Chandrababu to CID office : చంద్రబాబు రాజకీయ దూకుడు పెంచారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. ‘రా కదలిరా’ బహిరంగ సభలకు హాజరవుతున్నారు. జగన్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నెలాఖరు వరకు రా కదలిరా సభలు కొనసాగున్నాయి. చంద్రబాబు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటువంటి తరుణంలో ఆయన సిఐడి కార్యాలయానికి హాజరుకావాలని కోర్టు ఆదేశించడం విశేషం. ఈరోజు ఆయన సిఐడి కార్యాలయానికి వెళ్ళనున్నారు.
అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆయన 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అటు తరువాత ఆయనపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసులను సైతం ఏపీ సిఐడి నమోదు చేసింది. అయితే ముందుగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. తాజాగా ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇందుకు సంబంధించి లక్ష రూపాయల పూచికత్తు విధించింది. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ సిఐడి కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈరోజు చంద్రబాబు హైదరాబాదు నుంచి విజయవాడ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:25 గంటలకు ఉండవల్లి లోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:15 గంటలకు గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళనున్నారు. సాయంత్రం 4:20 గంటలకు తిరిగి తాడేపల్లి కి చేరుకుంటారు. 5:05 గంటలకు తాడిగడపలోని సిఐడి కార్యాలయానికి వెళ్లి పూచీకత్తు, బాండ్ సమర్పించనున్నారు.