Chandrayaan-3 – Adipurush : చంద్రయాన్-3 ఖర్చు ఆదిపురుష్ బడ్జెట్ కంటే తక్కువా? షాకింగ్ డిటైల్స్!

చంద్రయాన్ ప్రయోగం నాసా చేస్తే వేల కోట్ల ఖర్చు అవుతుంది. అయితే చంద్రుణ్ణి నాలుగు రోజుల్లో చేరుకుంటారు. ఇస్రోకి మాత్రం 40 రోజుల వరకు పడుతుంది.

Written By: NARESH, Updated On : July 14, 2023 10:20 pm
Follow us on

Chandrayaan-3 – Adipurush : ఇప్పటి వరకు ఇండియాలో తెరకెక్కిన చిత్రాల్లో ఆదిపురుష్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. నిజానికి ఆదిపురుష్ బడ్జెట్ రూ. 400 నుండి 500 కోట్లు అనుకున్నారు. ఆదిపురుష్ టీజర్ తీవ్ర విమర్శలపాలు కావడంతో, 2023 జనవరికి విడుదల కావాల్సిన చిత్రాన్ని ఆరు నెలలు వాయిదా వేశారు. రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ పెంచి మెరుగులు దిద్దారు. ఓ అంచనా ప్రకారం ఆదిపురుష్ నిర్మాణం, ఇతర ఖర్చులు కలుపుకుంటే రూ. 650 కోట్లకు పైమాటే. ఆర్ ఆర్ ఆర్ బడ్జెట్ రూ. 450 నుండి 500 కోట్లు ఉంటుంది. కాబట్టి ఆదిపురుష్ అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఇండియన్ మూవీ అని చెప్పొచ్చు.

నేడు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం బడ్జెట్ కేవలం రూ. 615 కోట్లు. అంటే ఆదిపురుష్ మూవీ బడ్జెట్ కంటే తక్కువ. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో ఇస్రో అంతరిక్ష ప్రయోగాలు చేస్తుంది. అమెరికా, చైనా, రష్యాతో పాటు పలు దేశాలు వేల కోట్లు ఖర్చు చేస్తుంటే ఇండియా మాత్రం వందల కోట్లతో అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతాలు చేస్తుంది. చాలా దేశాలు తమ శాటిలైట్, స్పేస్ క్రాఫ్ట్స్ ని అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రోకి డబ్బులు చెల్లించి సేవలు అందుకుంటున్నాయి.

ఇదే చంద్రయాన్ ప్రయోగం నాసా చేస్తే వేల కోట్ల ఖర్చు అవుతుంది. అయితే చంద్రుణ్ణి నాలుగు రోజుల్లో చేరుకుంటారు. ఇస్రోకి మాత్రం 40 రోజుల వరకు పడుతుంది. నాసా స్పేస్ క్రాఫ్ట్ నేరుగా చంద్రుణ్ణి చేరుకుంటుంది. అందుకు అధిక మొత్తంలో ఇంధనం ఖర్చు అవుతుంది. ఇస్రో మాత్రం గురుత్వాకర్షణ ఉపయోగించుకుని తక్కువ ఇంధనంతో ఎక్కువ సమయం తీసుకుని లక్ష్యం చేరుకుంటారు.

చంద్రయాన్ మొదట భూ కక్ష్యలో తిరుగుతుంది. దీన్ని జియో సెంట్రిక్ ఫేజ్ అంటారు. అనంతరం చంద్రుడు వైపు ప్రయాణం చేసి చంద్రుడు కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. దీన్ని లూనార్ ఆర్బిట్ ఇన్సెర్షన్ అంటారు. అనంతరం వాతావరణ పరిస్థితుల ఆధారంగా చంద్రయాన్ రోవర్ ని చంద్రుని మీద ల్యాండ్ చేస్తారు. ఈ కారణంగా ఇస్రో ఇతర దేశాలకంటే తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తుంది.

చంద్రయాన్-3 ఖర్చు ఆదిపురుష్ బడ్జెట్ ఎక్కువ అంటూ సోషల్ మీడియాలోనూ ట్రోల్స్, మీమ్స్ హోరెత్తుతున్నాయి.