి.మీ దూరంలోని అబ్దుల్లాపూర్ మెట్ కొత్తగూడ సమీపంలో చెట్లపొదల్లోకి వారు వెళ్లడాన్ని గమనించాడు. యశ్వంత్, జ్యోతి ఏకాంతంగా గడుపుతుండటాన్ని భర్త నేరుగా చూశాడు. మార్గమధ్యలో కొనుగోలు చేసి తీసుకెళ్లిన మద్యాన్ని అక్కడే తాగాడు. అనంతరం ఆవేశాన్ని అణచుకోలేక పక్కనే ఉన్న రాయి తీసుకెళ్లి జ్యోతి తలపై మోదాడు.. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్ తో యశ్వంత్ గుండెపై ఒక్కసారిగా పొడిచాడు. దీంతో యశ్వంత్ కుప్పకూలి అపస్మారక స్థితికి వెళ్లాడు. అప్పటికే కసితో రగిలిపోతున్న జ్యోతి భర్త.. యశ్వంత్ మర్మాంగంపైనా దాడి చేసి ఛిద్రం చేశాడు. ఇద్దరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
–ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే మస్కా కొట్టించింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే మస్కా కొట్టించింది. ఇంటర్ క్లాస్‌మేట్‌తో సీక్రెట్‌గా దుకాణం పెట్టింది. భర్త అనుమానిస్తే గొడవపడింది. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో సిగ్గుతో తలదించుకుంది. ములుగు జిల్లాలో ఓ మహిళా ఉద్యోగిని ఇదంతా చేసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్లలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో మహిళ జాబ్ చేస్తోంది. ఆమె భర్త చర్లలో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ప్రేమించుకొని 8 సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అయితే ఉద్యోగాల రీత్యా మహిళ చిన్నబోయినపల్లిలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె భర్త చర్లలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరూ వేర్వేరు చోట్ల ఉద్యోగం చేయడం మహిళ వివాహేతర సంబంధానికి కారణమైంది.

అయితే భార్య తీరుపై అనుమానం రావడంతో భర్త పలుమార్లు ఆమెను నిలదీశాడు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. ఈ విషయంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ తల్లి అల్లుడితో గొడవపడింది. తన కూతురిని అనుమానిస్తే ఊరుకోను..నీ భార్య తప్పు చేస్తుందని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోమని పెద్దల సమక్షంలోనే నిలదీసింది. భార్య తల్లి, గ్రామపెద్దల సమక్షంలోనే పట్టుకోమని సవాల్ చేయడంతో మహిళపై నిఘా పెట్టాడు కార్యదర్శి. మహిళ ఉద్యోగి చర్లకు చెందిన ఇంటర్ క్లాస్ మేట్ రసాల లింగరాజుతో భర్తకు తెలియకుండా ప్రేమాయణం సాగిస్తోంది. అతను కారు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. భర్తకు తెలియకుండా ప్రియుడు లింగరాజుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నర్సాపూర్‌లోని ఓ ఇంట్లో ఇద్దరూ కలిసి ఉన్నట్లుగా తెలుసుకున్న భర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భార్య బాగోతం ఇలా భర్త బయటపెట్టాడు.
-ప్రియుడి కోసం తండ్రిని చంపింది..
– ప్రియుడి కోసం కన్నతండ్రిని హత్య చేసింది ఓ కూతురు. మహబూబాబాద్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. ప్రేమపెళ్లికి తండ్రి అంగీకరించడం లేదన్న కోపంతో ప్రియుడి సహాయంతో కర్రతో కొట్టి చంపడమే కాకుండా ఆస్తి వివాదంలో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైంది. ప్రియుడితో పెళ్లికి అడ్డు చెబుతున్నాడనే కోపంతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. మహబూబాబాద్ మండలం వేమునూరుకి చెందిన ప్రభావతి అనే మైనర్ తండ్రి వెంకన్నను తాను ప్రేమించిన యువకుడితో కలిసి కొట్టి చంపింది. ప్రభావతి కొంత కాలంగా వేమునురుకి చెందిన వెంకటేశ్వర్లు అనే యువకుడితో ప్రేమలో పడింది. అతడిని ప్రభావతి ప్రేమించడం తండ్రి వెంకన్నకు ఇష్టం లేదు. అంతే కాదు…ఇదే విషయాన్ని కూతురుతో గట్టిగా చెప్పడంతో తండ్రిపై పగ పెంచుకుంది. ప్రేమ వ్యవహారం తండ్రి, కూతురు మధ్య శత్రుత్వానికి కారణమైంది. ఈ క్రమంలోనే తన ప్రియుడు వెంకటేశ్వర్లతో కలిసి ప్రభావతి కర్రతో కొట్టి తండ్రి వెంకన్నను అత్యంత కిరాతకంగా హతమార్చింది.

– విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు పదేళ్లుగా అన్యోన్యంగా జీవిస్తున్నారు. భార్య ఇటీవల ఓ ఫార్మాకంపెనీలో హెల్పర్‌గా చేరినప్పటి నుంచి ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం నెరపుతోంది. విషయం భర్తకు తెలిసింది. నిలదీయడంతో భర్తను హతమార్చేందుకు పూనుకుంది. ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి మట్టుబెట్టింది. దీనిని ఆటో ప్రమాదంగా చిత్రీకరించింది. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపడంతో అసలు విషయాన్ని అంగీకరించింది. ఆమె జైలుకెళ్లింది. తండ్రి హత్యకు గురయ్యారు. వీరి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అనాథులుగా మారారు.’
ఇలా.. వివాహేతర సంబంధాలు ఉసురు తీస్తున్నాయి. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో హత్యలకు ప్రేరేపిస్తున్నాయి. అడ్డు తొలగించుకుంటే అంతా మనమేనన్న భ్రమను కల్పిస్తున్నాయి. చివరకు కుటుంబంలో ఒకరిని పొట్టనపెట్టుకుంటున్నాయి. ఇటువంటి విషసంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.