CM Kejriwal Arrest : పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మూడవ విడత జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించిన తర్వాత.. దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం లో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గురువారం రాత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేశారు. సుమారు 12 మంది అధికారులతో కూడిన బృందం ఆయన ఇంటికి వెళ్ళింది. చాలాసేపు ఆయనను విచారించింది. అనంతరం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ పరిణామాలతో పోలీసులు ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసాన్ని భారీగా మోహరించారు. ఫలితంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి నివాసానికి ఆప్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం వారు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు చేయడం ఒక్కసారిగా దేశ రాజకీయాలలో కలకలం రేపింది. అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం బిజెపి పన్నిన రాజకీయ కుట్ర అని ఆప్ పార్లమెంటు సభ్యుడు రాఘవ్ చద్దా ఆరోపించారు .
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అభియోగాలు మోపారు. దీనికి సంబంధించి విచారణకు రావాలని 9సార్లు సమన్లు జారీ చేశారు. ఆయనప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి హాజరయ్యేందుకు నిరాకరించారు. దీనికి తోడు ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో గురువారం ఊరట లభించలేదు. అరెస్టుపై మినహాయింపు ఇచ్చేందుకు న్యాయస్థానం ఒప్పుకోలేదు. ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. అలా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక మద్యం విధానానికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు ఒప్పుకోకపోవడంతో.. అరవింద్ తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అయితే ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్పించి విచారణ జరిపించేలాగా అరవింద్ కేజ్రీవాల్ న్యాయ బృందం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు పై శుక్రవారం ఉదయం విచారణ చేపట్టే అవకాశం లేదని సమాచారం.
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టుపై అక్కడి అధికార ఆప్ నాయకులు స్పందిస్తున్నారు. అరెస్టు అక్రమమని ఆరోపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బిజెపి ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని విమర్శిస్తున్నారు. “ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు సమంజసం కాదు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు. ఇంతవరకు కేసులో ఎటువంటి పురోగతిని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సాధించలేకపోయారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఢిల్లీలో ఆప్ మెజారిటీ పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని భావించి.. కేంద్రంలోని పెద్దలు అరవింద్ ను అరెస్టు చేయించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని” ఢిల్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ వ్యాఖ్యానించారు.