Chandrababu : మాజీ సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. సకాలంలో సెక్యూరిటీ సిబ్బంది స్పందించడంతో చంద్రబాబు సురక్షితంగా బయటపడ్డారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా రాజమండ్రి సమీపంలోని కాతేరులో సోమవారం సభను ఏర్పాటు చేశారు. వేదికపై తోపులాట జరగడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
టిడిపి, జనసేన మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు జరగలేదు. మొన్న ఆ మధ్యన మండపేట తో పాటు అరకులో జరిగిన రా కదలిరా సభలో చంద్రబాబు టిడిపి అభ్యర్థుల విషయంలో ప్రకటన చేశారు. దీనిపై పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని ఆక్షేపించారు. రాజానగరం, రాజోలుకు అభ్యర్థులు ప్రకటించారు. దీనిని తెలుగుదేశం నేతలు ఆహ్వానించారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల టిడిపి నేతలు కార్యాలయానికి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడిని నిలదీశారు. ఈ క్రమంలో రాజమండ్రిలో జరిగిన సభలో ఆ రెండు నియోజకవర్గాల టిడిపి శ్రేణులు గలాటా సృష్టించారు. చంద్రబాబు హాజరయ్యే సమయంలో ఒక్కసారిగా రాజానగరం టిడిపి శ్రేణులు వేదికపై వచ్చి నినాదాలు చేశారు. అదే సమయంలో టిడిపి నేతలు బొకేలతో చంద్రబాబుకు ఆహ్వానం పలికారు. దీంతో ఒక్కసారిగా గలాటా చోటు చేసుకుంది. చంద్రబాబు పక్కకు ఒరిగిపోయి పడిపోతుండగా సెక్యూరిటీ సిబ్బంది రక్షణగా నిలిచారు. దీంతో చంద్రబాబు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
కాగా ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టిడిపి నాయకుల తీరుపై మండిపడ్డారు. ఇటువంటి వాటికి సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో పొత్తులపై సహృద్భావ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టిడిపి శ్రేణులు ఇలా వ్యవహరించడం తగదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాజానగరం తో పాటు రాజోలు టిడిపి నాయకులతో రాష్ట్ర నాయకత్వం మాట్లాడినట్టు తెలుస్తోంది. ఎన్నికలవేళ అధికార పక్షానికి అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి టిడిపి నాయకుడి పై ఉందని హై కమాండ్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీ విధానాలపై, నిర్ణయాలపై బాహటంగా ఎవరూ మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాజమండ్రి సభలో అపశృతిపై రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆందోళన పడ్డాయి. కానీ చంద్రబాబుకు ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నాయి.