https://oktelugu.com/

Chandrababu Arrest : చంద్రబాబు రిమాండ్ పై సిఐడి సంచలన విషయాలు

కానీ కోర్టు ఏకంగా అక్టోబర్ 5 వరకు రిమాండ్ ను పొడిగించింది. దీని వెనుక సిఐడి ఇచ్చిన రిమాండ్ రిపోర్టే కారణమని తెలుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : September 25, 2023 / 10:04 AM IST

    chandrababu arrest12

    Follow us on

    Chandrababu Arrest : స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి పట్టు బిగిస్తోంది. చంద్రబాబును సుదీర్ఘకాలం రిమాండ్ లో ఉంచాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఆయన బయటకు వస్తే కేసును తారుమారు చేసే అవకాశం ఉందని.. సాక్షులను ప్రభావితం చేస్తారని చెబుతూ రిమాండ్ లో ఉంచాలని న్యాయస్థానాన్ని కోరుతోంది. ఇప్పటికే అక్టోబర్ 5 వరకు చంద్రబాబును రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఏకంగా 15 రోజులు పాటు రిమాండ్ కోరినట్లు తెలుస్తోంది. ఇందుకోసం చంద్రబాబు రిమాండ్ పై సిఐడి మెమోలో సంచలన విషయాలు పొందుపరిచినట్లు సమాచారం.

    ప్రస్తుతం చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మరో నిందితుడు మనోజ్ వాసుదేవ్ పరారీలో ఉన్నారు. వీరి వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఇద్దరు షెల్ కంపెనీలకు మళ్లించిన సొమ్మును నగదుగా మార్చినట్లు సిఐడి చెబుతోంది. ఈ సమయంలో చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. విచారణ ప్రక్రియకు బంధం కలిగేలా చేస్తారని సిఐడి అనుమానం వ్యక్తం చేస్తోంది.అలా జరగకుండా.. విచారణ సక్రమంగా జరగాలంటే దాదాపు 15 రోజులు పాటు చంద్రబాబును రిమాండ్ విధించాలని సిఐడి తన రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

    మరోవైపు టిడిపి హయాంలో ఆర్థిక శాఖలో కీలక అధికారిగా పీవీ రమేష్ ఉండేవారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం తోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అవినీతి జరిగినట్లు సిఐడి నిర్ధారణకు వచ్చింది. రిమాండ్ రిపోర్టులో సైతం పీవీ రమేష్ వాంగ్మూలాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఇప్పుడు అదే పివి రమేష్ తాను అలా వాంగ్మూలం ఇవ్వలేదని చెబుతుండడాన్ని సిఐడి ప్రత్యేకంగా చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. పివి రమేష్ మాట మార్చడాన్ని గుర్తుచేసింది. ఒకవేళ చంద్రబాబు బయటకు వస్తే ఇదే మాదిరిగా సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సిఐడి చెప్పుకొస్తోంది. చంద్రబాబు రిమాండ్ గడువు పెరగడానికి సిఐడి రిపోర్ట్ కారణంగా తెలుస్తోంది.

    తొలుత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈనెల 22 వరకు రిమాండ్ విధించింది. తరువాత రెండు రోజులపాటు రిమాండ్ గడువు పొడిగిస్తూ సిఐడి కస్టడీకి అప్పగించింది. సిఐడి 5 రోజులపాటు కస్టడీని అడిగితే కోర్టు రెండు రోజుల పాటు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రిమాండ్ ఉండదని అంతా ఆశించారు. కానీ కోర్టు ఏకంగా అక్టోబర్ 5 వరకు రిమాండ్ ను పొడిగించింది. దీని వెనుక సిఐడి ఇచ్చిన రిమాండ్ రిపోర్టే కారణమని తెలుస్తోంది. సిఐడి తీరు చూస్తుంటే.. చంద్రబాబు ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ తరుణంలో నేడు సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. ఒకవేళ అక్కడ సానుకూల తీర్పు వస్తే చంద్రబాబుకు ఊరటే. లేకుంటే మాత్రం ఇప్పటిలాగే ప్రతికూలత కొనసాగనుంది.