Advance Elections: 2021 సంవత్సరానికి గుడ్ బై చెప్పి ప్రజలంతా 2022 ఏడాదికి వెల్ కమ్ చెబుతున్నారు. రెండ్రోజుల ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో న్యూయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. కరోనా ఆంక్షల మధ్యే తెలంగాణ, ఏపీలో డిసెంబర్ 31 వేడుకలు ఘనంగా జరిగాయి. అర్ధరాత్రి వరకు క్లబ్బులు, ప్లబ్బులు, మద్యం దుకాణాలకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వడంతో యువత ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఇక పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత డ్రెంకన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ పేరుతో పలుచోట్ల మద్యంబాబుల జేబులకు యథావిధిగా చిల్లులు పెట్టారు.

ఇక గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా కరోనా ఆంక్షల మధ్యే ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. 2021 సంవత్సరం ఎలా గడిచినప్పటికీ కొత్త సంవత్సరం మాత్రం హ్యాపీగా సాగాలని అంతా కోరుకుంటున్నారు. మరోవైపు రాజకీయపరంగా కొత్త సంవత్సరంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా తగు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.
సాధారణంగా అయితే 2023లో తెలంగాణలో, 2024లో ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగాల్సి ఉంటుంది. అయితే సీఎం కేసీఆర్ గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో ఈసారి కూడా అదే సీన్ రిపిట్ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో రోజురోజుకు టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో ముందస్తు ఎన్నికలకు వెళితేనే మంచి ఫలితాలు వస్తాయని ఆపార్టీ అధినేత భావిస్తున్నారట. దీంతో ఆగస్టులో అసెంబ్లీని రద్దు చేసి ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జరుగుతోంది.
దీనిపై ఇప్పటికే టీఆర్ఎస్ ముఖ్య నేతలకు తగు సమాచారం ఉందనే గుసగుసలు ఆపార్టీలోనే బలంగా విన్పిస్తున్నాయి. మరోవైపు ముందస్తును డిసైడ్ చేసే కేసీఆర్ సైతం కొద్దిరోజులుగా దూకుడుగా రాజకీయాలు చేస్తుండటంతో ముందస్తు ఖాయమనే సంకేతాలు బయటకు వెళుతున్నాయి. మరోవైపు ఏపీలోనూ తెలంగాణ తరహాలోనే సీఎం జగన్ రెడ్డి ముందస్తు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. వీరిద్దరి వ్యూహం ఒకటే కావడంతో ఒకేసారి తెలుగు రాష్ట్రాల సీఎంలు ముందస్తుకు వెళ్లినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యకమవుతోంది.
మరోవైపు కేంద్రంలోని మోదీ సర్కారు సైతం ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అనే నినాదాన్ని ముందుకు తీసుకొస్తోంది. ఈక్రమంలోనే కొన్ని రాష్ట్రాలతో కలిసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకు తగిన ఏర్పాట్లను కూడా ఆపార్టీ అంతర్గతంగా చేసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. అదే కనుక జరిగితే ఈ ఏడాది చివరి నాటికి తెలుగు రాష్ట్రాలతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కన్పిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఓటర్లకు సైతం ఇలాంటి సంకేతాలే వెళుతుండటం ఆసక్తిని రేపుతోంది.