Delhi Liquro Scam Case : ఇన్నాళ్లూ కోల్డ్ స్టోరేజీలో ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్యంగా కదలిక వస్తోంది. నిన్నటి దాకా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును విచారించిన ఈడీ అధికారులు అకస్మాత్తుగా గేర్ మార్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బలంగా పని చేసిన సౌత్ లాబీలో కీలకమైన ఓ వ్యక్తి అప్రూవర్‌గా మారారు. దీంతో ఈడీ అధికారులు అతడు చెప్పిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుమారు నాలుగు నుంచి ఐదుగుర వ్యక్తులను విచారించినట్టు తెలుస్తోంది..
వాస్తవానికి కవిత మాజీ ఆడిటర్‌ను ఈడీ అధికారులు పిలవ డంతో కేసులో ఏదో జరుగుతోందనే గుసగుసలు విన్పించాయి. అనుకున్నట్టుగానే బుచ్చిబాబును ఈడీ అధికారులు రెండు రోజుల పాటు విచారించారు. పలు కీలక విషయాలు రాబట్టారని తెలుస్తోంది. బుచ్చిబాబు ఇచ్చిన ఆధారాల ప్రకారమే పలువురు వ్యక్తులను ఈడీ అధికారులు శుక్రవారం విచారించినట్టు తెలుస్తోంది. అయితే ఈడీ అధికారులు సౌత్ లాబీ పై బలంగా తవ్వడంతో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అప్రూవర్ గా మారారని తెలుస్తోంది. గతంలో ఆయన కుమారుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. అతడు కూడా కేసులో కీలకంగా ఉండటంతో అతడు చెప్పిన వివరాల ఆధారంగానే కవితను ఈడీ అధికారులు విచారించారు.
మొదట్లో ఢిల్లీ ఉపముఖ్య మంత్రి మనిష్ సొసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ.. ఆ తర్వాత ఆ స్థాయిలో వేగంగా అడుగులు వేయలేకపోయింది. విచారణ పేరుతో హడావుడి మాత్రమే చేసింది. కవితను విచారించినప్పుడు కూడా ఇదే స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. తర్వాత కేసు ఎందుకనో చప్పున చల్లారిపోయింది. మళ్లీ ఇప్పుడు కేసు వెలుగులోకి వస్తోంది. ఈడీ చకచకా అడుగులు వేస్తోంది. అయితే ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన నివేదిక షాకింగ్‌గా ఉండటంతో అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని, లిక్కర్ స్కాం విషయంలో ఏదైనా చేయొచ్చని కమల నాథులు భావిస్తున్నారు. వైసీపీ ఎంపీ అప్రూవర్‌గా మారడంతో యాదృచ్ఛికంగా కవిత మహిళా బిల్లును తెరపైకి తేవడం విశేషం. గతంలో విచారణ చేసినప్పుడు కూడా ఆమె విధానాన్ని అవలంబించారు.