Pawan Kalyan protest : స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. ఎక్కడికక్కడే అడ్డగించారు. పోలీసుల తీరుపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్టను ఇనుమడింపజేసే సమయంలో వైసీపీ సర్కార్ ఈ దురాగతానికి దిగిందనిపవన్ ఆరోపించారు. గూండాలకు రాజ్యాధికారం కట్టబెడితే ఇలానే ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఏపీలో జాతీయ భావాలు ఉన్న నాయకుల్లో పవన్ ముందంజలో ఉంటారు. జి 20 శిఖరాగ్ర సమావేశాలకు ఆతిథ్యమిచ్చే అవకాశం భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. వివిధ దేశాధిపతులు, ప్రతినిధులు భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏపీలో ఓ సీనియర్ నాయకుడు అరెస్ట్ చేయడానికి పవన్ తప్పు పడుతున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్షతో చేసిన పనేనని ఆరోపించారు. జాతీయ భావం తెలియని ఓ నాయకుడు ఏపీని ఏలుతున్నారని.. అసలు ఆయనకు జీ 20 సమావేశాల విలువ ఏం తెలుస్తుంది అని ప్రశ్నించారు.
అయితే పవన్ దూకుడుకు ఏపీ పోలీసులు బెంబేలెత్తిపోయారు. ఏపీ తెలంగాణ సరిహద్దులో 200 మంది పోలీసులు పవన్ ను నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. అయితే వేలాదిమంది జనసైనికులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. అయితే పవన్ అడుగడుగునా సంయమనం పాటిస్తూ పార్టీ శ్రేణులను నియంత్రిస్తూ వచ్చారు. అటు పోలీసులు అడుగు తీసి అడుగు వేయడానికి అడ్డుతెగులుతున్నా ఎక్కడా నిగ్రహం కోల్పోలేదు.పవన్ చర్యలకు పోలీసులే ఫిదా అయిపోయారు. మరోవైపు పోలీసులు అడ్డుకున్నా.. వారిని ఏమీ అనకుండా పవన్ కాలినడకకు సిద్ధపడటం అందరినీ ఆకట్టుకుంది.