Pragathi Bhavan : తెలంగాణ ప్రజా(ప్రగతి)భవన్ నుంచి నాలుగు కంప్యూటర్లు మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ 3వ తేదీ రాత్రి వాటిని బయటకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ నాలుగు కంప్యూటర్లలో కీలకమైన సమాచారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ కంంప్యూటర్లు ఎందుకు బయటకు తీసుకెళ్లారు.. బయటకు తీసుకెళ్లమని ఎవరు చెప్పారు. బయటకు వెళ్లినవి సొంత కంప్యూటర్లా.. ప్రభుత్వ కంప్యూటర్లా అనే విషయం తెలియాలి సుంది. ఈవిషయమై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
రాత్రి తీసుకెళ్లడం ఏంటి?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన డిసెంబర్ 3వ తేదీ రాత్రి ప్రగతి భవన్‌లో బీఆర్‌ఎస్ నాయకులు, అధికారుల హడావుడి కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఫలితాలపై స్పష్టత వచ్చింది. వెంటనే అక్కడున్న లీడర్లు కొక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. అదేరోజు సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ తన సొంత కారులో ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు. ప్రగతి భవన్‌లో పిచేసే కొద్దిమంది సిబ్బందే ఉన్నారు. బకట పోలీసుల పహారా ఉంది. అయితే అదే రోజు రాత్రి 8 గంటల తర్వాత ఓ వ్యక్తి ప్రగతి భవన్‌కు వచ్చాడు. కారులో నాలుగు కంప్యూటర్లు తీసుకుని వెళ్లిపోయాడు. రెగ్యులర్‌గా అక్కడికి వచ్చే వ్యక్తి కావడంతో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అయితే అంత రాత్రి వేళ కంప్యూటర్లను తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీసీ కెమెరాల్లో దృశ్యాలు..
నాలుగు కంప్యూటర్లు తీసుకెళ్తున్న విజువల్స్ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సదరు వ్యక్తికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎందుకు ఆ కంప్యూటర్లు తీసుకెళ్లారు? ఒక వేళ సొంత కంప్యూటర్లు అయితే ఎవరి అనుమతి తీసుకున్నారు? అనే కోణంలో భవన్ ఇన్‌చార్జిగా ఉన్న అధికారి నుంచి వివరాలు సేకరించి, తర్వాత నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, బయటకు వెళ్లిన కంప్యూటర్లు ఐటీ శాఖకు చెందినవిగా ప్రచారం జరుగుతోంది.