Gujarat Vs Chennai: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గతేడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో జరిగింది. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించి ప్లే ఆఫ్ చేరిన గుజరాత్ జట్టులోని ఒక ఆటగాడు చేసిన చిన్న తప్పిదం కారణంగా మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ఒకే ఒక్క నో బాల్ వల్ల చెన్నై జట్టుకు అదనంగా 58 పరుగులు కలిసి వచ్చాయి. ఈ పరుగులే ఆ జట్టు విజయాన్ని సాధించేలా చేశాయంటే.. ఆ నోబాల్ ఎంతటి భారీ మూల్యాన్ని కారణమైందో అర్థం చేసుకోవచ్చు.
ఐపీఎల్ 16వ ఎడిషన్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మంగళవారం సాయంత్రం హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. 173 పురుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై జట్టు 15 పరుగులు తేడాతో విజయం సాధించింది. అయితే, చెన్నై జట్టు విజయం సాధించడానికి గుజరాత్ టైటాన్స్ జట్టు ఆటగాడు చేసిన చిన్నతప్పిదమే కారణం గమనార్హం గమనార్హం.
నోబాల్ ఖరీదు 58 పరుగులు.. చెన్నైను నిలబెట్టిన రుతురాజ్..
క్రికెట్లో ఒక్కోసారి అనూహ్యమైన అవకాశాలు లభిస్తుంటాయి. అటువంటి అవకాశమే తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నై జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు లభించింది. ఈ మ్యాచ్ లో రెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గైక్వాడ్ ఉండగా.. నలకండే వేసిన బంతిని మిడ్ వికెట్ దిశగా గైక్వాడ్ ఆడాడు. ఆ బంతిని అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న గిల్ క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో బలమైన ప్లేయర్ అవుట్ అయ్యాడన్న ఉద్దేశంతో గుజరాత్ ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే, అంతా షాక్ కు గురయ్యేలా ఎంపైర్ ఆ బంతిని నోబాల్ గా ప్రకటించాడు. దీంతో రుతురాజ్ నాటౌట్ గా నిలిచాడు. అవుట్ అయ్యి మళ్లీ నాటౌట్ గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత అద్భుతమైన ఆట తీరుతో జట్టు భారీ పరుగులు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఏడు ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 136.36 స్ట్రైక్ రేటుతో 44 బంతుల్లో 60 పరుగులు చేసి గట్టు భారీ స్కోర్ చేసేందుకు దోహదపడ్డాడు. అవుట్ అయిన తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గైక్వాడ్ 58 పరుగులు అదనంగా చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నై జట్టులో చేసిన అత్యధిక స్కోర్ గైక్వాడ్ దే కావడం గమనార్హం. గైక్వాడ్ కు ఈ అవకాశం రాకపోయి ఉంటే చెన్నై జట్టు స్వల్ప స్కోర్ కే పరిమితమై ఉండేదని, అదే జరిగితే గుజరాత్ సులభంగా విజయం సాధించేదని నిపుణులు పేర్కొంటున్నారు.
చిన్న తప్పిదం విజయాన్ని దూరం చేసింది..
క్రికెట్ లో చేసే చిన్న చిన్న తప్పిదాలే మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ అవుట్ విషయంలో అదే జరిగింది. ఆ బంతి నోబాల్ కాకపోయి ఉంటే గుజరాత్ అద్భుత విజయాన్ని సాధించే అవకాశం ఉండేది. గుజరాత్ జట్టు దురదృష్టం నో బాల్ రూపంలో వెంటాడింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గైక్వాడ్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నై గెలిచింది అంటే దానికి నూటికి నూరు శాతం గైక్వాడ్ ఆడిన ఇన్నింగ్స్ అని ఎవరైనా చెబుతారు. ఇటువంటి చిన్న తప్పిదాలు కూడా తీవ్ర స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తాయి అనడానికి ఈ మ్యాచ్ ను ఉదాహరణగా చెప్పవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆశలు రేకెత్తించిన విజయశంకర్, రషీద్ ఖాన్..
తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టులో రుతురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 60 పరుగులు, కాన్వే 34 బంతుల్లో 40 పరుగులు, అజంక్య రహనే పది బంతుల్లో 17 పరుగులు, రాయుడు 9 బంతుల్లో 17 పరుగులు, రవీంద్ర జడేజా 16 బంతుల్లో 22 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది చెన్నై జట్టు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ తొలి నుంచి ఇబ్బంది పడింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 11 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ కాగా, సుబ్ మన్ గిల్ 38 బంతుల్లో 42 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా ఏడు బంతుల్లో ఎనిమిది పరుగులు, దాసున్ శనక 16 బంతుల్లో 17 పరుగులు, విజయ శంకర్ పది బంతుల్లో 14 పరుగులు, రషీద్ ఖాన్ 16 బంతుల్లో ముప్పై పరుగులు చేయడంతో లక్ష్యానికి 16 పరుగుల దూరంలో ఆల్ అవుట్ అయింది గుజరాత్ జట్టు. ఒకానొక దశలో భారీ పరుగులు తేడాతో ఓటమి చెందుతుందని అంతా భావించారు. విజయ శంకర్, రషీద్ ఖాన్ ఆడుతున్న సమయంలో జట్టు విజయంపై ఆశలు రేగాయి. మంచి జోరు మీద ఉన్న విజయ శంకర్ ను మహేష్ పత్తిరన అవుట్ చేయడంతో చెన్నై జట్టు విజయం దాదాపు ఖరారు అయింది. ఆ తరువాత కూడా రషీద్ ఖాన్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహార్, మహీష్ తీక్సన, రవీంద్ర జడేజా, మతిషా పతిరానా రెండేసి చొప్పున వికెట్లు తీసి గుజరాత్ ను దెబ్బతీశారు.