Mallikarjun Kharge: మల్లికార్జున ఖర్గే లో ఏమిటీ వైరాగ్యం? కాంగ్రెస్ ఓటమి ఖాయమైనట్టేనా..

Mallikarjun Kharge బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం శుక్రవారం రాజ్యసభ సమావేశం జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. బడ్జెట్ కు సంబంధించి తన అభిప్రాయాలను రాజ్యసభలో చెప్పారు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 3, 2024 8:42 am
Follow us on

Mallikarjun Kharge: ఓవైపు రాహుల్ గాంధీ భారత్ న్యా య్ యాత్ర అని మొదలుపెట్టాడు. ఇప్పటికే జోడోయాత్రను పూర్తి చేశాడు. కానీ అది ఆశించినంత ఫలితాన్ని ఇచ్చినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించలేదు. కీలకంగా ఉన్న ఇండియా కూటమి లో లుకలుకలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే నితీష్ కుమార్ కూటమిలో నుంచి జారిపోయాడు. మమత పైనుంచి కూడా తన దారి తాను చూసుకుంటానని చెబుతోంది. ఇక ఆ కమ్యూనిస్టు పార్టీ నాయకులను నమ్ముకుంటే అంతే సంగతులు. అరవింద్ కేజ్రీవాల్ కూడా సొంతంగానే పోటీ చేస్తామని అంటున్నాడు. ఇలా ప్రతిపక్ష పార్టీలను ఏకతాటి పైకి తీసుకొచ్చేందుకు కూటమి ఏర్పాటు చేస్తే.. అది ఏ మాత్రం నిలబడే సూచనలు కల్పించడం లేదు. ఇలాంటి క్రమంలో ఒక సీనియర్ నాయకుడు.. అందులోనూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు.. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉండాలి. క్యాడర్లో మానసిక స్థైర్యాన్ని పెంచాలి. కానీ మల్లికార్జున కార్గే ఇవేవీ పట్టించుకోవడం లేదు. అంతేకాదు తాను ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అనే విషయాన్ని మర్చిపోయి మోడీ భజన చేయడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం శుక్రవారం రాజ్యసభ సమావేశం జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. బడ్జెట్ కు సంబంధించి తన అభిప్రాయాలను రాజ్యసభలో చెప్పారు. ఆయన అంతవరకు ఆగిపోతే బాగానే ఉండేది. కానీ అసలు విషయం చెప్పకుండా వేరే విషయాన్ని ప్రస్తావించడంతో అది ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి బిజెపి 400 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఖర్గే చెప్పడంతో.. రాజ్యసభలో కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవ్వారు. “మీకు 330 నుంచి 334 సీట్ల మెజారిటీ ఉంది. ఈసారి అది 400 కంటే ఎక్కువే ఉంటుందని” మల్లికార్జున వ్యాఖ్యానించారు. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కసారిగా నవ్వారు. ఇక కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మల్లికార్జున వ్యాఖ్యలతో ఏకీభవించారు.

మల్లికార్జున మాట్లాడిన అనంతరం రాజ్యసభ చైర్మన్ తో పాటు, పక్కనే ఉన్న ట్రెజరీ బెంచ్ లో కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, బిజెపి ప్రజా ప్రతినిధులు తెగ చర్చించుకున్నారు. వారిలో నవ్వుకున్నారు. ఇక ఈ వీడియోను ట్విట్టర్ ఎక్స్ లో బిజెపి పోస్ట్ చేసింది. ” నన్ను ద్వేషించేందుకు కొత్త వ్యక్తులు కావాలి. పాత వారు పూర్తిగా నాకు అభిమానులు అయిపోయారు” అన్నట్టుగా రాజ్యసభలో మోడీ అంతర్గత అభిప్రాయం ఉందని బిజెపి ట్విట్టర్ ఎక్స్ లో రాసు కొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరోవైపు మల్లికార్జున చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బదులు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో మోడీ అంటే తీవ్ర విమర్శలు చేసే మల్లికార్జున.. కొంతకాలంగా సానుకూల ధోరణి ప్రదర్శిస్తున్నారు. శుక్రవారం జరిగిన రాజ్యసభలో ఏకంగా 400 సీట్లు గెలుస్తారని కితాబు ఇవ్వడం విశేషం. కాగా దీనిపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలు నిరాకరించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనే విషయాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బయటపెట్టారని బిజెపి నాయకులు అంటున్నారు.