Narendra Modi- Abu Dhabi Temple : మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నరేంద్ర మోడీ రామాలయాన్ని ప్రారంభించారు. బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది జరిగి కొద్ది రోజులు కాకముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మరొక అద్భుతం ఆవిష్కృతం కానుంది. అయితే ఈసారి అది ఇండియాలో కాదు.. మన పొరుగు దేశమైన అబుదాబిలో.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం యూఏఈ కి వెళ్లారు. అక్కడి అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు వాణిజ్య ఒప్పందాలను ఆ దేశంతో కుదుర్చుకున్నారు. దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించుకున్నారు. అనంతరం ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నివసించే భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుక అబుదాబిలోని జాయేద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆహ్లాన్ మోడీ అని పేరు పెట్టారు. అంటే దీనికి స్వాగతం మోడీ లేదా హలో మోడీ అని అర్థం. ప్రవాస భారతీయులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని.. భారత దేశ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ కోరారు. మతాలపరంగా వేరు దేశాలు అయినప్పటికీ.. మనుషులపరంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారత్ ఒకటేనని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు.
ఇక ఈ సమావేశం అనంతరం నరేంద్ర మోడీ అబుదాబిలో ఓ హోటల్లో బస చేశారు. బుధవారం ఆయన అబుదాబిలో నిర్మించిన సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ ( బీఏపీఎస్) పేరుతో నిర్మించిన ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయం కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ 2015లో భూమిని కేటాయించారు. 2019లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టాలరెన్స్ అండ్ కో ఎక్సిస్టెన్స్ మంత్రి అయిన షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఆధ్వర్యంలో ఈ ఆలయానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ ఆలయాన్ని గులాబీ రంగు రాయితో నిర్మించారు. సంప్రదాయం, ఆధునిక వాస్తు కలబోతతో ఈ ఆలయాన్ని రూపొందించారు. అక్కడి వేడిని తట్టుకోవడం కోసం రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని కూడా గుడి నిర్మాణానికి ఉపయోగించారు.
ఈ ఆలయంలో ఏడు గోపురాలు ఏర్పాటు చేశారు. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని ఏడు ఎమిరేట్స్ కు ప్రతీకగా నిర్మించారు. ఈ ఆలయంలో అణువణువు సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో మొత్తం 402 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం మీద దేవతలు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు, సూర్యచంద్రులు, ఏనుగులు, నెమళ్లు, ఒంటెలు రూపొందించారు. ఈ ఆలయాన్ని 27 ఎకరాల్లో నిర్మించారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 200 మంది శిల్పులు, కార్మికులు ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.