CM KCR – Kejriwal : ప్రధానమంత్రి మోడీ లక్ష్యంగా రాజకీయ ప్రత్యర్థులు వ్యూహాలను పన్నుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీని గద్దినెక్కించకుండా చూడడమే లక్ష్యంగా అనేక పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పక్ష పార్టీలు ఒకవైపు తమ ప్రయత్నాలను సాగిస్తుంటే.. ప్రత్యామ్నాయ కూటమి దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న కేసీఆర్, కేజ్రీవాల్ వంటి నాయకులు తమ ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ విపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్ తో కలిసి హైదరాబాద్ వచ్చి తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ హైదరాబాద్ వచ్చి శనివారం కలిశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసేలా కేంద్రం తీసుకు వచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ ప్రతిపక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో వీరు సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఈ ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందన్న కేసీఆర్..
మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు. ఆర్డినెన్స్ తెచ్చి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆర్డినెన్స్ ను కేంద్రం ఉపసంహరించుకునేంత వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపించి అరవింద్ కేజ్రీవాల్ అద్భుత విజయం సాధించారని కేసీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజా ప్రభుత్వాన్ని లెఫ్టి నెంట్ గవర్నర్ ద్వారా కేంద్రంలోని భాజాపా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని విమర్శించారు. ఢిల్లీలో అధికారుల బదిలీ, పోస్టింగులపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టిందని కేసీఆర్ వెల్లడించారు. ప్రజలతో ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని ఆయన విమర్శించారు. ఇందిరా గాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని భాజాపా వెళుతోందని దుయ్యబట్టారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించే భాజాపా నేతలు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారని, అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని మోడీ భావిస్తున్నారని విమర్శించారు. రాజ్ భవన్ లు బీజేపీ రాష్ట్ర కార్యాలయాలుగా మారాయని, గవర్నర్ బాజాపా స్టార్ క్యాంపైనర్లుగా మారారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా బుద్ధి రాలేదని, త్వరలో దేశం మొత్తం కూడా భాజాపాకు గుణపాఠం చెబుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీలన్నీ ఏకం కావాలన్న కేజ్రీవాల్..
ఢిల్లీలో అధికారులు బదిలీ పోస్టింగులపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడానికి వ్యతిరేకిస్తూ పార్లమెంటులో గళం ఎక్కు పెట్టాలని విపక్ష నేతలను కేజ్రీవాల్ కోరుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతును ఆయన కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అధికారుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును కూడా కేంద్రం లెక్క చేయడం లేదని విమర్శించారు. ఢిల్లీ ప్రజలను మోదీ సర్కార్ తీవ్రంగా అవమానిస్తూ ఉందని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీ అరాచకాలు పెరిగిపోయాయని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఫోటోలు దిగేందుకే నీతి అయోగ్ బేటికి వెళ్లాల్సి వస్తోందన్న మాన్..
ఈ సందర్భంగా మాట్లాడిన పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్.. బిజెపి తీరుపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలో నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గవర్నర్ వ్యవస్థను మోడీ సర్కార్ పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీయేతర ప్రభుత్వాలను వేధించేందుకు గవర్నర్లను వాడుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు నీతి అయోగ్ భేటీ బహిష్కరణపైనా భగవత్ మాన్ స్పందించారు. ఫోటోలు దిగేందుకే నీతి అయోగ్ బేటీకి వెళ్లాల్సి వస్తోందన్నారు. నీతి అయోగ్ ప్రతిపాదనలను కేంద్ర సర్కార్ పాటించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను వినడం లేదని విమర్శించారు. ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల భేటీ తర్వాత బిజెపి నేతలు ఏ విధంగా స్పందిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.