Telangana Elections – EC : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొరఢా ఝళిపించడంతో రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈసీ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులను వారి పోస్టుల నుంచి తప్పించింది. వారికి ఎక్కడా పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టామని ఈసీకి నివేదించింది. ఖాళీ అయిన పోస్టుల భర్తీ కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల చొప్పున పేర్లు ప్రతిపాదిస్తూ వివరాలు పంపించింది. ఈసీ మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన అనంతరం ఏకంగా 20 మంది అధికారులను తక్షణమే బదిలీ చేయాలని బుధవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్ హరీశ్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్‌రెడ్డితో పాటు రవాణా శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నుల ఇన్‌చార్జి కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్ డైరెక్టర్ ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ, పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్ (హైదరాబాద్), రంగనాథ్ (వరంగల్), సత్యనారాయణ (నిజామాబాద్)లను వెంటనే పోస్టుల నుంచి తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాసింది. మరో 10 జిల్లాల ఎస్పీలను కూడా పక్కనపెట్టాలని ఆదేశించింది. తమకు నివేదిక పంపించాలని సూచించింది. దాంతో సీఎస్ శాంతికుమారి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వీ శేషాద్రి సచివాలయంలో సమావేశమయ్యారు. కాగా, పోస్టుల నుంచి తప్పించిన అధికారులకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినా అప్రధాన లేదా ఎన్నికల విధులతో సంబంధం లేని పోస్టుల్లో నియమించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు వివరిస్తున్నాయి. ఆ నియామకాలు ఇప్పుడే చేపడతారా లేదా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక చేపడతారా అన్నది తేలాల్సి ఉంది. ఈసీ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.
ఈసీ సీరియస్?
ఖాళీ అయిన పోస్టుల భర్తీకి సీఎస్ చర్యలు చేపట్టారు. మొత్తం 20 పోస్టులకు 60 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రతిపాదించారు. వాణిజ్య పన్నులశాఖ, ఎక్సైజ్ శాఖలకు ప్రస్తుతం సీఎస్ శాంతికుమారే ఇన్‌చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ విషయంలో ఈసీ కొంత సీరియస్ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఎన్నికల కీలక సమయంలో అత్యంత వివాదాస్పదమైన ఎక్సైజ్ శాఖకు పూర్తి స్థాయి ముఖ్య కార్యదర్శి ఉండకుండా చూస్తారా అంటూ సీఎ్‌సను ప్రశ్నించింది. రాష్ట్రంలో మద్యం సరఫరాను నియంత్రించాల్సి ఉందని, ఈ దృష్ట్యా ఆ శాఖకు పూర్తిస్థాయి ముఖ్య కార్యదర్శిని నియమించాలని ఆదేశించింది. వాణిజ్య పన్నుల శాఖకు కూడా పూర్తిస్థాయి ముఖ్య కార్యదర్శిని నియమించాలని స్పష్టం చేసింది. ఈ పోస్టుల భర్తీకి కూడా సీఎస్ అధికారుల పేర్లు సూచిస్తూ ప్రతిపాదనలు పంపించారు. కాగా, రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న టీకే శ్రీదేవికి ఇటీవలే వాణిజ్య పన్నుల శాఖ ఇన్‌చార్జి కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. ఆమెను కూడా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని ఈసీ ఆదేశించడంతో ఆర్థికశాఖ కార్యదర్శి పోస్టుకే పరిమితం కానున్నారు.