Homeజాతీయ వార్తలుChandra Babu: చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర: ఎప్పుడు ఎవరిని ఎలా రాజకీయంగా వెన్నుపోటు పొడిచారో తెలుసా?

Chandra Babu: చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర: ఎప్పుడు ఎవరిని ఎలా రాజకీయంగా వెన్నుపోటు పొడిచారో తెలుసా?

Chandra Babu: వెన్నుపోటు.. ఇటీవల పదేపదే వినిపిస్తున్న పదం ఇదీ.. వెన్నుపోటు అంటే నమ్మించి మోసం చేయడం, అవసరం తీరాక దూరం పెట్టడడం అనే సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. రాజకీయ పరమైన అంశాలతో ఈ పదానికి భారీ ప్రాచూర్యం దక్కింది. తెలుగు రాజకీయాల్లో ఈ పదానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఉంది. వెన్నుపోటు అనే పదం ప్రస్తావనకు వస్తే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు మొదటి వరసలో వినిపిస్తుంది. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబేనంటారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. ఇందుకు అనేక సంఘటనలను వారు ప్రస్తావిస్తుంటారు. కానీ చంద్రబాబే ఆ మాటను సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి అనడమే ఆసక్తికర పరిణామం. ఈ ఘటన చంద్రబాబుకు, వెన్నుపోటు అనే పదానికి ఉన్న అనుబంధంపై మరోసారి చర్చకు దారితీసింది. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని అందరూ గుర్తు చేసుకునేలా చేసింది.

Chandra Babu
Chandra Babu

మామతో మొదలు..

ఎన్టీఆర్, చంద్రబాబు.. మామ అల్లుళ్ల సంబంధం. తన కుమార్తెను చంద్రబాబుకు కానుకగా ఇచ్చి ఎన్టీఆర్‌ పెళ్లి చేస్తే.. చంద్రబాబు తన మామకు వెన్నుపోటును రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. అందుకే బాబుని ఎన్టీఆర్‌ దశమ గ్రహంగానూ, ఔరంగజేబుగానూ పోల్చారు. అనుక్షణం చంద్రబాబు అండ్‌ కో పెట్టిన మానసిక క్షోభతోనే ఎన్టీఆర్‌ కన్నుమూశారన్నది ఎవరైనా చరిత్ర తెలిసిన వారు చెప్పే విషయం. ఇంత చేసిన తర్వాత కూడా అదే ఎన్టీఆర్‌ను తమ సొంత ప్రాపర్టీగా ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన నారా చంద్రబాబు మంత్రి కూడా అయ్యారు. టీడీపీ స్థాపించన సమయంలో ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానన్నారు. 1983లో ఓడిపోయారు. కట్‌ చేస్తే.. మామ పంచన చేశారు. పదవి వద్దు.. మీకు సహాయంగా ఉంటానన్నారు. నమ్మకంగా ఉంటూ 1995లో టీడీపీ, సీఎం కుర్చినీ ఎన్టీఆర్‌ నుంచి లాక్కున్నారు. ఇది తన ఒక్కడి వల్లే సాధ్యం కాదని భావించి.. ఎన్టీఆర్‌ కుమారులు, తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును తన వైపు తిప్పుకున్నారు. ఎమ్మెల్యేలంతా చంద్రబాబు నాయుడి మాయలో పడ్డారని భావించిన ఎన్టీఆర్‌ పార్టీ ఎమ్మెల్యేలను ఒప్పించడానికి వైస్రాయ్‌ హోటల్‌కు వెళ్తే చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి దాడి చేశారు.

– దగ్గుబాటికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఆశ చూపారు. అనుకున్నట్లే సీఎం పీఠంపై చంద్రబాబు కూర్చున్నారు. కట్‌ చేస్తే.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మొండిచేయి చూపారు. మామతోపాటు తోడళ్లుడికి ఒకేసారి వెన్నుపోటు పొడిచారు. వెంకటేశ్వరరావు టీడీపీని వీడే పరిస్థితి కల్పించారు.

Chandra Babu
Daggubati Venkateshwarao

– ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి పోటీ వచ్చే వారెవరంటే హరికృష్ణ కనిపించారు. మంత్రిపదవి ఇచ్చినా అది తాత్కాలికమే కావడంతో.. బావ అసలు రూపం తెలిసి బాధపడడం హరికృష్ణ వంతైంది. సొంతంగా అన్న టీడీపీ పార్టీ పెట్టుకునే పరిస్థితి హరికృష్ణకు తలెత్తింది. అవసరం కోసం మళ్లీ హరికృష్ణను దగ్గరకు చేర్చుకున్నా.. పార్టీలో ప్రాధాన్యత కరువైంది. మహానాడు వేదికలపైనే హరికృష్ణ అసంతృప్తి బయటపడింది.

తర్వాతి తరంపై కూడా..

తన తరంతోపాటు మలితరానికి కూడా బాబు తన వాడకం ఎలా ఉంటుందో రుచిచూపించారు. హరికృష్ణ కుమారుడు, సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌దీ తన తండ్రి పరిస్థితే. 2009 ఎన్నికల్లో మామ పిలిచాడని, తాత గెటప్‌లో వచ్చి టీడీపీ విజయం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంతా పర్యటించారు. రోడ్డు ప్రమాదానికీ గురయ్యారు. అయినా ఎన్నికల తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు చంద్రబాబు. తన కుమారుడు లోకేష్‌ భవిష్యత్‌ కోసం జూనియర్‌ను పక్కనపెట్టేశారు.

– 2014లో పవన్ కల్యాణ్‌ మద్ధతు కోరారు తప్ప.. జూనియర్‌ ఎన్టీఆర్‌ వైపు చూడకపోవడానికి కారణం లోకేష్‌ రాజకీయ భవిష్యత్‌ కోసమేనన్నది జగమెరిగిన సత్యం. బాబాయ్‌ బాలయ్యకు, అబ్బాయ్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌కు మధ్య వివాదాలు కూడా బాబుగారి చలవేనని ఆ పార్టీ అభిమానులు చెబుతుంటారు.

బయటవారు కూడా..

బాబు వెన్నుపోటు బాధితులో బంధువులే కాదు.. బయట వారు కూడా ఉన్నారు. 1995లో ఎన్టీఆర్‌ నుంచి పార్టీని, సీఎం పదవిని చేజిక్కించుకునే ఘటన అంతా హైదరాబాద్‌లోని వైశ్రాయ్‌ హోటల్‌లోనే జరిగింది. వైశ్రాయ్‌ హోటల్‌ యజమాని ప్రభాకర్‌రెడ్డిది కాగా.. ఆయన బావ మరిది, టీడీపీ ఒకప్పటి నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాల్‌రెడ్డి ఈ ఘటనలో కీలక పాత్ర. బొజ్జల గోపాల్‌రెడ్డి అనారోగ్యం పాలవగా.. దాన్ని సాకుగా చూపి ఆయన్ను గత ప్రభుత్వ హాయంలో మంత్రి పదవి నుంచి తప్పించారు చంద్రబాబు. ఆయన స్థానంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవి కట్టబెట్టారు. బాబు వెన్నుపోటును తలుచుకుని బాధపడడం బొజ్జల వంతు కాగా.. ఆయన తీరును ఎండగట్టడం బొజ్జల గోపాల్‌రెడ్డి సతీమణి వంతైంది.

– ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో కొందరు టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం ఎన్టీఆర్‌తోనే ఉండిపోయారు. వారు చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేదు. అయితే ఎన్టీఆర్‌ మరణానంతరం మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా అందులో కొందరు తిరిగి టీడీపీలో చేరారు. పార్టీ ఆవిర్బావం నుంచి ఉన్న ఆ నాయకులను చంద్రబాబు తీవ్రంగా అవమానించారు. తనకంటే సీనియర్లు అయిన ఎన్టీఆర్‌ వర్గీయులైన దాడి వీరభద్రరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గాలి ముద్దు కృష్ణమనాయుడు వంటి నేతలకు తన ప్రభుత్వంలో ఎన్నడూ మంత్రి పదవులు ఇవ్వలేదు చంద్రబాబు.

– ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు విషయంలోనూ ఇదే తీరు. తాను తీసుకురాకపోవడం ఒక ఎత్తయితే అటల్‌ బిహారీ వాజ్‌ పేయ్‌ ప్రధానిగా ఉండగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడానికి కేంద్రం అంతా సిద్దం చేస్తూ ఉండగా చివరి నిమిషంలో ఆ అవార్డు ఎన్టీఆర్‌కు రాకుండా ఆగిపోయింది. అది ఎవరి కుట్ర వల్ల జరిగిందా అని ఆరా తీస్తే చంద్రబాబు నాయుడే ఆ అవార్డు ఎన్టీఆర్‌కు ఇవ్వద్దని వాజ్‌ పేయ్‌పై ఒత్తిడి తెచ్చారని తేలింది.

బ్రాండ్‌ తొలగించుకోవాలని..

ఇలా చెప్పుకుంటూ పోతే.. చంద్రబాబు రాజకీయ జీవితంలో అనేక మంది కనిపిస్తారు. ఇలాంటి చరిత్ర పెట్టుకున్న చంద్రబాబు.. ఇతరులను ఉద్దేశించి వెన్నుపోటు వ్యాఖ్యలు చేయడం చూసేవారికి విడ్డూరంగా తోస్తోంది. బట్టకాల్సి మొహాన వేసే రాజకీయాలు చేసే చంద్రబాబు.. తనపై ఉన్న వెన్నుపోటు ముద్రను కాస్తంతైనా తగ్గించుకునే క్రమంలోనే ఇతరులను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవాలి. అవున్నా.. కాదన్నా.. వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరంటే చంద్రబాబేనని తెలుగు రాజకీయాలను గమనించే వారెవరైనా ఘంటాపథంగా చెబుతారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version