COVID-19 Cases: దేశంలో కొవిడ్ మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తప్పిపోయిందనుకున్న ముప్పు కొత్త వేరియంట్ రూపంలో ముంచుకొస్తోంది. దీంతో యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా.. దేశవ్యాప్తంగా 260 కరోనా వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,828కు చేరింది. ఈ మేరకు.. కేంద్ర ఆరోగ్యశాఖా డేటా సూచిస్తోంది.
మొత్తం 4.5 కోట్ల కేసులు..
ఇక దేశంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4.5కోట్లుగా ఉంది. రికవరీలు 4,44,69,931గా నమోదైంది. ఫలితంగా.. కొవిడ్ రికవరీ రేట్ 98.81శాతంగా ఉంది. కొవిడ్ మరణాలు 5,33,317 ఉండగా, మరణాల రేట్ 1.19శాతంగా ఉంది. ఇప్పటివరకు 220.67 కోట్ల మంది కొవిడ్ టీకా తీసుకున్నారు.
కొత్త వేరియంట్‌తో..
అయితే.. దేశంలో కోవిడ్ కేసులు పెరగడానికి కొత్త సబ్ వేరియంట్ జేఎన్–1 అని తెలుస్తోంది. కేరళలో కేసులు పెరగడానికి ఈ వేరియంటే కారణం. కేరళలో ఈ రకం వైరస్‌తో సోమవారం ఒక్కరోజే దేశంలో ఐదుగురు మరణించారు. అందులో ముగ్గురు కేరళవాసులే కావడం గమనార్హం.
కేంద్రం అలర్ట్..
జేఎన్–1 సబ్ వేరియంట్‌తో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రానున్న పండుగ సీజన్‌లో ఇంకా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకోవాలని ఆదేశించింది. అవసరమైన చర్యలు చేపట్టాలని అని కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు చేసింది. జిల్లా స్థాయిలో ఎలాంటి ఇన్‌ఫ్లూయోంజా తరహా అనారోగ కేసులు నమోదైనా.. వాటిని రికార్డ్ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఊపిరితిత్తుల సమస్యలను సైతం రికార్డు చేయాలని స్పష్టం చేసింది.
స్పందించిన డబ్ల్యూహెచ్‌వో..
ఈ కొవిడ్ జేఎన్–1 సబ్‌వేరియంట్ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా స్పందించింది. ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని సూచించింది. అయితే ప్రమాదకరమైంది కాదని వైద్యులు సూచిస్తున్నారు. అలా అని నిర్లక్ష్యం చేయొద్దని పేర్కొంటున్నారు.