https://oktelugu.com/

Telugu Journalism : జర్నలిజం వ్యవస్థను సర్వనాశనం చేసిన ఘనత ‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’లదే!

ఈ వ్యవహారంలో ఈనాడు ప్రథమ ముద్దాయిగా బోనులో నిలబడాల్సి ఉంటుంది. రెండవ స్థానం ఆంధ్రజ్యోతికి దక్కుతుంది. సాక్షి కూడా ఆ తానులో ముక్కే కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా జర్నలిజం వ్యవస్థను సంకనాకించిన ఘనత మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతిలదేనని చెప్పకతప్పదు. 

Written By:
  • NARESH
  • , Updated On : July 25, 2023 / 10:11 PM IST
    Follow us on

    Telugu Journalism : అప్పట్లో ఆంధ్రపత్రిక, ఆంధ్ర భూమి, ఉదయం నిఖార్సైన పత్రికలు ఉండేవి. ఎటువంటి పొలిటికల్ లైన్ లేకుండానే నిప్పులు చిమ్మేవి. ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటేవి. ప్రభుత్వాల అనైతిక పాలనను ఎండగట్టేవి. ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు అమ్ముడుపోకుండా నిజాన్ని నిర్భయంగా రాసిన జర్నలిస్టులున్నారు. ప్రాణాలు సైతం కోల్పోయారు. కానీ అప్పటి జర్నలిజం వేరు.. ఇప్పటి పాత్రికేయం వేరు. పార్టీలు, నేతలు పత్రికలను కొనేశారు. జర్నలిస్టులను ప్యాకేజీ ఇచ్చేసి రాసేసుకున్నారు. అందుకే ఇప్పుడు పత్రికలను ఎవడూ పట్టించుకోవడం లేదు. టీవీల్లో చూపించేదే నిజం అని ఎవడూ నమ్మడం లేదు. సోషల్ మీడియా బలంగా తయారుకావడానికి ఇదీ ఒక కారణమే..

    పాత్రికేయమంటే.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి. కానీ ప్రస్తుతం ఆ పాత్రికేయం అలా ఉందా అంటే? లేదని చెప్పాల్సిన పరిస్థితి. పొలిటికల్ లైన్, బిజినెస్ లెక్కలు, సొంత ప్రయోజనాలు ఇవన్నీ మితిమీరిన స్థాయిలో పెరిగిన తర్వాత పాత్రికేయమనేది ఎప్పుడో చచ్చిపోయింది.   ఎప్పుడైతే ఈనాడు అనేది మార్కెట్లోకి వచ్చిందో అప్పుడే జర్నలిజం అనేది వ్యాపార వస్తువుగా మారిపోయింది. సొంత ప్రయోజనాల కోసం అడ్డగోలు రాతలు రాసి రామోజీరావు.. పాత్రికేయాన్ని నడి బజారులో దొరికే ఒక నిత్యావసర వస్తువుగా మార్చేశాడు. ఈనాడు క్రమక్రమంగా తన సొంత ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకుంది. తనకు నచ్చితే నెత్తిన పెట్టుకుంది. లేకుంటే లీటర్ల కొద్ది బురద పూయడం మొదలు పెట్టింది. దాని కడుక్కోవడం ఎదుటివాడి వంతైపోయింది.

    నాడు ఎన్టీఆర్ హయాంలో

    నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ పార్టీని ఈనాడు ఏ స్థాయిలో భుజానమోసిందో ఇవాల్టికి సీనియర్ జర్నలిస్టులు కథలుగా చెబుతుంటారు. వాస్తవానికి నాడు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఎంత అవసరమో తెలియదు కానీ.. కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో రామోజీరావు అనివార్యంగా తెలుగుదేశం పార్టీని మోసాడు. సారా ఉద్యమం కూడా అలాంటిదే. తనకు పోటీగా ఉన్న పత్రికకు లిక్కర్ ద్వారా ఆదాయం వస్తుండడంతో.. దానిని దెబ్బకొట్టేందుకు సారా వ్యతిరేక ఉద్యమం నడిపిన చరిత్ర రామోజీరావుది.. సీనియర్ ఎన్టీఆర్ ను ఏ స్థాయిలో అయితే ఈనాడు మోసిందో.. లక్ష్మీపార్వతి ఎపిసోడ్ అప్పుడు కూడా ఆ స్థాయిలో ఆయన వ్యక్తిగత ప్రతిష్టను ఇదే ఈనాడు  దిగజార్చింది. ఇక చంద్రబాబుతో టర్మ్స్ బాగా కుదరడంతో ఆయనను మోస్తూనే ఉంది. ఇక గిట్టని వ్యక్తులపై ఈనాడు ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో చెప్పాల్సిన అవసరం లేదు.

    డైరెక్ట్ టార్గెట్

    ఇక ఈనాడు సంగతి అలా ఉంటే.. ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ ది మరో స్టైల్. ఈనాడు వ్యతిరేక వార్త సమయంలో కొద్దో గొప్పో సమయమనం పాటిస్తుంది. కానీ ఆంధ్రజ్యోతి అలా కాదు. అది ఏకంగా డైరెక్ట్ అటాక్ చేస్తుంది. బట్టలిప్పి దిగంబర నృత్యం చేస్తుంది.  తనకు ప్రయోజనం అనుకుంటే మాస్టర్ హెడ్ ను కూడా పక్కకు జరిపి వార్తలు రాస్తుంది. అదే తనకు నచ్చకపోతే పుంఖాను పుంఖాలుగా వార్తలను ప్రచురిస్తుంది. ఇందులో ఎటువంటి శేషబిషలకు తావు ఉండదు. పైగా దాని మేనేజింగ్ డైరెక్టర్ జర్నలిస్ట్ కావడంతో బట్ట కాల్చి మీద వేసే వార్తలకు విపరీతమైన ప్రయారిటీ ఇస్తాడు. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం గురించి ఆంధ్రజ్యోతి ఏ స్థాయిలో వార్తలు రాసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి మీద ఏ విధమైన బురద చల్లిందో అందరికీ విధితమే.

    కేవలం జాతి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అటు ఈనాడు, ఇటు ఆంధ్రజ్యోతి విపరీతమైన పసుపు భక్తిని ప్రదర్శిస్తుంటాయి. వీటి తాకిడికి తట్టుకోలేకనే నాడు రెండు పత్రికలు అని ప్రకటించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోటీగా సాక్షి అనే పత్రికను తీసుకొచ్చారు. జర్నలిజం విలువలు అంటూ అడ్డగోలుగా అందులో వార్తలు రాయడం మొదలుపెట్టారు. స్థూలంగా చెప్పాలంటే ఇవి మూడు ఇప్పుడు ప్రధాన పత్రికలు. వేటి పొలిటికల్ లైన్ వాటికే ఉంది. కానీ ఎటొచ్చీ పాత్రికేయాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. అయితే ఈ వ్యవహారంలో ఈనాడు ప్రథమ ముద్దాయిగా బోనులో నిలబడాల్సి ఉంటుంది. రెండవ స్థానం ఆంధ్రజ్యోతికి దక్కుతుంది. సాక్షి కూడా ఆ తానులో ముక్కే కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా జర్నలిజం వ్యవస్థను సంకనాకించిన ఘనత మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతిలదేనని చెప్పకతప్పదు.