నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు… అన్నట్టుంది ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి. బ్రో సినిమాలో తన క్యారెక్టర్ ను కించపరుస్తారా? అంటూ తెగ గింజుకుంటున్నారు. ఇంతకుముందు ఏ నాయకుడిని కించపరుస్తూ సినిమాలే తీయలేదన్నట్టు తెగ బాధపడుతున్నారు. ఏకంగా సినీ ఇండస్ట్రీకే హెచ్చరికలు పంపారు. ఇప్పుడు ఏకంగా పవన్ పై ఈడికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో అంబటిని చూసి జనాలు నవ్వుకుంటున్నారు.
అంబటి ప్రెస్ మీట్ పెట్టి బ్రో కలెక్షన్ వివరాలను మీడియాకు చెప్పారు. ఆయన ఏమైనా సినిమా వాడా? సినిమాటోగ్రఫీ శాఖ అయిన వద్ద ఉందా? ఈ సినిమాకి..ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లకు.. అసలు అంబటికి సంబంధం ఏంటి? ఇప్పుడు తెలుగు ప్రజలకు ఇదే చర్చగా మారింది. అయితే చివరకు అసలు పాయింట్ చెప్పారు అంబటి. టిడిపి తో లింక్ పెట్టి పవన్ ను చులకన చేయాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఈ సినిమాకు బ్లాక్ మనీ ఖర్చు పెట్టిందన్నది వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ. అది ఎలా అంటే.. పీపుల్స్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ టిడిపి వ్యక్తి అని.. పవన్ కి ఇచ్చే ప్యాకేజీని ఆయన పారితోషకం రూపంలో అందించారని.. అందుకే అది ప్యాకేజీ సినిమా అని ఆరోపించారు. వైసీపీకి వ్యతిరేకంగా.. టిడిపి ఈ చిత్రానికి స్పాన్సర్ చేసిందని ఏవేవో పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇదే పాయింట్ను పట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అంబటి చెబుతున్నారు.
బ్రో అనేది ఒక సినిమా. ఈ సినిమా కోసం పవన్ పని చేశారు . అన్ని సినిమాలు మాదిరిగానే పారితోషికం తీసుకున్నాడు. ఈ సినిమా హిట్టా? ఫ్లాపా? ఎవరు లాభపడ్డారు? అనేది అసలు సాధారణ విషయం. దానికి ప్యాకేజీ లో కలపడం ఏమిటి? కనీసం లాజిక్ లేకుండా అంబటి రాంబాబు ప్రవర్తిస్తున్నారు. చివరకు వైసీపీ మంత్రులు, జగన్ అనుకూల మీడియా అదేపనిగా ఘోషిస్తోంది. ఒక సినిమాను పట్టుకొని తట్టుకోలేకపోతున్నారు. మరి రామ్ గోపాల్ వర్మ లాంటి వివాదాస్పద దర్శకులతో.. విపక్ష నేతలను కించపరుస్తూ తీసిన చిత్రాల మాటేమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.