https://oktelugu.com/

1971 India vs Pakistan war : 1971 యుద్ధంలో భారత్‌కు ఇజ్రాయెల్‌ సాయం.. ఎలా చేసిందో తెలుసా?

కానీ, 1971 యుద్ధ సమయంలో మాత్రం ఇజ్రాయెల్‌ భారత్‌కు తనవంతు సాయం అందించింది. పీవీ.నరసింహారావు భారత ప్రధానిగా ఉన్న సమయంలో అంటే 1992లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి.

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2023 / 09:53 PM IST
    Follow us on

    1971 India vs Pakistan war : డిసెంబర్ 16.. భారతదేశ చరిత్రలో ఈరోజు విజయ దినోత్సవం. 1971వ సంవత్సరంలో ఇదే రోజున పాకిస్తాన్ రెండు ప్రాంతాలుగా విడిపోయింది. దక్షిణాసియాలో కొత్త దేశం బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చింది. బంగ్లాదేశ్‌ విమోచనకు జరిగిన ఈ యుద్ధంలో భారత సైన్యం, బంగ్లాదేశ్ సైన్యం కలసిగట్టుగా పాకిస్తాన్ సైన్యంతో పొరాడాయి. ఈ యుద్ధం 13 రోజులపాటు కొనసాగగా, 90 వేల మంది పాకిస్తాన్‌ సైనికులు భారత సైన్యంపై తమ ఆయుధాలు ప్రయోగించారు. ఆ విపత్కర సమయంలో భారత్‌ తన అత్యంత విశ్వసనీయ మిత్రదేశమైన ఇజ్రాయెల్ నుంచి సాయం పొందింది.

    -రచయిత ద్వారా వెలుగులోకి..
    ఇజ్రాయోల్‌, భారత్‌ దేశాల మధ్య బంధం ఈనాటిది కాదు. 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా భారత్‌కు సహాయం చేసిందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రముఖ రచయిత శ్రీనాథ్ రాఘవన్ ‘1971’ పేరిట ఒక పుస్తకాన్ని ఇటీవల వెలువరించారు. దీనిలో 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించారు. న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీలో ఉంచిన పీఎన్ హక్సర్ పత్రాల ఆధారం చేసుకుని పలు కీలక అంశాలను రాఘవన్ వెల్లడించారు. పీఎన్ హక్సర్ అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి సలహాదారు. రాఘవన్ ‘హక్సర్ పత్రాల’పై పరిశోధన చేశారు. ఆ సమయంలో భారతదేశం ఇజ్రాయెల్ నుంచి సహాయం పొందిందని రాఘవన్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు.

    – ఇందిరాగాంధీ అంగీకారంతో..
    ఫ్రాన్స్‌లోని భారత రాయబారి డీఎన్‌ ఛటర్జీ 1971, జూలై 6న ఒక నోట్‌తో ఇజ్రాయెల్ ఆయుధ ప్రతిపాదన గురించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్లు రాఘవన్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను ఇందిరా గాంధీ ఎదుట ఉంచగా, ఆమె వెంటనే అంగీకరించారు. దీని తరువాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా(ఆర్‌ఏడబ్ల్యు)ద్వారా ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలను స్వీకరించే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ సమయంలో ఇజ్రాయెల్ ఆయుధాల కొరతతో బాధపడుతోందని ఆ పత్రాలు చెబుతున్నాయి. అయితే ఇరాన్‌కు ఇచ్చిన ఆయుధాలను భారతదేశానికి ఇవ్వాలని అప్పటి ఇజ్రాయెల్‌ ప్రధాని గోల్డా మీర్ నిర్ణయించారు.

    ‘1971’ పుస్తకంలోని వివరాల ప్రకారం.. ఈ రహస్య బదిలీని నిర్వహించే సంస్థ డైరెక్టర్ ష్లోమో జబుల్డోవిచ్ ద్వారా ఇందిరా గాంధీకి.. ఇజ్రాయెల్ ప్రధాని హిబ్రూ భాషలో ఒక నోట్‌ పంపారు. ఇందులో ఆయుధాలకు బదులుగా దౌత్య సంబంధాలు అభ్యర్థించారు. ఆ సమయంలో భారతదేశానికి ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేవు. ఇందుకు కారణం 1948లో ఇజ్రాయెల్ ఏర్పాటుకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదంలోనూ భారతదేశం పాలస్తీనియన్లకు మద్దతు పలికింది.

    కానీ, 1971 యుద్ధ సమయంలో మాత్రం ఇజ్రాయెల్‌ భారత్‌కు తనవంతు సాయం అందించింది. పీవీ.నరసింహారావు భారత ప్రధానిగా ఉన్న సమయంలో అంటే 1992లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి.