https://oktelugu.com/

Chandrababu Bail : చంద్రబాబుకు దోమలతో ప్రాణహాని.. బెయిల్ కోసం ఇదో కహాని

నేడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ జరగనుంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేవనెత్తిన చంద్రబాబు హత్య కుట్ర మాత్రం కాస్త ఆశ్చర్యంగా ఉంది.

Written By:
  • Dharma
  • , Updated On : September 19, 2023 10:58 am
    chandrababu

    chandrababu

    Follow us on

    Chandrababu Bail : నేల విడిచి సాము చేస్తున్నట్టుంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల దుస్థితి. చంద్రబాబు అరెస్టు విషయంలో అతి తెలివిని ప్రదర్శించి చేజేతులా మూల్యం చెల్లించుకుంటున్నారు. రోజుల తరబడి చంద్రబాబును రిమాండ్ లో కొనసాగడానికి టిడిపి వ్యూహమే కారణం. అసలు చంద్రబాబు అరెస్ట్ అవుతారని ఎవరైనా ఊహించారా? రిమాండ్ విధిస్తారని భావించారా? గంటల వ్యవధిలోనే బెయిల్ లభిస్తుందని బల్ల గుద్ది చెప్పారు. కానీ అందరూ ఊహలు తలకిందులయ్యాయి. కానీ ఇప్పుడు బెయిల్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కుంటి సాకులు చెబుతున్నారు. దోమలతో చంద్రబాబుకు ప్రాణ హాని ఉంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఈ కేసును వాదించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూధ్ర ను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారు. భారీగా ఖర్చు చేశారు. కానీ బెయిల్ తెప్పించుకోలేకపోయారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన వెంటనే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి ఉంటే చంద్రబాబు ఈపాటికే బయటకు వచ్చి ఉండేవారు. అదే జరిగితే చంద్రబాబు స్టే తెచ్చుకొని అవినీతి కేసులను తప్పించుకుంటున్నారని వైసిపి ప్రచారం చేస్తుందని భావించారు. అందుకే క్వాష్ పిటిషన్ వేశారు. అయితే వారి అంచనాలన్నీ తారు మారయ్యాయి. క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. అటు తరువాత గత కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటిపై బెయిల్ పిటిషన్లు వేయాల్సి వచ్చింది. ఈ వరుసగా తురుముకొచ్చిన కేసులతో ఉక్కిరిబిక్కిరి కావాల్సి వచ్చింది.

    నేడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ జరగనుంది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేవనెత్తిన చంద్రబాబు హత్య కుట్ర మాత్రం కాస్త ఆశ్చర్యంగా ఉంది. చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు టిడిపి నాయకులు జైల్లో ములాఖత్ అవుతూ వచ్చారు. అయితే చంద్రబాబుకు జైల్లో వసతులు బాగాలేదని.. బ్యారెక్ చుట్టూ దోమలకు ఆవాసంగా ఉందని.. విపరీతంగా చంద్రబాబును దోమలు కుడుతున్నాయని.. ఆయనకు ప్రాణహాని ఉందని టిడిపి నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీటిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అయితే బెయిల్ కోసమే టిడిపి నాయకులు ఈ కొత్త వాదనను తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. సులువుగా రావలసిన బెయిల్ ను టిడిపి నాయకులు చేజేతులా జఠిలం చేసుకున్నారని.. ఇప్పుడు దోమలపై నెపం పెడుతున్నారని రాజకీయ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు.

    అయితే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. పక్కా ప్లాన్ తోనే చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేసుకున్నారని టాక్ నడుస్తోంది. చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో ఒక రకమైన సానుభూతి ఏర్పడిందని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన వెంటనే బెయిల్ కోసం అప్లై చేసుకుని ఉంటే.. అవినీతి కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకొని పబ్బం గడుపుతున్నారని అధికార పార్టీ ఆరోపించే అవకాశం ఉంది. అందుకే ఏకంగా క్వాష్ పిటిషన్ వేసి పూర్తిగా కేసులనే కొట్టి వేయించాలన్న వ్యూహంలో తెలుగుదేశం పార్టీ ఉందన్న అనుమానాలు ఉన్నాయి. వీటంతటికి నేటి కేసు విచారణతో క్లారిటీ రానుంది. క్వాష్ పిటిషన్ తో చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి.