Cashless Treatment: మీకు హెల్త్ కార్డు ఉందా.. హెల్త్ పాలసీ ఉందా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అందరికీ అవసరమైంది. కష్టకాలంలో నగదు రహిత చికిత్స అందించడానికి హెల్త్ స్కీం చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇది నిన్నటి వరకు బీమా సంస్థ గుర్తించిన ఆస్పత్రుల్లోనే అమలయ్యేది. నెట్‌వర్క్ ఆస్పత్రులు లేకుంటే ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇక నుంచి ఈ పరిస్థితి ఉండదు. హెల్త్ పాలసీ ఉన్నవారికి అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ చికిత్స అందించాలని కేంద్రం నిర్ణయించింది.
జీఎస్‌ఐ ఉత్తర్వులు..
అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కోసం ఈమేరకు జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఇది అమలులోకి వస్తుందని ప్రకటించింది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలతో సంప్రదించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. గతంలో నెట్‌వర్క్ ఆస్పత్రుల్లోనే కాకుండా అన్ని ఆస్పత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్ అందించేందుకు ఎవ్రీవేర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. దీంతో ఆరోగ్య బీమా ఉన్న ప్రతీ పాలసీదారుడు నెట్‌వర్క్ ఆస‍్పత్రులతోపాటు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇకపై నగదు రహిత చికిత్స పొందవచ్చు. ఈ రూల్ జనవరి 24 నుంచే ప్రారంభించినట్లు జీఎస్‌ఐ స్పష్టం చేసింది.
ప్రస్తుతం రెండు రకాలుగా క్లెయిమ్..
సాధారణంగా ఇప్పటి వరకు ఆరోగ్య బీమా పాలసీదారులు రెండు రకాలుగా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. మొదటిది ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవడం. దీంతో పాలసీదారుకు ఎలాంటి ఖర్చు ఉండదు. ఇన్సూరెన్స్ సంస్థనే చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తుంది. ఇక రెండోది ఏ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా పాలసీదారు ముందుగా డబ్బులు చెల్లించి.. తర్వాత ఖర్చులను రీయింబర్స్‌మెంట్‌గా బీమా సంస్థ నుంచి పొందాల్సి ఉంటుంది. నాన్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో చేరితే కచ్చితంగా డబ్బులు ముందే కట్టాలి. మరోవైపు చికిత్సకు అయిన ఖర్చును తిరిగి రీయింబర్స్ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది. పూర్తిగా డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉండదు.
ఎవ్రీవేర్ క్యాష్‌లెస్..
ఇప్పుడు కొత్తగా తీసుకువచ్చిన క్యాష్‌లెస్ ఎవ్రీవేర్‌లో భాగంగా పాలసీదారుడు ఏ ఆస‍్పత్రిలో అయినా డబ్బులు కట్టకుండానే చికిత్స పొందవచ్చు. చికిత్స పొందే ఆస్పత్రి బీమా సంస్థ నెట్‌వర్క్ జాబితాలో లేకపోయినా ఇబ్బంది ఉండదు. ముందుగా డబ్బులు చెల్లించే అవరసం లేదు. రీయింబర్స్‌మెంట్ తిప్పలు ఉండవు. పూర్తిగా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటే.. ఇన్సూరెన్స్ సంస్థలే ఆస్పత్రికి నగదు చెల్లిస్తాయి.
కండీషన్స్ ఇవీ..
ఎమర్జెన్సీగా ఆస్పత్రిలో చేరితే.. చేరిన 48 గంటల్లో బీమా సంస్థకు సమాచారం ఇవ్వాలి. మిగతా చికిత్స కోసమైతే (షెడ్యూల్ చేసిన ఆపరేషన్స్/సర్జరీ) ఆస్పత్రిలో చేరే 48 గంటల ముందే బీమా సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ క్లెయిమ్ పాలసీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు వాటి మార్గదర్శకాల మేరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ వర్తిస్తుంది.