Dil Raju: మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ ఇద్దర్నీ కలిపి, ఒకే ఫ్రేమ్ లో ఆన్ స్క్రీన్ పై చూసేందుకు మెగా అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నెల 29న థియేటర్లలో మెగా పండుగ మొదలుకానుంది. ఇప్పటికే సామాన్యులకు ఈ సినిమా టికెట్లు దొరకని పరిస్థితి ఉంది. సహజంగా ఇలాంటి సినిమాని దిల్ రాజు అసలు వదులుకోలేడు. నైజాంలో రాజుకి ఫుల్ పట్టు ఉంది కాబట్టి.. మేకర్స్ కూడా ఆయనను కాదు అని పక్క చూపులు చూడరు.

కానీ, ఆచార్య నిర్మాతలు పక్క చూపులు కాదు, ఏకంగా పక్కకి వెళ్ళిపోయారు. ‘ఆచార్య’ నైజాం హక్కుల కోసం, ముందు నుంచి కాసుకొని కూర్చున్న దిల్ రాజుకి చివరికి ఖర్చీప్ కూడా మిగలలేదు. వరంగల్ శ్రీను భారీ ధరకు ‘ఆచార్య’ సినిమా నైజాం రైట్స్ కొన్నాడు. ‘ఆచార్య’ టీమ్.. నైజాం రైట్స్ ను 43 కోట్లు చెప్పింది. ‘దిల్ రాజు’ 40 కోట్లు ఇస్తాను అంటూ బేరానికి దిగాడు.
డిస్ట్రిబ్యూషన్ సామ్రాజ్యంలో నైజాం పై పట్టు సాధించడానికి ఎప్పటి నుంచో తపన పడుతున్న ‘వరంగల్ శ్రీను’, ఇదే అదును అనుకుని తన వ్యాపార హద్దులు దాటేశాడు. రిస్క్ అని తెలిసినా 42 కోట్లకు నైజాంలో ఆచార్యను సొంతం చేసుకున్నాడు. ఐతే, ఇక్కడ ఒక విశేషం ఉంది. నైజాం డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజుకు, వరంగల్ శ్రీనుకి మధ్య చాలా సంవత్సరాలుగా గట్టి పోటీ నడుస్తోంది.

దిల్ రాజు ఆధిక్యాన్ని అణిచివేయాలని వరంగల్ శ్రీను పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. చుట్టూ ఉన్న పోటీ దారులను ఎప్పటికప్పుడు తొక్కుకుంటూ వస్తున్న దిల్ రాజు, వరంగల్ శ్రీను విషయంలో మాత్రం ప్రతిసారి చేతులెత్తేస్తున్నాడు. గతంలో కూడా ‘జాతిరత్నాలు’ అనే సినిమా విషయంలో వరంగల్ శ్రీనుకి దిల్ రాజుకి మధ్య డైరెక్ట్ పోరే నడిచింది. ఆ పోరులో వరంగల్ శ్రీను తీరు చూసి.. దిల్ రాజు నీరుగారిపోయారు.
మళ్లీ ‘ఆచార్య’ విషయంలోనూ ఇదే రిపీట్ అయ్యింది. రాజు పై పంతానికి పోయి శ్రీను పట్టుబట్టి మరీ ఎక్కువ మొత్తం చెల్లించి ఆచార్య హక్కులను దక్కించుకోవడం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ లో ‘దిల్ రాజు’ హవా తగ్గించడానికే వెనుక నుంచి కొందరు వరంగల్ శ్రీనును రంగంలోకి దించారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
‘దిల్ రాజు’ సర్వనాశనం చేసేదాకా నిద్రపోను’ అని వరంగల్ శ్రీను పబ్లిక్ గానే కామెంట్లు చేస్తున్నాడట. ఈ మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో మంటలు రేపుతున్నాయి. మరి, ఈ ‘వరంగల్ శ్రీను’ అనే పాత్రధారి వెనుక ఉన్న సూత్రధారి ఎవరు ? అనేది త్వరలోనే తెలియజేస్తాం.
Recommended Videos:


