https://oktelugu.com/

New liquor capital: ఇండియా కొత్త లిక్కర్ రాజధాని ఏదో తెలుసా ? దాని ముఖ్యమంత్రి ఎవరో తెలిస్తే ఇంకా ఆశ్చర్యమే !

ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కల్లీ మద్యం, సారా తాగేవారు. పేద మధ్యతరగతి ప్రజలు దీనికి ఎక్కువగా బానిస అవుతుండడంతో వారి ఆరోగ్యాలకు ముప్పుగా మారింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 30, 2023 3:08 pm
    New-liquor-capital
    Follow us on

    New liquor capital: భారత దేశ లిక్కర్‌ రాజధానిగా కొత్త రాష్ట్రం అవతరించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న కర్ణాటకను అధిగమించి మొదటిస్థానంలోకి వచ్చేసింది. నాలుగైదేళ్లుగా అక్కడ అమలు చేస్తున్న లిక్కర్‌ పాలసీతో తయారీ కంపెనీలతోపాటు అమ్మకాలూ పెరిగాయి. దీంతో ఆ రాష్ట్రం మద్యం ప్రియులకు నిలయంగా మారింది. రెండేళ్ల కిందట ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ రూ.85 కోట్ల మద్యం విక్రయాలు జరిగేవి. అయితే ప్రస్తుతం రోజువారీ మద్యం అమ్మకాలు సుమారు రూ.115 కోట్లకు పెరిగాయి. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరానికి దేశంలోనే రికార్డుస్థాయిలో రూ.42 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరగడమే ఇందుకు నిదర్శనం. ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ విడుదల చేసిన గణాంకాలే ఇవి. ఇంతకీ ఆ రాష్ట్రం ఏదో చెప్పలేదు కదూ.. యోగీ ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌. ఆశ్చర్యంగా ఉందికదూ.. కానీ నిజం.

    ఇదెలా సాధ్యం..
    బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌ మద్యం ప్రియులకు నిలయంగా మారింది. రెండేళ్ల కిందట ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ రూ.85 కోట్ల లిక్కర్, బీర్‌ విక్రయాలు జరిగేవి. కానీ నాలుగేళ్లుగా యోగీ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త పాలసీలు అక్కడ మద్యం అమ్మకాలు పెరగడానికి కారణమవుతున్నాయి. ఎలాంటి అభ్యంతరాలు, వ్యతిరేకత రాకుండా యోగీ సర్కార్‌ అక్కడ మద్యం పాలసీలో మార్పులు తీసుకువస్తూ ఆదాయం పెంచుకుంటోంది. లిక్కర్‌ ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతులను సరళతరం చేసింది. మరోవైపు లిక్కర్‌ షాపుల ఏర్పాటుకు పారదర్శకంగా అనుమతులు మంజూరు చేస్తోంది. ఫలితంగా మద్యం షాపులు, మద్యం తయారీ కంపెనీలు కూడా గడిచిన నాలుగేళ్లలో గణనీయంగా పెరిగాయి.

    కల్తీసారా కట్టడిలో భాగంగా..
    ఉత్తరప్రదేశ్‌లో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కల్లీ మద్యం, సారా తాగేవారు. పేద మధ్యతరగతి ప్రజలు దీనికి ఎక్కువగా బానిస అవుతుండడంతో వారి ఆరోగ్యాలకు ముప్పుగా మారింది. కల్తీ మద్యం తాగి ఎంతోమంది చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే కల్తీ మద్యం అరికట్టేందుకు యోగీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు పెంపుతోపాటు తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫలితంగా కల్తీ మద్యం తాగేవారు క్రమంగా ప్రభుత్వ మద్యం తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ వస్తోంది.

    మూడేళ్లుగా పెరుగుదల..
    మరోవైపు గత రెండు మూడేళ్లలో ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో లిక్కర్, బీరు వినియోగం బాగా పెరిగిందని ఎక్సైజ్‌ శాఖ సీనియర్‌ అధికారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే మొత్తం ఆదాయంలో దేశీయ మద్యం వాటా 45 నుంచి 50 శాతం వరకు ఉంటుందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు, మద్యం అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టడం వంటివి లిక్కర్‌ అమ్మకాల పెరుగుదలకు కారణమని వివరించారు.

    మహిళా మద్యం షాపులు..
    ఉత్తరప్రదేశ్‌లో మద్యం పాలసీని యోగీ సర్కార్‌ సరళతరం చేసింది. మద్యం దుకాణాల కేటాయింపు కూడా సులభతరమైంది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరించడంతోపాటు కేటాయింపు కూడా ఆన్‌లైన్‌లోనే జరగుతోంది. దీంతో మహిళలు కూడా మద్యం షాపుల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్, గజియాబాద్, నోయిడా లాంటి పట్టణాల్లో మహిళా మద్యం దుకాణాలు వెలిశాయి.

    నిత్యం రూ.12 నుంచి రూ.15 కోట్ల అమ్మకాలు..
    ఉత్తరప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో ప్రస్తుతం నిత్యం రూ.12 నుంచి రూ.15 కోట్ల విలువైన మద్యం, బీరు వినియోగిస్తున్నారని ఆ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. అధికార గణాంకాల ప్రకారం ప్రయాగ్‌రాజ్‌లో సగటున రోజుకు రూ.4.5 కోట్ల విలువైన మద్యం, బీరు అమ్మకాలు జరుగుతున్నాయి. నోయిడా, ఘజియాబాద్‌లో రోజుకు రూ.13 నుంచి రూ.14 కోట్లు, ఆగ్రాలో రూ.12 నుంచి రూ.13 కోట్లు, మీరట్‌లో నిత్యం సుమారు రూ.10 కోట్లు, రాజధాని లక్నోలో రూ.10 నుంచి రూ.12 కోట్లు, కాన్పూర్‌లో రోజుకు రూ.8 నుంచి రూ.10 కోట్లు, వారణాసిలో ప్రతి రోజూ రూ.6 నుంచి రూ.8 కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. మొత్తంగా గతేడాది కర్ణాటకలో రూ.41 వేల కోట్ల వార్షిక మద్యం విక్రాయాలు జరగగా, ఈ ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో రూ.42 వేల కోట్లకుపైగా అమ్మకాలు సాగాయి.