https://oktelugu.com/

Kaleshwaram Project : కాళేశ్వరం.. నిజంగా వారికి ATMనే.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు!

మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలాలు అంచనా వేయకుండా భారీగా ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పులు పాలు చేసినట్టుగా కాగ్ గుర్తించింది. దీన్నో ఏటీఎంలా మార్చి గుత్తేదారులకు పంచినట్టుగా కాగ్ సంచలన విషయాలను బయటపెట్టింది. 

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 25, 2024 / 08:25 PM IST

    Kaleshwaram Project

    Follow us on

    Kaleshwaram Project : గోదావరి నదిపై గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారికి నిజంగా ఏటీఎంలా మారిందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. గతేడాది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన ఆడిట్‌లో ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ ప్రాంతాల్లో బెనిఫిట్‌ కాస్ట్‌ రేషియో 1.5 ఉంటేనే సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలి. అప్పుడే లాభదాయకంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి, రుపాయిన్నర ప్రయోజనం కూడా ఉండాలి. కానీ, కేసీఆర్‌ సర్కార్‌ 2017లో రీ-ఇంజనీరింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించి కేంద్ర జల సంఘానికి సమర్పించింది. 2018, జూన్‌లో ఆమోదించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లో బెనిఫిట్‌ కాస్ట్‌ రేషియో 1.51 ఉంటుందని చూపినట్లు తెలిపింది. కానీ, 2022లో కాగ్ ఆడిట్ విశ్లేషణ వార్షిక వ్యయాలను తక్కువగా అంచనా వేయడంతో ప్రాజెక్టు నుంచి ఆశించిన వార్షిక ప్రయోజనాల విలువను ఎక్కువగా చూపించారు. దీంతో బెనిఫిట్‌ కాస్ట్‌ రేషియోనూ పెంచి చూపించినట్లు కాగ్‌ గుర్తించింది. మూలధనం, ఆపరేషన్‌, నిర్వహణ వ్యయాలు, విద్యుత్‌ వినియోగ వ్యయాలు, సివిల్‌ పనులు, పంపులు/మోటార్లు, పైపులైన్లపై తరుగుదలతోసహా వార్షిక వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే కాళేశ్వరం బీఆర్‌సీ 0.52 మాత్రమే ఉందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది.

    ప్రాణహిత చేవెళ్లతోనే ప్రయోజనం..
    2007లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి(పీసీఎస్ఎస్) పేరుతో 1.64 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. కానీ కేసీఆర్‌ సర్కార్‌ కాళేశ్వరం పేరుతో రీడిజైన్‌ చేసి 18.25 మిలియన్‌ ఎకరాల కొత్త కమాండ్ ఏరియాను సృష్టించడంతోపాటు మరో 4,70,000 ఎకరాలను స్థిరీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.85,596.58 కోట్లకు పెరిగింది. కానీ, రీడిజైన్‌తో టార్గెట్ కమాండ్‌ ఏరియా 52.22 శాతమే పెరిగింది. ప్రాజెక్టు వ్యయం మాత్రం 122 శాతం పెరిగింది. ప్రాజెక్టు పనుల పరిధిలో మరిన్ని చేర్పులు, మార్పులు జరిగాయని, ఫలితంగా ప్రాజెక్టు వ్యయం రూ.1.49 లక్షల కోట్లకు పెరుగుతుందని కాగ్ వివరించింది.

    భారీగా అప్పులు…..
    కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందని కాగ్‌ వెల్లడించింది. 2016 ఆగస్టులో కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధుల సమీకరణ కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)ను ఏర్పాటు చేసింది. 2022 మార్చి నాటికి కేఐపీసీఎల్‌ మొత్తం రూ.87,449.15 కోట్ల రుణ మొత్తానికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో 15 రుణ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందులో నిర్మాణ సమయంలో వడ్డీ మొత్తం రూ.11,220.22 కోట్లు ఉన్నాయి. ఈ రుణాలపై 7.8 శాతం నుంచి 10.9 శాతం వరకు వడ్డీ లభిస్తుందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. ఆయా రుణ ఒప్పందాల్లో పొందుపరిచిన రీపేమెంట్ షెడ్యూళ్ల ప్రకారం ఈ రుణాలను 12 ఏళ్లలో 48 త్రైమాసిక లేదా 144 నెలవారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది.

    కేఐపీసీఎల్‌ను పట్టించుకోకుండా..
    కేఐపీసీఎల్ ఏర్పాటు సందర్భంగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రుణాలు తిరిగి చెల్లించేందుకు కార్పొరేషన్‌కు అంకితభావంతో గణనీయమైన ఆదాయం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. కానీ, రుణాలు వచ్చిన తర్వాత దానిని ప్రభుత్వం పట్టించుకోలేదు. కేఐపీసీఎల్‌కు ఎలాంటి ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఈ రుణాలు, వాటిపై వడ్డీల చెల్లింపు భారం అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వంపై పడిందని కాగ్‌ వెల్లడించింది.

    వార్షిక భారం రూ.14,426 కోట్లు..
    కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా సేకరించిన రుణాలు తిరిగి చెల్లించడానికి ప్రభుత్వంపై ఏటా రూ.14,462 కోట్ల భారం పడుతుందని కాగ్‌ తెలిపింది. వీటితోపాటు లిఫ్టుల నిర్వహణకు మరో రూ.10,374 కోట్ల విద్యుత్ చార్జీలు, ఆపరేషన్, మెయింటనెన్స్ చార్జీలు రూ.272 కోట్లు అదనం అని వివరించింది.2024-25 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని, రాబోయే సంవత్సరాల్లో అప్పులు సహా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ.25,109,41 కోట్ల నిధులు అవసరమవుతాయని కాగ్‌ పేర్కొంది. ఈ భారాన్ని ప్రభుత్వం భరించాలంటే వార్షిక బడ్జెట్లలో సాగునీటి రంగానికి భారీగా కేటాయింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

    కేటాయింపులు ఎక్కువ..
    ఇక గడిచిన ఆరేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు బడ్జెట్‌ కేటాయింపులు రూ.1,382 కోట‍్ల నుంచి గరిష్టంగా రూ.5,072 కోట్ల వరకు ఉందని కాగ్‌ తెలిపింది. ఆరేళ్లలో కేటాయించిన మొత్తం రూ.27,137 కోట్లు కాగా, అందులో రూ.18,659 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు గుర్తించింది. కేటాయించిన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని కాగ్ తెలిపింది.

    మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫలాలు అంచనా వేయకుండా భారీగా ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పులు పాలు చేసినట్టుగా కాగ్ గుర్తించింది. దీన్నో ఏటీఎంలా మార్చి గుత్తేదారులకు పంచినట్టుగా కాగ్ సంచలన విషయాలను బయటపెట్టింది.