AP CM Jagan : రాజకీయాన్ని ఎలా మలుచుకోవాలో ఏపీ సీఎం జగన్కు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ప్రజలకు ధనాన్ని పంచి అదే పాలనగా చూపిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని, వ్యవస్థలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ప్రశ్నిస్తే పోలీసులతో ఉక్కు పాదం మోపుతున్నారు. విపక్షాల గొంతును నొక్కుతున్నారు. అయితే జగన్ ఆదర్శం ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతోంది. చివరకు కేంద్ర ప్రభుత్వం సైతం అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ లెక్కన జగన్ దేశానికి ఆదర్శంగా నిలుస్తారు అనడంలో అతిశయోక్తి కాదు.
అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీరు వ్యవస్థను ప్రారంభించారు. ప్రతి 50 కుటుంబాల బాధ్యతను వారికి అప్పగించారు. పాలనతో పాటు సంక్షేమ పథకాల అమలులో సైతం వారికి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. అయితే వలంటీర్లు అంత వైసీపీ మనుషులే. జీతం ఇచ్చేది ప్రభుత్వం. ప్రజలకు సేవలు అందించడం ద్వారా వారు వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. పార్టీకి అండగా నిలబడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం వలంటీర్ల ఫార్ములా సక్సెస్ అయ్యింది. దానిని ఆదర్శంగా తీసుకుని గృహసారథులను తెరపైకి తెచ్చారు. ప్రతి నిర్ణయంలోనూ రాజకీయ ప్రయోజనాలు ఆశించే తీసుకున్నారు.
ఆ మధ్యన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటి బాట పట్టారు. అధికారులు, యంత్రాంగాన్ని తీసుకెళ్లి రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ ప్రభుత్వం నీ గురించి ఎంతగానో చేసిందని అధికారులతో చెప్పించుకున్నారు. మరోసారి మా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అధికారుల సమక్షంలోనే చెప్పగలిగారు. అంటే నేతలు, అధికారులు వేరు కాదు. అంతా మా పార్టీయేననిప్రజల్లో భావన వచ్చేలా వ్యవహరించారు. అందుకే సీఎం జగన్ వై నాట్ 175 అన్న నినాదాన్ని నిగ్గ దీసుకుని చెప్పగలుగుతున్నారు.
అయితే జగన్ కు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తున్న కేంద్ర పెద్దలు.. ఆయన చర్యలను సైతం ఆదర్శంగా తీసుకుంటున్నారు. గత తొమ్మిది సంవత్సరాల మోడీ పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రభుత్వ ఉద్యోగులతో ప్రచారం చేయించుకోవడానికి సిద్ధపడుతున్నారు. నవంబర్ 20 నుంచి జనవరి 25 వరకు ప్రచారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో కూడిన కమిటీలను నియమిస్తోంది. దేశవ్యాప్తంగా 765 జిల్లాల్లో ప్రత్యేక అధికారుల నియామకం చేపట్టాలని అన్ని మంత్రిత్వ శాఖలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే రక్షణ శాఖ ను కూడా ఈ కమిటీల్లో చేర్చడం విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వ అధికారులను, వ్యవస్థలను రాజకీయ అవసరాలకు వాడుకోవడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఏపీలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాలతో పాటు వ్యవస్థలను ఎలా వాడుకోవాలో దేశానికి దిశా నిర్దేశం చేసింది. ఇప్పుడు దానిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అధికారులను అడ్డం పెట్టుకునే మరోసారి అధికారంలోకి రావాలని తపన పడుతోంది. అయితే జిల్లాలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు అంటూ ఉండరు. అక్కడ పని చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని వివిధ శాఖల అధికారులే. ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులు, ఉద్యోగులతో తమ పార్టీ విధానాలను ప్రచారం చేసుకోవడానికి పూనుకుంటున్నాయన్నమాట. నిజంగా ప్రభుత్వాలు మేలు చేసి ఉంటే ప్రజలే గుర్తించి పట్టం కడతారు. ఇలా వ్యవస్థల ద్వారా ఒత్తిడి చేస్తే అసలుకే ఎసరు వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.