China vs India : చైనాను చూసి మనం చాలా నేర్చుకోవాలి

చైనాలో ప్రజాస్వామ్యం ఉండదు. అది కమ్యూనిస్టు దేశం. అంటే ఆ దేశంలో ప్రతీది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. అనుభవించడం మాత్రమే ప్రజల వంతు. అనుభవించి నన్నాళ్లు అనుభవించి తర్వాత ప్రభుత్వానికి ఇవ్వడం అక్కడి విధానం. అందుకే అక్కడ ఆ స్థాయిలో ఆర్థిక వృద్ధి సాధ్యమవుతోంది

Written By: Bhaskar, Updated On : July 30, 2023 9:09 am
Follow us on

China vs India : ఇలా చెబితే కొంత మందికి ఇబ్బంది కలిగించవచ్చు. ఇదేంటి ఇక్కడి తింటూ పరాయి పాటు పాడుతున్నాడు అనిపించవచ్చు. అంత సమ్మగా ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటున్నట్టు? అక్కడికే పోయి ఏ పాములో, కప్పలో తినుకుంటూ ఉండక అనే ఛీత్కారం ఎదురవొచ్చు. ఇదంతా చదువువుతుంటే ఇప్పటికే అర్థమై ఉంటుది.. దేని గురించి మేం ప్రస్తావిస్తున్నామో..

మన పొరుగున ఉన్న చైనాతో మనకు ఎప్పుడూ వైరమే. నెహ్రూ కాలంలో జరిగిన యుద్ధం నుంచి గాల్వాన్‌ లోయ ఘటన దాకా.. ప్రతీసారి అది మనల్ని ఇబ్బందిపెడుతూనే ఉంటుంది. ఎందుకంటే జనాభాలో మనం నంబర్‌ వన్‌. నాణ్యమైన మానవవనరుల్లో నంబర్‌ వన్‌. కోవిడ్‌ సమయంలో వ్యాక్సిన్‌ కనిపెట్టి ప్రపంచానికి సరఫరా చేశాం. ఇన్ని సానుకూలతలు కన్పిస్తున్నప్పుడు చైనా కళ్లల్లో నిప్పులు పోసుకోక ఏం చేస్తుంది? అయినప్పటికీ మనం ఆర్థిక రంగంలో చైనా తర్వాతే. వచ్చే రెండేళ్లల్లో ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మనం ఎదుగుతామని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు చెప్పారు. కానీ మనకంటే చైనా ఆల్‌రెడీ అన్నింట్లో తోపులాగా ఎదిగిపోతోంది. ఏకంగా అమెరికానే సవాల్‌ చేస్తోంది. ఇంతకీ చైనా ఆ స్థాయిలో ఎదగడం వెనుక కారణం ఏమై ఉంటుంది అంటే..

చైనాలో ప్రజాస్వామ్యం ఉండదు. అది కమ్యూనిస్టు దేశం. అంటే ఆ దేశంలో ప్రతీది ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది. అనుభవించడం మాత్రమే ప్రజల వంతు. అనుభవించి నన్నాళ్లు అనుభవించి తర్వాత ప్రభుత్వానికి ఇవ్వడం అక్కడి విధానం. అందుకే అక్కడ ఆ స్థాయిలో ఆర్థిక వృద్ధి సాధ్యమవుతోంది. ఫలితంగానే అది ప్రపంచంలోనే రెండో నంబర్‌ ఆర్థిక శక్తిగా నిలిచింది. మరి అంతటి చైనాలో అవినీతి, అక్రమాలు లేవా? అంటే ఉన్నాయి. కానీ అవి ఆ దేశ ఆర్థిక శక్తిని ప్రభావితం చేసేంత కాదు. పైగా అవినీతికి పాల్పడితే చైనాలో శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కానీ మన దగ్గర ఆ పరిస్థితి ఉండదు.

అవినీతి కేసులో జైలుకు వెళ్లివచ్చినవారు కూడా మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎన్నికవు తున్నారు. ఉదాహరణకు మన దగ్గర ఏదైనా అభివృద్ధి పథకం మొదలవుతోంది అంటే ముందుగా అది నాయకులకు, కార్పొరేట్లకు తెలుస్తుంది. తెల్లారేసరికి ఆ చుట్టు పక్కల భూమి వారి వశమవుతుంది. కానీ చైనాలో ఇలా ఉండదు. ఉంటే అది చైనా కాదు. స్థూలంగా చెప్పాలంటే మనకు శత్రువు అయినప్పటికీ మారాల్సిన విషయాన్ని చైనా పదే పదే నొక్కి చెబుతూనే ఉంటుంది.