https://oktelugu.com/

Chicken: ఈ టైంలో కోడికూర తినాలంటే గట్స్ ఉండాల్సిందే

మొన్నటిదాకా కార్తీక మాసంలో కోళ్లు, చికెన్ ధరలు తగ్గాయి. ఇప్పుడు కార్తీక మాసం ముగియడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. గడచిన గురువారం నుంచి చికెన్ ధరలు పెరుగుతున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 18, 2023 / 01:13 PM IST
    Follow us on

    Chicken: గతంలో అంటే ఎప్పుడో పండుగకో పబ్బానికో ఇంట్లో చికెన్ ఉండేది. ఎప్పుడో కానీ హోటల్ లోకి వెళ్లి బిర్యాని తినే అవకాశం దొరికేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కోళ్ల ఫారాలు లెక్కకు మిక్కిలి స్థాయిలో ఏర్పాటయ్యాయి. చికెన్ లభ్యత కూడా గణనీయంగా పెరిగింది.. చికెన్ తినే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. అయితే సప్లై కంటే డిమాండ్ అధికంగా ఉండడంతో ఇప్పుడు చికెన్ రేటు కొండెక్కింది.. సాధారణంగా డిసెంబర్ నెలలో చికెన్ రేటు కొంత తగ్గుముఖం పడుతుంది. కానీ ఈసారి కార్తీకమాసం ముగిసిన వెంటనే చికెన్ డిమాండ్ తారస్థాయికి చేరింది. ఫలితంగా ధర అనూహ్యంగా పెరిగింది. మొన్నటి వరకు కేజీ కూరగాయలు కొనడానికి అంటే చికెన్ కొనడమే ఉత్తమం అని అనిపించేలా ధరలు ఉండేవి. కానీ ఇప్పుడు చికెన్ ధర కూడా అమాంతం పెరిగింది.

    మొన్నటిదాకా కార్తీక మాసంలో కోళ్లు, చికెన్ ధరలు తగ్గాయి. ఇప్పుడు కార్తీక మాసం ముగియడంతో ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. గడచిన గురువారం నుంచి చికెన్ ధరలు పెరుగుతున్నాయి. కార్తీక మాసంలో కిలో చికెన్ ధర గరిష్టంగా 180 రూపాయలు ఉండేది. అయితే అది ఆదివారం ఒక్కసారిగా 240 చేరింది. ఇక మొబైల్ యాప్స్ లలో అయితే 280 కి విక్రయిస్తున్నారు. హోల్సేల్ మాత్రమే కాకుండా రిటైల్ మార్కెట్లో కూడా ధరలు భారీగానే పెరిగాయి. వారం క్రితం ఇదే మార్కెట్లో కిలో చికెన్ 150 నుంచి 150గా ఉండేది. అయితే ఆదివారం ఒక రోజే 90 రూపాయలు పెరిగి అది 240కి చేరింది. ఇక బాయిలర్ చికెన్ తో పాటు దేశీ కోడి కూడా చుక్కలు చూపిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో నాటుకోడి కిలో 450 కి చేరింది. ఇక డ్రెస్సింగ్ తో కలిపితే అది దాదాపు 500 పలుకుతోంది. హోల్ సేల్, రిటైల్ మాత్రమే కాకుండా ఆన్లైన్లో విక్రయించే చికెన్ ధర కూడా అమాంతం పెరిగింది.

    హైదరాబాద్ మహానగరంలో ఆన్లైన్ వేదికగా మాంసం విగ్రహాలు జరుగుతుంటాయి. ఇక వీకెండ్ లో అయితే ఈ విక్రయాలు తారస్థాయిలో ఉంటాయి. అయితే కార్తీక మాసంలో ఆన్లైన్ వేదికలు రకరకాల ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఈ కామర్స్ సైట్లు, ఫుడ్ డెలివరీ యాప్ లు రకరకాల ఆఫర్లతో వినియోగదారులను మురిపించాయి. ఎప్పుడైతే కార్తీక మాసం ముగిసిందో అప్పటి నుంచే వారంతా ధరలు పెంచడం మొదలుపెట్టారు. బహిరంగ మార్కెట్లో 240 కి లభించే కిలో చికెన్ ధరను మొబైల్ యాప్ లలో 280కి విక్రయిస్తున్నారు.. ఇక కార్తీకమాసంలో ఓ మాంసం విక్రయ సంస్థ ఏకంగా 50% డిస్కౌంట్ తో విక్రయాలు జరిపింది. ఇప్పుడు అదే ప్లాట్ ఫారం లో డెలివరీ చార్జీలతో కలిపి 310 కి విక్రయిస్తోంది.. కార్తీకమాసం ముగిసిన వెంటనే ఒక్కసారిగా చికెన్ ధరలు పెరిగాయి.. అయితే ప్రస్తుతం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరుగుతుండడంతో డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.. ఇక చికెన్ తో పాటు మటన్ కూడా అదే స్థాయిలో ధర పలుకుతోంది. కిలో మటన్ 800 నుంచి 1000 వరకు లభిస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా చికెన్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.. కోళ్ల ఫారాల నిర్వహణ వ్యయం భారీగా పెరగడం వల్ల చికెన్ ధరలు కూడా అనివార్యంగా పెంచాల్సి వస్తోందని వ్యాపార వర్గాలు అంటున్నాయి.. మరో ఐదు నెలల పాటు చికెన్ ధరల్లో పెద్దగా మార్పు ఉండదని ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే ధర ఎంత పెరిగినప్పటికీ తగ్గేదే లేదు అనుకుంటూ జనాలు చికెన్ కొనేస్తున్నారు. లొట్టలు వేసుకుంటూ ఆరగిస్తున్నారు.