YCP: వైసీపీ అభ్యర్థుల మార్పు.. జగన్, చంద్రబాబు, పవన్ లకు ఇబ్బందే!

YCP వైసీపీలోముసలం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. ఇప్పటివరకు నేతలు పార్టీని వీడుతున్నా ప్రభావం చూపడం లేదు. కానీ పండుగ ముగిసింది. చాలామంది నాయకులు గుంప గుత్తిగా ఇతర పార్టీలో చేరే అవకాశం ఉంది.

Written By: Dharma, Updated On : January 20, 2024 10:38 am

YCP

Follow us on

YCP: రాష్ట్రవ్యాప్తంగా వైసిపి పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. ఇప్పటివరకు నాలుగు జాబితాలను ప్రకటించింది. 58 చోట్ల సిట్టింగ్లను మార్చింది. కొందరికి స్థాన చలనం కల్పించింది. మరికొందరిని పక్కన పెట్టింది. దీంతో అధికార పార్టీలో అలజడి నెలకొంది. ఎక్కడికక్కడే నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవకాశం ఉన్నవారు పక్క పార్టీల్లో చేరుతున్నారు. టిక్కెట్లు కోల్పోయిన సిట్టింగులు, టికెట్లు ఆశించి రాని ఆశావహులు వైసీపీని వీడుతున్నారు. కానీ నాయకులు పెద్ద ఎత్తున వైసీపీకి గుడ్ బై చెప్తున్నా నాయకత్వం మాత్రం అదరడం లేదు.. బెదరడం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలుపు పై నమ్మకం పెట్టుకోవడంతోనే జగన్ అసంతృప్త నాయకులను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

వైసీపీలోముసలం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. ఇప్పటివరకు నేతలు పార్టీని వీడుతున్నా ప్రభావం చూపడం లేదు. కానీ పండుగ ముగిసింది. చాలామంది నాయకులు గుంప గుత్తిగా ఇతర పార్టీలో చేరే అవకాశం ఉంది. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు రక్షణ నిధి, ఎలీజా ఒకేసారి టిడిపిలోకి జంప్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా చాలామంది సిట్టింగులు పార్టీని వీడుతారని.. చంద్రబాబు, పవన్ ల నుంచి అభయం వస్తే పార్టీని వీడటం ఖాయమని టాక్ నడుస్తోంది. అయితే అదే జరిగితే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వైసీపీని వీడనున్నారు. జగన్ కు షాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.

అయితే తాజా పరిణామాలు ఇటు వైసీపీకి ఎంత ఇబ్బందికరమో.. టిడిపి, జనసేనలకు సైతం అదే పరిస్థితి. పార్టీ గ్రాఫ్ బాగున్నా.. ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదంటూ జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. అయితే మన ఇంట్లో చెత్తను పక్క ఇంట్లో వేస్తే బంగారం అవుతుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొన్నటి వరకు తనను చూసి ప్రజలు ఓటు వేస్తారని జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ నెపాన్ని ఎమ్మెల్యేలపై తోస్తున్నారు. అభ్యర్థులను మార్చినంత మాత్రాన వ్యతిరేకత తగ్గించుకోగలరా? అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. కానీ అభ్యర్థులను మార్చి గెలుపు బాటను అందుకోవాలని జగన్ భావిస్తున్నారు.

మరోవైపు తెలుగుదేశం, జనసేన లది క్లిష్ట పరిస్థితి. ఇంతవరకు సీట్ల సర్దుబాటు కుదుర్చుకోలేని స్థితిలో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. బిజెపి కోసం ఎదురుచూస్తున్నాయి. రెండు పార్టీలకు అభ్యర్థులు ఉన్నారు. వైసీపీలో సీట్లు నిరాకరించడంతో చాలామంది నేతలు ఈ రెండు పార్టీల్లో చేరుతున్నారు. అయితే వారందరికీ టిడిపి, జనసేనలో టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఇచ్చినా.. గత ఐదు సంవత్సరాలుగా పనిచేసిన నేతల పరిస్థితి ఏమిటి? వారికి ఎలా సర్దుబాటు చేస్తారు? ఏం హామీ ఇస్తారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే వైసీపీలో అభ్యర్థుల మార్పు ఒక్క జగన్ కి ఇబ్బంది కాదు. చంద్రబాబు, పవన్ లపై సైతం ఒత్తిడి పెంచే వ్యూహం అది.