https://oktelugu.com/

Sonia Gandhi: ఖమ్మం బరిలో సోనియా గాంధీ.. కాంగ్రెస్‌ గేమ్‌ చేంజర్‌ ప్లాన్‌!

కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో.. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా లోక్‌సభ ఎన్నికలకు ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేస్తోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ తనయ, ప్రస్తుతం ఏపీ సీఎం జగన్‌ సోదరి, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌.షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 5, 2024 / 12:51 PM IST

    Sonia Gandhi

    Follow us on

    Sonia Gandhi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ మంచి ఊపు మీద ఉంది. ఇదే ఉత్సాహాన్ని రాబోయే లోక్‌సభ ఎన్నికల వరకూ కొనసాగించాలని భావిస్తోంది. ఈసారి పార్లమెంటు ఎన్నికలు కాస్త ముందే రావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ తెలంగాణలో మెజారిటీ లోక్‌సభ స్థానాల్లో గెలిచేందుకు గేమ్‌ చేంజర్‌ ప్లాన్‌తో రెడీ అవుతోంది. ఈమేరకు ఇప్పటికే పార్లమెంట్‌ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించింది. అభ్యర్థుల ఎంపికపైనా సీఎం రేవంత్‌రెడ్డి క్లారిటీకి వచ్చారు. కాంగ్రెస్‌తోపాటు, బీఆర్‌ఎస్, బీజేపీలో ఉన్న నేతలను కూడా కాంగ్రెస్‌ తరఫున బరిలో నింపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయా పార్టీల్లోని నేతలతో సంప్రదింపులు కూడా మొదలు పెట్టారు.

    దక్షిణాదిన సత్తా చాటేలా..
    కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో.. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా లోక్‌సభ ఎన్నికలకు ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేస్తోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌ తనయ, ప్రస్తుతం ఏపీ సీఎం జగన్‌ సోదరి, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌.షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకుంది. ఆమె ఎంట్రీతో ఇటు ఏపీ, అటు తెలంగాణలో కాంగ్రెస్‌కు బలం చేకూరిందని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో ఈసారి దక్షిణాది నుంచే ఢిల్లీ పీటంపై కాంగ్రెస్‌ గురిపెట్టింది. ఇందుకోసం కాంగ్రెస్‌ అగ్రనేత సోనియాగాంధీని తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలో నిలపాలని భావిస్తోంది. సోనియాగాంధీ పోటీ ద్వారా తెలంగాణ, కర్ణాటక, ఏపీతోపాటు తమిళనాడు, కేరళలోనూ దాని ప్రభావం ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. పార్టీకి అనుకున్నదానికన్నా ఎక్కువ సీట్లు వస్తాయని నాయకులు లెక్కలు వేస్తున్నారు.

    టీ కాంగ్రెస్‌ ఏకగ్రీవ తీర్మానం..
    తెలంగాణ నుంచి సోనియా గాంధీని బరిలో దించాలని తెలంగాణ కాంగ్రెస్‌ భావిస్తోంది. తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియాగాంధీకి ఇక్కడ మంచి గుర్తింపు ఉందని నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సోనియాగాంధీని ఇక్కడి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని అంటున్నారు. సోనియగాంధీ పోటీ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపైనా పడుతుందని, కాంగ్రెస్‌ మరింత పుంజుకుంటుందని పేర్కొంటున్నారు. సోనియాగాంధీని పోటీ చేయించేలా చూడాలని గత నెలలోనే పార్టీలో తీర్మానం చేసి అధిష్టానానికి పంపించారు. ఈమేరకు సోనియగాంధీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే సోనియాగాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

    ఖమ్మం నుంచి పార్లమెంట్‌కు..
    తాజాగా సోనియాగాంధీ పోటీ చేసే లోక్‌సభ నియోజకవర్గంపైనా ఆ పార్టీ నాయకులు క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచి సోనియాగాంధీని పోటీ చేయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్య నేతలు అధిష్టానానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఖమ్మం బరిలో దిగితే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఖమ్మం నుంచి పోటీపై కూడా సోనియాగాంధీ కార్యాలయం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.

    రెండు రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు..
    సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీకి నిలపడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సానుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయడం ఖరారు అయితే ఆమె దక్షిణాది నుంచి పోటీ చేయడం రెండోసారి అవుతుంది. గతంలో 1999లో కర్ణాటకలోని బళ్లారి నుంచి బరిలో నిలిచి గెలిచారు. నాడు బీజేపీ నేత సుష్మాస్వరాజ్‌పై విజయం సాధించారు. పాతికేళ్ల తర్వాత సోనియా మళ్లీ ఖమ్మం నుంచి పోటీ చేసినట్లు అవుతుంది.

    ఇందిరాగాంధీ కూడా..
    గతంలో సోనియాగాంధీ అత్త అయిన ఇందిరాగాంధీ కూడా గతంలో కర్ణాటక, తెలంగాణ ప్రాంతం నుంచి పోటీ చేశారు. 1978లో కర్ణాటకలోని చిక్‌మంగళూరు నుంచి పోటీచేసి గెలిచారు. 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని మెదక్‌ నుంచి పోటీచేసి గెలిచారు.