Eenadu: పత్రికల దుకాణం మూసేస్తోన్న ఈనాడు.. ఇక డిజిటలే.. సంచలన నిర్ణయం వెనుక కారణమిదే

ఈనాడు నెట్ లో ఆన్లైన్ వార్తలకు సంబంధించి ఆ పత్రిక యాజమాన్యం ఒక ఒపీనియన్ సర్వే నిర్వహిస్తోంది. మీరు ఎలాంటి వార్తలు ఇష్టపడతారు? సంక్షిప్తమైన వార్తలను ఇష్టపడతారా? లేక ఆ వార్తలు సుదీర్ఘంగా ఉండాలా? మీరు సమాచారం కోసం వేటిని సంప్రదిస్తారు?

Written By: Anabothula Bhaskar, Updated On : January 5, 2024 11:34 am

Eenadu

Follow us on

Eenadu: రోజురోజుకు ప్రింటింగ్ వ్యయం పెరుగుతోంది. అదే స్థాయిలో ఉద్యోగుల జీతభత్యాలు కూడా పెరుగుతున్నాయి. మిగతా పత్రికలు అంటే ఏమో గాని.. ఈనాడు విషయంలో వేజ్ బోర్డు కచ్చితంగా అమలు చేయాల్సిందే. అంటే అందులో ఉన్న ఉద్యోగులందరికీ అలా అమలు చేస్తారని కాదు. ఇందులోనూ శ్రమ దోపిడీ ఉంటుంది. కేవలం ఉషోదయ పబ్లికేషన్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈ వేజ్ బోర్డు వర్తిస్తుంది. ఇక న్యూస్ టుడే, మ్యాన్ పవర్, ఈనాడు డిజిటల్, ఈటీవీ భారత్ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు ఇటువంటివేవీ వర్తించవు. ఈనాడు సంస్థలకు ఆ పత్రికే ప్రధాన ఆదాయ వనరు. అయితే గత కొంతకాలంగా ప్రింట్ మీడియా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఈనాడు యాజమాన్యం అన్నదాత, సితార, విపుల సంచికలను ఇప్పటికే మూసివేసింది. అయితే త్వరలో ఈనాడు యాజమాన్యం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈనాడు నెట్ లో ఆన్లైన్ వార్తలకు సంబంధించి ఆ పత్రిక యాజమాన్యం ఒక ఒపీనియన్ సర్వే నిర్వహిస్తోంది. మీరు ఎలాంటి వార్తలు ఇష్టపడతారు? సంక్షిప్తమైన వార్తలను ఇష్టపడతారా? లేక ఆ వార్తలు సుదీర్ఘంగా ఉండాలా? మీరు సమాచారం కోసం వేటిని సంప్రదిస్తారు? వార్తాపత్రికలు, న్యూస్ చానల్స్ ను ఎక్కువగా చూస్తూ ఉంటారా? తప్పుడు వార్తలను మీరు ఏ విధంగా గుర్తుపడతారు? అనే ప్రశ్నలను సంధిస్తూ ఒపీనియన్ సర్వేను ఈనాడు డాట్ నెట్ లో అందుబాటులో ఉంచింది. అంటే దీని ప్రకారం ఈనాడు త్వరలో ప్రింటింగ్ మీడియాకు స్వస్తి పలికి పూర్తి డిజిటల్ మీడియాలోకి రావాలని చూస్తోందని తెలుస్తోంది. ప్రింట్ మీడియా వ్యయం పెరిగిపోవడం వల్ల ఆ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ఈనాడు స్కూల్లో శిక్షణ పొందుతున్న పాత్రికేయులకు ప్రింట్ మీడియా కాకుండా కేవలం డిజిటల్, వెబ్ మీడియాలో మాత్రమే శిక్షణ ఇస్తుండడం పై విషయాలకు బలం చేకూర్చుతోంది.

ఇక ఈనాడు తన వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం కొంతకాలంగా భారీగా జీతాలు ఉన్న ఉద్యోగులను గోల్డెన్ హ్యాండ్ షేక్ పేరుతో బయటికి పంపిస్తోంది. అంతేకాదు బయటికి వెళ్లాలి అనుకుంటున్న ఉద్యోగులను కూడా త్వరితగతన పంపేస్తోంది. గతంలో ఈనాడులో ఇటువంటి సాంప్రదాయం ఉండేది కాదు. కానీ యాజమాన్యం గతానికంటే భిన్నంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ప్రింట్ మీడియా లో మనం చేసే వారంతా బయటకు వెళ్తున్నారు. ఇక ఈటీవీ భారత్, ఈనాడు డాట్ నెట్ ను బలోపేతం చేసిన ఈనాడు యాజమాన్యం.. త్వరలో దానిని మరింత పరిపుష్టం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే ప్రింట్ మీడియాకు పూర్తిగా స్వస్తి పలికి పూర్తిగా డిజిటల్ మీడియాలోకి రావాలని భావిస్తోంది. క్రమంలోనే ఒపీనియన్ సర్వే ను నిర్వహిస్తోందని మాజీ జర్నలిస్టులు అంటున్నారు. కోవిడ్ తర్వాత ఈనాడు ప్రింటింగ్ బాధ్యతను మొత్తం కళాజ్యోతి సంస్థకు అప్పగించాలని అప్పట్లో అనుకున్నారు. కానీ చివర్లో ఆలోచనను ఈనాడు యాజమాన్యం విరమించుకుంది. ఇక గతంలో ఈనాడు కవర్ ప్రైస్, యాడ్ టారిఫ్ ఏమాత్రం తగ్గేది కాదు. కానీ కొంత కాలం నుంచి ఈనాడు టారిఫ్ చాలా వరకు తగ్గింది. ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నది. అంటే దీనిని బట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు ఈనాడు ఉంటుంది.. ఆ తర్వాత పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారుతుందని మాజీ జర్నలిస్టులు అంటున్నారు. అందుకు ఈనాడు యాజమాన్యం ఇస్తున్న సంకేతాలే కారణమని వారు ఉదహరిస్తున్నారు. తెలుగు నాట, దక్షిణాదిలో ప్రముఖ పత్రికగా పేరొందిన ఈనాడు పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారిపోవడం నిజంగా సంచలనమే.