Delhi Liquor Policy Scam: “ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంతవరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు” ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదేపదే చెప్పిన మాట ఇది. ఆయన మాటతోనే, ఆయన చేసిన నినాదంతోనే ప్రజలు ఓట్లు వేశారు. చీపురు పార్టీకి అధికారం కట్టబెట్టారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా రెండు రోజులుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్న వివరాలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. ఢిల్లీ లో మద్యం సిండికేట్ కు సహకరించేందుకు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముడుపులు తీసుకున్నట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు చెప్తున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 31చోట్ల సోదాలు జరిపారు. అయితే ఈ మద్యం దందాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఉండటం కలకలం సృష్టిస్తోంది.

కార్టెల్ గా ఏర్పడి నిర్వహిస్తున్నారు
వైసీపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి మద్యం కంపెనీలు, దశాబ్దం క్రితం వరకు ఢిల్లీలో మద్యం సిండికేట్ నడిపిన ఓ డాన్ కంపెనీలు కలిసి కార్టెల్ గా ఏర్పడి వ్యాపారం సాగిస్తున్నాయి. ఈ కంపెనీలకు అరబిందో గ్రూపునకు చెందిన రెడ్డి కంపెనీ బ్యాంకు గ్యారంటీ ఇచ్చింది. తమ వ్యాపారానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నందుకు మద్యం సిండికేట్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు, ఎక్సైజ్ అధికారులకు భారీగా ముడుపులు ఇచ్చిందని తెలుస్తోంది. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ నేతల ప్రమేయం కూడా ఉందని సమాచారం. త్వరలో వాళ్ల పేర్లు కూడా వెల్లడిస్తామని సీబీఐ అధికారులు అంటున్నారు. మరోవైపు ఈ కుంభకోణంలో తెలంగాణ నేతలకు సంబంధం ఉందని బీజేపీ పార్లమెంట్ సభ్యుడు పర్వేశ్ వర్మ స్వయంగా ఆరోపించడం గమనార్హం. అయితే తెలంగాణ నేతలు బుక్ చేసిన హోటళ్లకు మనీష్ సిసోడియా వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకున్నారని, వీరిలో ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారని వర్మ చెబుతున్నారు. ఇక గత నెల మేలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కలుసుకున్నారు. అప్పుడు కేసీఆర్ వెంట టీఆర్ఎస్ కు చెందిన పలువురు తెలంగాణ నేతలు ఉన్నారు. సి.బి.ఐ ఎఫ్ఐఆర్ లో 16 మంది పేర్లతో పాటు గుర్తుతెలియని అనేక మంది ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మనీష్ సిసోడియా అయినప్పటికీ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే ఇది ఎటువైపు తిరుగుతుందోననే ఆందోళన రాజకీయ వర్గాల్లో ఉంది. కేంద్రంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా అవతరించే ప్రయత్నంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్త యాత్రను ప్రకటించిన రెండు రోజులకే ఆ పార్టీలో నెంబర్ వెలుగొందుతున్న ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పై అవినీతి కేసు నమోదవడం గమనార్హం. ఆయనతోపాటు తెలుగు వాడైన ఐఏఎస్ అధికారి అరవ గోపికృష్ణ సహా ముగ్గురు అధికారులు, పదిమంది మద్యం లైసెన్సీలతో పాటు పలువురు వ్యాపారులపై సిబిఐ కేసు నమోదు చేయడం కలకలం సృష్టిస్తోంది. కేసులే కాకుండా సదరు వ్యక్తుల ఇళ్లతో పాటు దేశవ్యాప్తంగా ఢిల్లీ, గుర్గ్రామ్, చండీగఢ్, ముంబై, హైదరాబాద్, లక్నో, బెంగళూరు లో 31 స్థావరాల పై సిబిఐ దాడులు చేసింది. ఇందులో భాగంగా అనేక కీలకమైన పత్రాలు, డిజిటల్ రికార్డులు లభించాయని సిబిఐ తన అధికారిక ప్రకటనలో తెలిపింది.
2021లో తెర లేసింది
రెండోసారి అధికారంలోకి రాగానే అరవింద్ కేజ్రివాల్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానమైనది మద్యం దుకాణాల ప్రైవేటీకరణ. ఇందుకుగాను ₹7,200 కోట్ల మేరకు ప్రభుత్వం టెండర్ విడుదల చేసింది. దాదాపు 850 దుకాణాలను ప్రైవేటు సంస్థలకు కేటాయించింది. ఈ వ్యవహారం అంతా రాష్ట్ర కేబినెట్ అనుమతితోనే జరిగినప్పటికీ ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ కు నిర్ణీత పద్ధతిలో సమాచారం ఇవ్వకపోవడంతోనే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. మొత్తం ఈ విధానాల్లో ఎన్నో అవకతవకలు జరగడంతో పాటు, భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని అనుమానం వ్యక్తం చేస్తూ, 2020-21 కాలానికి ఢిల్లీ లో మద్యం విధానంపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని సిఫారసు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జూలైలో కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఈ లేఖలో ఉన్న అంశాల ఆధారంగా విచారణ జరపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సిబిఐ ని ఆదేశించారు. హోం శాఖ పంపిన వివరాల ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి, జరిపింది. లైసెన్సీలకు కోట్ల రూపాయల లబ్ధి వచ్చేలా మనీష్ సిసోడియా, అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ అరవ గోపికృష్ణ, అప్పటి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారి, అప్పటి అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ భట్నాగర్ నిర్ణయాలు తీసుకున్నారని సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
కేవలం వీరే కాకుండా ఓన్లీ మచ్ లౌడర్ కంపెనీ మాజీ సీఈవో విజయ్ నాయక్, పెర్నాడ్ రికార్డు కంపెనీ మాజీ అధికారి మనోజ్ రాయ్, బ్రిండ్కో స్పిరిట్స్ యజమాని అమన్ దీప్ ధాల్, ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు ఎక్సైజ్ విధానాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈ వ్యవహారంలో మరో ముందడుగు వేసి లైసెన్సీదారులు వ్యాపారులకు క్రెడిట్ నోట్లు జారీ చేసి రాజకీయ నాయకులకు కోట్లాది రూపాయలను ముడుపులుగా చెల్లించారని సిబిఐ తెలిపింది. అయితే మనీష్ సిసోడియాకి కుడి భుజమైన దినేష్ అరోరా అనే వ్యక్తికి చెందిన రాధా ఇండస్ట్రీస్ ఖాతాలకు కోట్లాది రూపాయలు చెల్లించాలని సిబిఐ సాక్ష్యంగా చూపింది. ఇక తెలంగాణలో ఉంటున్న అరుణ్ రామచంద్ర కూడా సమీర్ మహేంద్రు నుంచి రెండు నుంచి నాలుగు కోట్ల ను ముడుపులు నగదు రూపంలో స్వీకరించి విజయ్ నాయర్ అనే వ్యక్తి ద్వారా మనీష్ సిసోడియాకు పంపించారని సమాచారం. ఒకప్పటి మాఫియా డాన్ పాంటీ చడ్డా హత్యకు గురయ్యాక ఆయన సంస్థ మహాదేవ్ లిక్కర్స్ కు యజమానిగా మారిన సన్నీ మార్వా ఎక్సైజ్ ఉన్నత అధికారులకు క్రమం తప్పకుండా ముడుపులు చెల్లిస్తూ ఉండడంతో వారు ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఎక్సైజ్ విధానాల్లో మార్పులు చేయడం, లైసెన్స్ దారులకు మినహాయింపులు ఇవ్వడం, లైసెన్సు ఫీజులు రద్దు చేయడం, పైనుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఎల్ -1 లైసెన్సులు పొడిగించడం, డ్రై డేలను 21 నుంచి మూడు రోజులకు తగ్గించారు. కరోనా సమయంలో మద్యం అమ్మకాలు లేకపోవడంతో నష్టపోయిన వ్యాపారులకు లైసెన్స్ ఫీజులో రాయితీ కోరడంతో ప్రభుత్వం అప్పట్లో 144 కోట్ల ఫీజు మాఫీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయంలో మద్యం షాపు దక్కించుకున్న కంపెనీ అక్కడ షాపు ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు సంపాదించుకోలేకపోవడంతో 30 కోట్ల డిపాజిట్ ను ప్రభుత్వం వెనక్కి ఇచ్చేసింది. ఈ కారణాల రీత్యా మనిష్ సిసోడియా, అరవ గోపికృష్ణ, ఇతర అధికారులతో పాటు 15 మంది వ్యాపారులపై సిబిఐ సెక్షన్ 120- బి, 477-ఏ అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ ఏడు కింద కేసులు నమోదు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఇవే ఆరోపణలపై ఈడి కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంది.

14వ నిందితుడు కోకాపేటలో
ఇక ఈ కుంభకోణం కేసులో 14వ నిందితుడిగా ఉన్న ఇండోస్ స్పిరిట్ సంస్థ నిర్వాహకుడు రామచంద్ర హైదరాబాదులోని కోకాపేట్ లో ఉంటున్నారు. సర్వేనెంబర్ 145, ఈడెన్ గార్డెన్స్ లో ఉన్న ఆయన విల్లాపై కూడా సిబిఐ తనిఖీలు నిర్వహించింది. ఇక ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ మాగుంట కంపెనీలు అనుమానాస్పద రీతిలో ఈఎండిలు సమర్పించినట్టు తెలుస్తోంది. బ్లాక్ లిస్టులో ఉన్న ఈయన పార్టీలకు కూడా దుకాణాలు కేటాయించడం, మద్యం ఉత్పత్తిదారులైన ఈయన కంపెనీలు రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఢిల్లీలోని 32 రిటైల్ జోన్లు ఉండగా, వాటిలో ఒక్కో జోన్ లో 27 దుకాణాలు ఉన్నాయి. జోన్ కు 225 కోట్ల చొప్పున సగటు రిజర్వు ఫీజు ఉంటుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కి చెందిన ఆగ్రో ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పిక్సీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మూడు జోన్లను దక్కించుకున్నాయి. సమీర్ మహీంద్రు, గీతిక మహేంద్రు లకు చెందిన ఖావో గాలి రెస్టారెంట్స్ బ్లాక్ లిస్టులో ఉన్నప్పటికీ రెండు జోన్లను దక్కించుకుంది. ఈ రెండు కంపెనీలు పరస్పరం ఈఎండీలు సమర్పించుకోవడం గమనార్హం. ఇండో స్పిరిట్ కు చెందిన బబ్లీ ఎంటర్ప్రైజెస్ మాగుంట కంపెనీలకు 25 కోట్ల ఈ ఎండి సమర్పించగా, బాలాజీ గ్రూపుకు చెందిన మరో రెండు కంపెనీలు ప్రైమస్ ఎంటర్ప్రైజెస్, హివిడి ఎంటర్ప్రైజెస్ 35 కోట్ల ఈఎండీ సమర్పించాయి. ఖావో గాలి కంపెనీకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన రాఘవ మాగుంటకు చెందిన జైనాబ్ ట్రేడింగ్ కంపెనీ 25 కోట్ల ఈఎండిని సమర్పించింది. మధ్యప్రదేశ్ కు చెందిన బ్లాక్ లిస్టు కంపెనీ సోం గ్రూపునకు చెందిన రైసెన్ మార్కెటింగ్ కు కూడా రెండు జోన్లు దక్కాయి. కార్టెల్ గా ఏర్పడిన ఈ కంపెనీలకు కేబినెట్ నోటు లేకుండానే లైసెన్స్ ఫీజు కింద 144.36 కోట్ల మేరకు రాయితీ ఇచ్చారు. దిగుమతి చేసుకున్న బీర్ల కేసులకు సంబంధించి ఒక్కో కేసు పై 50 రూపాయలు చొప్పున రాయితీ కూడా ఇచ్చారు. మద్యం వ్యాపారుల కమీషన్ ను 2.5% నుంచి 12.5% పెంచారు. ఇందులో ఆరు శాతం వరకు నగదు రూపంలో సిసోడియాకు వెళ్లేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా వచ్చిన నగదునే పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆఫ్ ది పార్టీ ఖర్చు పెట్టిందని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఇన్నాళ్లు క్లీన్ ఇమేజ్ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి.. ఆ పార్టీ నేతలకు ఈ అవినీతి మరక ఖచ్చితంగా మైనస్ గా చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్మాయంగా విస్తరించే ముందర కేజ్రీవాల్ సహచరుడిపై ఆరోపణలు ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తెస్తుందనడంలో సందేహం లేదు. అవినీతి రహిత సమాజం అంటూ ముందుకొచ్చిన కేజ్రీవాల్ ఎలా స్పందిస్తాడన్నది వేచిచూడాలి.
Also Read:CJI NV Ramana- Jagan: సీజేఐ, సీఎం జగన్..లోపల ఎంత పగలున్నా పైకి ‘విందు’.. తప్పదు మరీ


[…] Also Read: Delhi Liquor Policy Scam: మద్యం వ్యాపారంలో అక్రమాలు.. … […]