CM Breakfast : తెలంగాణ ప్రభుత్వం సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి… తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా… మహేశ్వరం నియోజకవర్గం, రావిల్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఉదయం 8.45కి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా నియోజకవర్గానికి ఒక పాఠశాలను ఎంపిక చేసి పథకం ప్రారంభించారు.
23 లక్షల మందికి లబ్ధి..
తెలంగాణ వ్యాప్తంగా 27,147 స్కూళ్లలోని 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. ఇకపై రోజూ స్కూల్ ప్రారంభానికి 45 నిమిషాల ముందు.. అంటే ఉదయం 8.45కి బ్రేక్‌ఫాస్ట్ పెడతారు. ప్రభుత్వ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఇది అమలవుతుంది.
దసరా తర్వాతే అమలు..
సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీం ప్రస్తుతం ప్రారంభం మాత్రమే చేశారు. నియోజకవర్గానికి ఒక పాఠశాలలో శుక్రవారం ఒక్కరోజే దీనిని అమలు చేశారు. రేపటి నుంచి ఈ పథకం అమలు కాదు. దసరా సెలవులు ముగిసన తర్వాతే దీనిని అన్ని పాఠశాలల్లో అమలు చేస్తారు. ఈనెల 14 నుంచి 25 వరకు పాఠశాలలకు దసరా సెలువులు ప్రకటించింది ప్రభుత్వం ఈ నేపథ్యంలో ఈనెల 24న ప్రారంభించాలని మొదట నిర్ణయించినా.. సెలవు, దసరా పండుగ నేపథ్యంలో శుక్రవారమే ప్రారంభించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. ఈమేరకు గురువారం సాయంత్రం ఉత్తర్వులు రాగా, శుక్రవారం నియోజకవర్గానికి ఒక పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించారు.
ఎన్నికల కోసమేనా..
ఇదిలా ఉంటే.. విపక్షాలు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ఎన్నికల పథకంగా అభివర్ణించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే ఉద్దేశంతోనే హడావుడిగా పథకం ప్రారంభించారని ఆరోపిస్తున్నారు. పేదల ఓట్లు కొల్లగొట్టేందుకు సీఎం కేసీఆరో వేసిన ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. వృద్ధులను పింఛన్ల పేరుతో, రైతులను రైతుబంధు, రైతుబీమా పేరుతో తన బుట్టలో వేసుకున్నట్లు.. పేద, మధ్య తరగతి పిల్లల తల్లిదండ్రుల ఓట్ల కోసమే సీఎం బ్రేక్‌ఫాస్ట్’ను ఇంత ఫాస్ట్‌గా ప్రారంభించారని ఆరోపిస్తున్నారు.