CM Jagan Vs Chandrababu: రాజమండ్రిలో హై టెన్షన్ నెలకొంది. సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు ఒకేరోజు వస్తుండడమే అందుకు కారణం. దీంతో అటు అధికారులు, ఇటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా పోలీసులు హైరానా పడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జగన్, చంద్రబాబులు సోమవారం పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాత్రికి రాజమండ్రిలో బస చేయనున్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాయలసీమ జిల్లాలో పూర్తయిన సందర్శన
.. ఈరోజు గోదావరి జిల్లాలకు చేరుకోనుంది. చింతలపూడి,పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించరున్నారు. అనంతరం దేవరపల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రాత్రికి రాజమండ్రిలో బస చేయనున్నారు.
అటు సీఎం జగన్ సైతం ఉభయగోదావరి జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. వరద నష్టాలను పరిశీలించనున్నారు. పోలవరం నియోజకవర్గంలో సీఎం పర్యటన కొనసాగనుంది. వరద నష్టాన్ని పరిశీలించిన అనంతరం సీఎం రాజమండ్రి చేరుకోనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. దీంతో ఒకేసారి సీఎం విపక్ష నేత రాకతో రాజకీయ హైవోల్టేజీ నెలకొంది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనల్లో చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. ఇప్పుడు రాజమండ్రిలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.