https://oktelugu.com/

Delhi liquor scam : సిబిఐ కి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ

వచ్చే ఆరువారాలు నాకు విపరీతమైన పని ఉంటుంది. అందు వల్ల రేపటి విచారణకు నేను హాజరు కాలేనని" కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, కవిత లేఖ రాసిన నేపథ్యంలో సిబిఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : February 25, 2024 / 09:15 PM IST

    Delhi Liquor Scam Case

    Follow us on

    Delhi liquor scam : సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసులో ఆదివారం అనూహ్య మలుపు చోటుచేసుకుంది. మొన్నటిదాకా ఈ కేసులో కవితను విచారించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు.. ఇటీవల ఆమెను నిందితురాలిగా ప్రకటించాయి. ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసులు అందజేశాయి. నేపథ్యంలో కవితను సోమవారం విచారించి అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. గతంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, గోరంట్ల బుచ్చిబాబు, మాగుంట రాఘవ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇదే విధంగా వ్యవహరించాయి. ఈక్రమంలో సోమవారం కవిత విచారణకు హాజరవుతారా? లేదా? అనే ప్రశ్నలకు కొనసాగుతుండగానే భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత కేంద్ర దర్యాప్తు సంస్థకు అనూహ్యంగా లేఖ రాశారు.

    సోమవారం నాటి విచారణకు తన హాజరు కాలేనంటూ సిబిఐకి కవిత తేల్చి చెప్పారు.. ఆదివారం ఆమె సిబిఐ కి ఓ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ఆమె ప్రస్తావించారు. సిఆర్పిసి సెక్షన్ 41- ఏ కింద జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని ఆమె ఆ లేఖలో కోరారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని సిబిఐ అధికారులకు స్పష్టం చేశారు. సిబిఐ విచారణకు పర్చువల్ గా అందుబాటులో ఉంటానని కవిత పేర్కొన్నారు. తనకు సీఆర్పీసీ సెక్షన్ 41 – ఏ కింద నోటీసులు ఇవ్వడం సరైనది కాదని ఆమె ప్రకటించారు. “గతంలో మీరు సెక్షన్ – 160 కింద నోటీసు జారీ చేశారు. మొన్న 41 -ఏ కింద నోటీసులు ఇచ్చారు. అసలు ఎలాంటి పరిస్థితుల్లో మీరు 41- ఏ కింద నోటీసులు ఇచ్చారో ఇంతవరకు స్పష్టత లేదు. అసలు ఎందుకు నోటీసులు ఇచ్చారో కూడా అర్థం కావడం లేదు. ఇది నా వ్యక్తిగతంగా, రాజ్యాంగ హక్కులకు ఇబ్బంది కలిగిస్తోంది. నా ప్రజాస్వామిక స్వేచ్ఛను హరిస్తోంది. మీరు చేస్తున్న అభియోగాలలో నా పాత్ర లేదు. పైగా నేను దాఖలు చేసిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది” అని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు.

    “నాకు ఈ డి ఇచ్చిన నోటీసులపై గతంలోనే నేను సుప్రీంకోర్టును ఆశ్రయించాను. సుప్రీంకోర్టులో ఆ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. విచారణకు నన్ను పిలవబోమని సుప్రీంకోర్టు సాక్షిగా అదనపు సొలిసిటర్ జనరల్ ప్రకటించారు. సుప్రీంకోర్టులో ఆయన ఇచ్చిన హామీ సిబిఐ కి కూడా వర్తిస్తుంది. సిబిఐ బృందం గతంలో నా ఇంటికి వచ్చినప్పుడు పూర్తిగా సహకరించాను. సిబిఐ దర్యాప్తు చేస్తానంటే ఎప్పుడైనా సహకరిస్తాను. కానీ 15 నెలల విరామం తర్వాత ఇప్పుడు నన్ను పిలవడం ఏమిటి? పైగా గతంతో పోల్చితే ఇప్పుడు సెక్షన్లు మార్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మా పార్టీ కొన్ని బాధ్యతలు నాకు అప్పగించింది. ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ కూడా ఖరారైంది. వచ్చే ఆరువారాలు నాకు విపరీతమైన పని ఉంటుంది. అందు వల్ల రేపటి విచారణకు నేను హాజరు కాలేనని” కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, కవిత లేఖ రాసిన నేపథ్యంలో సిబిఐ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.