
Ippatam Village: వైసీపీ సర్కారు ఎటువంటి పనిచేపట్టినా దానికి పుణ్యం, పురుషార్థం ఒకటి ఉంటుంది.వారు ఏం చేసినా దాని వెనుక పెద్ద కథే నడుస్తోంది. ఒకవైపు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఉన్న ఏపీ పెద్దలు మధ్యలో కొద్దిసేపు మెదడుకు పని పెడుతున్నారు. విధ్వంసాలకు దిగుతున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటం గుర్తింది కదూ. మరోసారి ఆ గ్రామంపై విరుచుకుపడ్డారు. రోడ్డు విస్తరణ, ఆక్రమణల పేరిట భవనాలను తొలగిస్తున్నారు. ఏకంగా 12 ఇళ్లకు సంబంధించి ప్రహరీలు తొలగించారు. గత ఏడాది జనసేన ఆవిర్భావ సభకు స్థలమిచ్చారన్న ఒకే ఒక కారణంతో వాహనాలు వెళ్లని, ఆర్టీసీ బస్సు ముఖం చూడని ఆ గ్రామంలో ఏకంగా 70 అడుగుల మేర రోడ్డును విస్తరించాలని ప్రయత్నిస్తున్నారు. మరో పది రోజుల్లో మచిలీపట్నంలో జనసేన పదో ఆవిర్భావ సభ నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతుండగా.. గత ఆవిర్భావ సభ మూలాలను దెబ్బకొట్టే పనిలో ప్రభుత్వం పడిందన్న మాట.
తాడేపల్లి మండలంలో ఇప్పటం గ్రామంలో రెండు భారీ జేసీబీలతో పదుల సంఖ్యలో పోలీసులు రంగంలోకి దిగారు. ఒక్కసారిగా హఠాత్ పరిణామంతో స్థానికులు ఆందోళనకు దిగారు. తొలగింపు ప్రక్రియను అడ్డగించారు. కానీ పోలీసులు వారిని బయటకు పంపించేశారు. అయితే ఆందోళనకారుల అభ్యంతరాలతో ప్రహరీల తొలగింపుతో సరిపెట్టారు. స్థానిక జనసేన నాయకుడు నరసింహరావు ఇంటిని టార్గెట్ చేసుకొని తొలగింపునకు దిగగా గ్రామస్థులు అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రహరీని తొలగించిన అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగారు. ఇప్పటివరకూ 12 ఇళ్లకు సంబంధించి నిర్మాణాలను తొలగించారు. చాలామంది ముందస్తుగా కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడంతో వారి జోలికి మాత్రం పోవడం లేదు.
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను జనసేన అధ్యక్షుడు సాదరంగా ఆహ్వానించారు. ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయని కూడా ప్రకటించారు. మరోవైపు మార్చి 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కొన్ని కీలక రాజకీయ ప్రకటనలకు వేదికగా నిలుస్తుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ తాజా చర్యలు చర్చనీయాంశంగా మారాయి. మచిలీపట్నంలో ఆవిర్బావ సభ దూకుడును అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఇప్పటం గ్రామంపై మరోసారి విరుచుకుపడిందన్న టాక్ వినిపిస్తోంది.

గత ఏడాది జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం గ్రామస్థులు స్వచ్ఛందంగా భూములిచ్చారు. పంట భూములను సైతం పవన్ పై ఉన్న అభిమానంతో వదులుకున్నారు. ఈ సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. అటు భూములిచ్చిన రైతులకు హెచ్చరికలు పంపింది. కానీ వారు వినలేదు. ఆవిర్భావ సభ కూడా విజయవంతమైంది. దీంతో ప్రభుత్వ పెద్దలు కొందరు ఎంటరయ్యారు. అసలు వాహనాలే వెళ్లని గ్రామంలో రోడ్డు విస్తరణ, ఆక్రమణల తొలగింపు అంటూ కొత్త కథ అల్లారు. ఇళ్లను తొలగించారు. దీంతో జనసేనాని పవన్ స్పందించారు. బాధితులకు అండగా నిలిచారు. వారి తరుపున పోరాటం కూడా చేశారు. బాధితులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున సాయం కూడా అందించారు. ఇంటా బయటా విమర్శలు రావడంతో ఇప్పటం విషయంలో కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు.
అయితే ఇప్పుడు జనసేన పదో వార్షికోత్సవాన్ని మచిలీపట్నంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సిద్ధమైంది. దీంతో ప్రభుత్వంలో ఒకరకమైన కలవరం ప్రారంభమైంది. బందరు సభతో పవన్ యుద్ధం ప్రకటిస్తారని నాదేండ్ల మనోహర్ ప్రకటించారు. దీంతో ఇప్పటం గ్రామస్థులను భయపెట్టి పవన్ కు గట్టి సంకేతాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై పవన్ ఆలస్యంగా స్పందించే అవకాశముంది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో పారిశ్రామికవేత్తలు ఏపీలో ఉన్న తరుణంలో రాజకీయ విమర్శలు చేయమని పవన్ ప్రకటించారు. అయితే జనసేన ఆవిర్భావ సభతో వైసీపీ సర్కారుపై పవన్ పెద్ద యుద్ధం ప్రకటించే చాన్స్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.