https://oktelugu.com/

Chandrababu Bail : బ్రేకింగ్ : చంద్రబాబుకు ఫుల్ బెయిల్.. ఈ కారణాలు పేర్కొన్న హైకోర్టు

ఈనెల 30న ఏసీబీ కోర్టు ముందుకు చంద్రబాబు హాజరు కావాలని.. చికిత్స కు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2023 / 03:28 PM IST
    Follow us on

    Chandrababu Bail : స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ లభించింది. రెగ్యులర్ బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఈనెల 28 వరకు గడువు ఉన్న సంగతి విధితమే. ఇంతలో రెగ్యులర్ బెయిల్ లభించడం ఉపశమనం కలిగించే విషయం. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకొని న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే స్కిల్ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ సస్పెండ్ చేయాలని, ఎఫ్ ఐ ఆర్ ను క్వాష్ చేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు సైతం పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. దీపావళి సెలవుల అనంతరం తీర్పు ప్రకటిస్తామని ధర్మాసనం పేర్కొంది. దీనిపై రేపో మాపో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందే ఏపీ హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడం విశేషం.

    స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 10న అరెస్టు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆయనకు రిమాండ్ విధించింది. అప్పటినుంచి 53 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 28 వరకు ఈ బెయిల్ కు గడువుంది. అటు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17న దానిపై వాదనలు పూర్తయ్యాయి.కానీ న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది.

    చంద్రబాబు అనారోగ్య పరిస్థితులను పరిగణలో తీసుకొని న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఇప్పటికీ ఆయనకు కంటి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఐదు వారాలపాటు వైద్య పర్యవేక్షణ అవసరమని, మరోవైపు చంద్రబాబు గుండె సమస్యలతో బాధపడుతున్నారని.. ఆయన గుండె పరిమాణం హెచ్చుతగ్గులు ఉండడం.. అందుకు అనుగుణంగా మెడికల్ రిపోర్ట్ ను న్యాయస్థానానికి నివేదించడం.. చంద్రబాబు తరుపు న్యాయవాదుల అభిప్రాయంతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పారు. ఈనెల 28న చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అటు మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈనెల 28 వరకే వర్తిస్తాయని.. 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొన వచ్చునని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈనెల 30న ఏసీబీ కోర్టు ముందుకు చంద్రబాబు హాజరు కావాలని.. చికిత్స కు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు.