Chinna Jeeyar On KCR: భద్రాద్రి రామాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్(ఇది అటకెక్కింది) రూపొందించింది ఆయనే. యాదగిరి నరసన్న కొండను యాదాద్రిగా మార్చిందీ ఆయనే. సమతా మూర్తి విగ్రహం, ఇంకా చాలా వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అంతా ఆయనే. అన్నింటిలోనూ ఆయనే.. ఒకానొక దశలో ఆయన ఏం చెబితే ముఖ్యమంత్రికి అంత. జీతాలు రాక ఇబ్బంది పడుతున్న మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వ పెద్దలను కాకుండా ఆయనను కలిసి సమస్యలు ముఖ్యమంత్రి కి చెప్పాలని వేడుకున్నారంటే.. ఆయన పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయనే చిన జీయర్ స్వామి.
తెలంగాణ ప్రభుత్వంలో అంటే 2014 నుంచి 2022 వరకు ఒక వెలుగు వెలిగారు చిన జీయర్ స్వామి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కాళ్ళ మీద పలుసార్లు పడ్డారు. అలాంటి
చిన జీయర్ స్వామికి కెసిఆర్ కు మధ్య విభేదాలు వచ్చాయి. మధ్యలో సంధానకర్తగా ఉండే మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు తో సైతం విభేదాలు పొడ చూపాయి. ఫలితంగా సమత మూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు కెసిఆర్ రాలేదు. యాదాద్రి గుడి ప్రారంభోత్సవానికి జీయర్ స్వామికి ఆహ్వానం అందలేదు. దీంతో ముచ్చింతల్, ప్రగతి భవన్ మధ్య సంబంధాలు చిక్కబడవు, బంధాలు బలపడవు అని అందరూ అనుకున్నారు. కానీ అద్భుతం జరిగింది. జూపల్లి రామేశ్వరరావు అనుకున్నది, చిన జీయర్ స్వామి కలగన్నది నిజమైంది.
ఇటీవల యాదాద్రి క్షేత్రానికి చిన జీయర్ స్వామి వెళ్లారు. ఆయన వెంట జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు. యాదగిరి నరసింహ స్వామికి ఐదు కిలోల బంగారాన్ని మై హోమ్ కంపెనీ అందజేసింది. చిన జీయర్ స్వామి రావడంతో యాదాద్రి పాలకమండలి ఆయన సేవలో తరించింది. వాస్తవానికి యాదాద్రి ప్రారంభోత్సవానికి చిన జీయర్ స్వామికి ఆహ్వానం అందలేదు. ఎందుకంటే ముచ్చింతల్ లోని సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపన సమయంలో తనని కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం పట్ల చిన జీయర్ స్వామి పై కెసిఆర్ ఆలకబూనారు. శిలాఫలకం మీద తన పేరు కింద ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా చిన జీయర్ స్వామిని దూరం పెట్టారు. ప్రభువులకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి.. చిన జీయర్ స్వామి కూడా దీన్ని గెలక లేదు.
ఎవరు సయోధ్య కుదిరించారో.. మరెవరు సంధానకర్తగా వ్యవహరించారో.. తెలియదు గాని అటు ముచ్చింతల్, ఇటు ప్రగతి భవన్ మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి. కుశల ప్రశ్నలు, బాగోగుల గురించి ఆరా మొదలైంది.. దీనికి సంకేతం గానే జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సీతారామ స్వామి ఆలయ ప్రతిష్టాపనకు చిన జీయర్ స్వామికి ఆహ్వానం అందింది.. ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈయన కెసిఆర్ ఫోల్డ్ లో అత్యంత కీలకమైన వ్యక్తి. చిన జీయర్ స్వామికి ఆహ్వానం అందడం వెనుక కేసీఆర్ లేడని అనుకోవద్దు. కెసిఆర్ కు చెప్పకుండా దయాకర్ రావు ఈ పని చేశాడని అనుకోవడానికి లేదు. పైగా ఈ వేదికను తన్నీరు హరీష్ రావు పంచుకున్నారు. చిన జీయర్ స్వామితో ఇష్టా గోష్టిగా మాట్లాడారు. ఆయన వెంట మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో పాలకులకు దైవభక్తి ఎక్కువ అని చిన జీయర్ స్వామి అనడం, అందుకే రాష్ట్రం సుభిక్షంగా ఉందని వ్యాఖ్యానించడం.. ఇక్కడ గమనించాల్సిన విషయం. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి గొడవ ఎందుకు అని కేసిఆర్ అనుకున్నాడా? ప్రభువులకు కోపం వస్తే ముచ్చింతల్ కు ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందని చిన జీయర్ స్వామి భయపడ్డాడా? కారణాలేవో తెలియదు గాని.. మొత్తానికైతే అటు కేసీఆర్, ఇటు చిన జీయర్ స్వామి మధ్య సంధీ కుదిరిన సంకేతాలు కనిపిస్తున్నాయి.