Kodandaram: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీపై తమిళిసై బెట్టు వీడారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం గవర్నర్‌ను కలిశారు. ఈ క్రమంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై చర్చించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం.
కోదండరామ్, మీర్ అలీఖాన్‌కు..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు ప్రభుత్వ ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అలీఖాన్‌ను ఎంపిక చేసింది. గవర్నర్ నామినేట్ చేసిన వెంటనే తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో మూడు నెలలుగా ఖాళీగా ఉంటున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి.
కోర్టులో పిటిషన్..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ విషయంలో కొంతకాలంగా గవర్నర్ జాప్యం చేస్తూ వచ్చారు. గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేరును ప్రతిపాదించింది. అయితే గవర్నర్ వారిని నామినేట్ చేసేందుకు అర్హత లేవని తిరస్కరించారు. దీంతో ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో వివాదం తేలే వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు.
స్టేకు నిరాకరణ..
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై విచారణ పూర్తయ్యే వరకూ నియామకంపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు. కానీ బుధవారం విచారణ జరిపిన కోర్టు స్టేకు నిరాకరించింది. అంతేకాదు. గవర్నర్ విస్త్రృత అధికారాల నేపథ్యంలో నిలిపివేయమని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫు వాదన, గవర్నర్ తరఫున వాదనను ఒకేరోజు వినేలా కేసును ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.
కోర్టు తీర్పుతో చకచకా..
కోర్టు స్టేకు నిరాకరించడంతో ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి కోదండరామ్, మీర్ అలీఖాన్ పేర్లను రాజ్‌భవన్‌కు పంపించింది. గవర్నర్ తమిళిసై వీటిని పరిశీలించి వెంటనే ఆమోదం తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల భర్తీ పూర్తయిన నాలుగు రోజులకే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ప్రభుత్వం భర్తీ చేసింది. దీంతో మండలిలో కాంగ్రెస్ బలం ఐదుకు పెరుగనుంది.