Nationalist Congress Party : జగన్, షర్మిల సొంత అన్నా చెల్లెళ్ళు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేశారు. తన అన్న స్థాపించిన పార్టీని బతికించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఆమెకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇప్పుడు “నువ్వెంత అంటే నువ్వెంత” అనే స్థాయికి వారి మధ్య పొరపచ్చాలు పెరిగాయి. ఇప్పట్లో వారి మధ్య సయోధ్య కుదురుతుందా? మరింత పెరుగుతుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇలాంటి కుటుంబ గొడవే మహారాష్ట్రలోనూ చోటు చేసుకుంది. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆ వివాదం మరింత పెరిగి రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది.
మహారాష్ట్రలో 1999 మే 25న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని శరత్ పవర్, అన్వర్, పీఏ సంగ్మా ప్రారంభించారు. ఆ తర్వాత మహారాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారారు. యూపీఏ హయాంలో కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యపాత్ర పోషించారు.. కాల క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని శరత్ పవార్ సొంతం చేసుకున్నారు. దానిని కుటుంబ పార్టీగా మార్చేశారు. తన దగ్గర బంధువు అజిత్ పవార్ ను పార్టీలోకి రానిచ్చి కీలక స్థానం కట్టబెట్టారు. తన కూతురు సుప్రియ సూలే కు ప్రధాన అప్పగించారు. ఇక అప్పటినుంచి సుప్రియ ఆ పార్టీ తరఫునుంచి ఎంపీగా పోటీ చేస్తూ వరుస ఎన్నికల్లో గెలుస్తున్నారు.
ఇటీవల మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాలు నేపథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ సొంత కుంపటి పెట్టుకున్నాడు. అక్కడ అధికారంలో ఉన్న బిజెపి, శివసేన కూటమికి మద్దతు ఇచ్చాడు. దీనికి స్పీకర్ కూడా ఆమోదముద్ర వేయడంతో శరత్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా అయిపోయింది.. అంతేకాదు శరత్ ను రాజకీయంగా మరింత దెబ్బకొట్టేందుకు అజిత్ పవార్ భారీ స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా తన భార్యను రంగంలోకి దింపాడు. శరత్ కుమార్తె సుప్రియ బారామతి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎప్పటినుంచో కొనసాగుతున్నారు. అయితే ఆమెకు పోటీగా అజిత్ పవార్ తన భార్య సునేత్రా పవార్ ను నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయించాలని భావించి అందుకు సంబంధించిన ప్రచార వాహనాలను ప్రారంభించారు. దీనిని శరత్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. ఎన్నికల్లో అందరికీ నిలబడే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈలోగానే పూణే జిల్లాలో సునేత్రా ప్రచార చిత్రంపై కొంతమంది వ్యక్తులు సిరా విసిరారు.. పూణే జిల్లా బారామతి తాలూకా కరహతి గ్రామంలో ఈ ఘటన జరిగింది.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ప్రచారంలో ఉన్నాయి.
సునేత్ర రాజకీయ కుటుంబానికి చెందిన సామాజిక కార్యకర్త. ఆమె సోదరుడు సీనియర్ రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పదమ్ సింగ్ పాటిల్. సునేత్ర అజిత్ పవార్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒక కొడుకు జే కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటుండగా.. రెండో కొడుకు పార్త్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పార్త్ పవార్ 2019 పార్లమెంటు ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. సునేత్రా పవార్ ఎన్విరాన్మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకురాలుగా కొనసాగుతున్నారు. 2010లో దీనిని ప్రారంభించారు. విద్యా ప్రతిష్టాన్ కు ట్రస్టీ గా పని చేస్తున్నారు. 2011 నుంచి ఫ్రాన్స్ లోని వరల్డ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ఫోరం లో థింక్ ట్యాంక్ సభ్యురాలిగా ఉన్నారు.
ఇక బారామతి పార్లమెంట్ స్థానం సుప్రియ కు ఎప్పటినుంచో కంచుకోటగా ఉంది.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చిన నేపథ్యంలో అజిత్ పవార్ ను రాజకీయంగా మరింత దెబ్బ కొట్టేందుకు అజిత్ పవార్ వేగంగా అడుగులు వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన అత్యంత తెలివిగా పావులు కదుపుతున్నారు. ఇందులో బాగానే తన భార్య సునేత్రను ఎంపీగా పోటీ చేయించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. “రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు అంటే పచ్చని కుటుంబంలో చిచ్చు పెడతాను అన్నట్టుగా.. రాజకీయమా రాజకీయమా నువ్వు ఏం చేస్తావు అంటే.. కుటుంబాన్ని మంటల్లో కాల్చేస్తాను అన్నట్టుగా” ఉన్నది మహారాష్ట్రలో ప్రస్తుతం పవార్ కుటుంబ సభ్యుల మధ్య వ్యవహారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇలా ఉంటే.. తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలాంటి మలుపులు తీసుకుంటుందో.. ఎలాంటి సంచలనాలకు కారణమవుతుందో..