Homeఆంధ్రప్రదేశ్‌BJP - Pawan Kalyan : పవన్ కోసం రంగంలోకి బీజేపీ పెద్దలు

BJP – Pawan Kalyan : పవన్ కోసం రంగంలోకి బీజేపీ పెద్దలు

BJP – Pawan Kalyan : గత ఎన్నికల్లో టీడీపీ దారుణంగా దెబ్బతింది. 175 నియోజకవర్గాలనుగాను 23 స్థానాలకే పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష హోదాను అతి కష్టమ్మీద దక్కించుకుంది. దీంతో టీడీపీ పాత్రను తాము పోషిస్తామని బీజేపీ, జనసేనలు ముందుకొచ్చాయి. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో టీడీపీ ఫెయిలైనందున తాము ఆ స్థానంలోకి వచ్చినట్టు చెప్పుకొచ్చాయి. అయితే ఆ రెండు పార్టీల సంయుక్త పోరాటాలు కానీ.. కలిసి నడిచింది కానీ చాలా తక్కువే. వైసీపీ ప్రభుత్వ విధానాలపై సంయక్త పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇలా ఎక్కడా కలిసిపోటీ చేయలేదు. మరోవైపు జనసేన టీడీపీ వైపు వెళుతుందన్న ప్రచారం ఉంది. ఇటువంటి తరుణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన సహకరించలేదని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తుండడంతో రెండు పార్టీల మధ్య పొత్తు జఠిలంగా మారింది. పవన్ తన దారి తాను చూసుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజీపీ హైకమాండ్ పెద్దలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.

హీట్ పుట్టించిన పదాధికారుల సమావేశం..
ఇటీవల ఏపీ పదాధికారుల సమావేశం జరిగింది. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి గురించి చర్చించారు. డిపాజిట్లు గల్లంతు కావడాన్ని నేతలు జీర్ణించుకోలేకపోయారు. మిత్రపక్షంగా జనసేన ఆశించిన స్థాయిలో సహకరించడం లేదన్న స్థిర అభిప్రాయానికి వచ్చారు. అనంతరం పీవీఎన్ మాధవ్ అసలు జనసేనతో బీజేపీకి పొత్తు ఉందో లేదో తెలియడం లేదన్న కామెంట్స్ తో కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. దీంతో దీనిపై పెద్ద దుమారమే రేగింది. మీడియాలో రెండు పార్టీల మైత్రిపై కథనాలు వెలువడ్డాయి. అటు బీజేపీ నేతలుకు జనసేన నేతలు టీవీ డిబేట్లలో ధీటైన కౌంటర్ ఇచ్చారు. అటు హైకమాండ్ పెద్దలు కానీ.. జనసేన అధినేత పవన్ కానీ స్పష్టమైన ప్రకటన చేయకపోయినా.. రెండు పార్టీల మధ్య అగాధం పెరిగింది. ఇప్పటివరకూ ఉన్న సానుకూల వాతవరణం చెడిపోయింది. దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు అనేది లేదన్న రీతిలో ప్రచారం మొదలైంది.

గ్యాప్ లేకుండా చూసుకోవాలని..
గత ఎన్నికల తరువాత రాష్ట్ర భవిష్యత్ కోసం పవన్ బీజేపీకి స్నేహహస్తం అందించారు. రెండు పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి. అయితే జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీగా బీజేపీ రాష్ట్రానికి అండగా నిలుస్తుందని భావించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేస్తుందని పవన్ ఈ నిర్ణయానికి వచ్చారు. కానీ ఈ విషయంలో పెద్దన్న పాత్ర పోషించే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం జగన్ ను అడ్డుకట్ట వేయలేకపోయింది. దీనికి కూడా రాష్ట్ర బీజేపీయే కారణం. రాష్ట్ర బీజేపీ నేతల్లో కొందరు వైసీపీకి, మరికొందరు టీడీపీకి అనుకూలంగా మారిపోయారు. దీంతో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీ హైకమాండ్ జాప్యం చేసింది. దాని కారణంగానే బీజేపీ వైసీపీకి అనుకూలమన్న ప్రచారానికి బీజం పడింది. అది అంతిమంగా బీజేపీకే నష్టం చేసింది. జనసేనతో గ్యాప్ నకు కారణమైంది.

ఆ నేతల ప్రకటనతో అలెర్ట్..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తరువాత బీజేపీ నాయకులు పీవీఎన్ మాధవ్, విష్ణుకుమార్ రాజులాంటి నాయకుల ప్రకటనలు చూసి బీజేపీ కేంద్ర పెద్దలు అలెర్టయ్యారు.ఏపీలో పవన్ కళ్యాణ్ణి అలా వదిలేయకూడదు అన్నదే కేంద్ర పెద్దల ఆలోచన అంటున్నారు. గత ఏడాది నవంబర్ లో విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పవన్ని ప్రత్యేకంగా పిలిపించుకుని మంతనాలు జరిపారు. ఆ వివరాలు బయటకు రాకపోయినా మోడీ మీద పవన్ కి గౌరవం ఉండబట్టే పిలిస్తే వచ్చి హాజరయ్యారు అని అంటున్నారు. ఇప్పుడు కూడా ఆ గౌరవాన్ని,మొహమాటాన్ని ఆధారం చేసుకుని పవన్ మనసులో ఏముందో సూటిగా తెలుసుకుని తమతో కలుపుకుని పోవాలని కేంద్ర పెద్దలు ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు. ఏపీలో ఎదగాలని బీజేపీ భావిస్తోంది. పవన్ లాంటి చరిష్మాటిక్ లీడర్ ఈ వదిలిపెట్టాలనుకోవడం ఏ మాత్రం తగని రాజకీయమని కేంద్ర పెద్దలు భావిస్తున్నారుట. పవన్ ఏమి కోరుకుంటున్నారో తెలుసుకుని ఆ దిశగా ఏపీ బీజేపీలో మార్పు చేర్పులు చేయడానికి కూడా రెడీ అవుతారు అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరికొద్దిరోజుల్లో బీజేపీ, జనసేన విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular